Begin typing your search above and press return to search.

గాయనితో కలసి ‘సారంగ దరియా’ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల

By:  Tupaki Desk   |   17 March 2021 2:10 PM GMT
గాయనితో కలసి ‘సారంగ దరియా’ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన శేఖర్ కమ్ముల
X
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగచైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా “లవ్ స్టోరి”. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ సినిమాలోని 'సారంగ దరియా' అనే పాటని ఇటీవలే విడుదల చేశారు. తక్కువ సమయంలో 50 మిలియన్ మార్క్ అందుకున్న టాలీవుడ్ సాంగ్ గా రికార్డులకెక్కింది. అదే సమయంలో ఈ పాట సేకరణ చేసిన జానపద గాయని కోమలి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల గాయని కోమలికే ఈ పాట క్రెడిట్ దక్కుతుందని పేర్కొంటూ సోషల్ మీడియాపోస్ట్ చేసారు. ఈ క్రమంలో తాజాగా కోమలితో మాట్లాడి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు శేఖర్ కమ్ముల.

ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ములను కలిసిన అనంతరం ‘సారంగ దరియా’ పాటను సినిమాలో ఉపయోగించడంపై ఇకపై తనకెలాంటి అభ్యంతరం లేదని కోమలి స్పష్టం చేసింది. కోమలి మాట్లాడుతూ.. ''సారంగ దరియా పాట లవ్ స్టోరీ సినిమాలో నాతో పాడించలేదనే బాధతో కొన్ని మీడియాల ద్వారా వ్యక్తం చేశాను. రేలారె రేలా ద్వారా సారంగ దరియా పాటను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ సురేష్ ద్వారా ఇవాళ దర్శకుడు శేఖర్ కమ్ముల గారిని కలిశాను. చాలా సంతోషంగా ఉంది. తన రాబోయో సినిమాల్లో అవకాశం ఉంటే నాతో తప్పకుండా పాట పాడిస్తానని ఆయన మాటిచ్చారు. అలాగే ‘లవ్ స్టోరి’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో స్టేజీ మీద ఈ పాట నాతోనే పాడిస్తానన్నారు. ఇక సారంగ దరియా పాట విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు'' అని అన్నారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ''ఇన్ని రోజులు కమ్యునికేషన్ ప్రాబ్లమ్ వల్ల కోమలి గారిని కలవలేకపోయాను. ఇవాళ ఇద్దరం మాట్లాడుకున్నాం. నేను ఆమెకు మాటిచ్చినట్లు ఫ్యూచర్ లో నా సినిమాలో జానపద పాట పాడించే అవకాశం ఉంటే తప్పకుండా కోమలికి అవకాశం ఇస్తాను. నేను సోషల్ మీడియా ద్వారా చేసిన ప్రామిస్ లను నిలబెట్టుకుంటానని ఆమెతో చెప్పాను. కోమలి గారు హ్యాపీగా ఫీలయ్యారు. ఇంతటితో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నాను'' అని చెప్పుకొచ్చారు.