Begin typing your search above and press return to search.

సినిమా ఎఫెక్ట్: బాయ్స్ స్కూల్లో అమ్మాయి

By:  Tupaki Desk   |   12 April 2018 4:20 AM GMT
సినిమా ఎఫెక్ట్: బాయ్స్ స్కూల్లో అమ్మాయి
X
సాధార‌ణంగా అమ్మాయిల స్కూల్లోకి అబ్బాయిల‌ని రానివ్వ‌రు. అబ్బాయిల స్కూల్‌కి వెళ్లాలంటేనే అమ్మాయిలు భ‌య‌ప‌డిపోతారు. కానీ సినిమాల ప్ర‌భావమో ఏంటో కానీ ఓ అబ్బాయిల స్కూల్లో అమ్మాయికి ఆడ్మిష‌న్ వ‌చ్చింది. డెహ్ర‌డూన్ లోని కోల్ బ్రైన్ కేంబ్రిడ్జ్ స్కూల్ లో జ‌రిగిందీ వింత‌. సినిమాల ప్ర‌భావం మ‌న మీద ఎంతుందో చెప్ప‌డానికి ఈ సంఘ‌ట‌న ఓ మంచి ఉదాహ‌ర‌ణ‌.

తెలుగులో చాలా రోజుల కింద‌ట ‘చ‌లాకీ’ అనే సినిమా వ‌చ్చింది. ఈ సినిమాలో అమ్మాయిల కాలేజీలో అబ్బాయికి ఆడ్మిష‌న్ వ‌స్తుంది. అంతే అమ్మాయిలంతా మ‌న హీరోని ఓ ఆటాడేసుకుంటారు. ఇప్పుడు దాని రివ‌ర్స్ లో అబ్బాయిల స్కూల్లో ఏరికోరి ఆడ్మిష‌న్ తీసుకుందో అమ్మాయి. ది వాయిస్ ఇండియా కిడ్స్ అనే పాట‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ...త‌న గొంతుతో దేశ‌వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది 11 ఏళ్ల షేకినా ముఖియా. అద్భుత‌మైన టాలెంటుతో ఫైన‌ల్‌కి కూడా దూసుకెళ్లింది. అయితే ఈ టీవీ ప్రోగ్రామ్ లో పాల్గొన‌డం వ‌ల్ల స్కూల్‌ కి స‌రిగా వెళ్ల‌లేక‌పోయిందీ ముఖియా. దాంతో అటెండెన్స్ త‌క్కువ‌గా ఉందంటూ ఆరు క్లాస్ నుంచి ఏడో క్లాస్ లోకి పంపించేందుకు నిరాక‌రించింది స్కూల్ యాజ‌మాన్యం.

దీంతో ఏం చేయాలో తెలియ‌ని స్థితిలో ఒక్క ఏడాది చ‌దువు వేస్ట్ అయిపోతుంద‌నే ఉద్దేశంతో కోల్ బ్రైన్ కేంబ్రిడ్జ్ స్కూల్ యాజ‌మాన్యాన్ని క‌లిశారు ముఖియా త‌ల్లిదండ్రులు. అది పూర్తిగా బాయ్స్ స్కూల్ అయిన‌ప్ప‌టికీ ముఖియా లాంటి టాలెంటెడ్ సింగ‌ర్ త‌మ స్కూల్లో చ‌దివితే... అది త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణంగా భావించిన స‌ద‌రు స్కూల్ యాజ‌మాన్యం వెంట‌నే ఆమెకి ఆడ్మిష‌న్ ఇచ్చేసింది. అంతే... అబ్బాయిల మ‌ధ్య‌లో అబ్బాయిల క‌లిసిపోయే చ‌దువుకుంటోంది ముఖియా. త‌మ స్కూల్లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయిని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నార‌ట ఈ స్కూల్ అబ్బాయిలంద‌రూ.

అయితే అలా చేయడానికి కారణం.. ''నేను దంగల్ సినిమా చూశాను. ఒక తండ్రి తన ఆడపిల్లలకు ప్రోత్సాహం అందిస్తే.. దాని రేంజ్ ఎలా ఉంటుందో ఆ సినిమా చూశాక నాకు అర్దమైంది. అందుకే నా కూతురు కోసం ఏమైనా చేయాలని డిసైడ్ చేసుకున్నాను'' అంటూ ఆ తండ్రి సెలవిచ్చాడు. అదండీ మంచి సినిమాల తాలూకు పవర్.