Begin typing your search above and press return to search.

శిల్పా శెట్టి మాటల్లోని అర్థం .. ఆంతర్యం అదేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2021 9:40 AM GMT
శిల్పా శెట్టి మాటల్లోని అర్థం .. ఆంతర్యం అదేనా?
X
శిల్పాశెట్టి .. రాజ్ కుంద్రా ఈ ఇద్దరూ కూడా మీడియాలో సందడి చేసే సెలబ్రిటీలే. అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా కనిపిస్తూ, సోషల్ మీడియాలో హల్ చల్ చేసినవారే. ఖరీదైన కార్లు .. విలాసవంతమైన భవనాలు .. విదేశాల్లో షికార్లు .. ఇలా అందరూ అసూయపడేలా వారి జీవితం సాగుతూ వచ్చింది. రాజ్ కుంద్రా ఏవో బిజినెస్ లు చేస్తున్నాడు .. శిల్పా శెట్టి టీవీ షోస్ .. యాడ్స్ చేయడంలో నాలుగు చేతులా సంపాదిస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆ కుటుంబంపై అందరికీ ఉన్న దృష్టి . అభిప్రాయాలు మారిపోయాయి.

రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నట్టుగా ఆరోపణలు రావడం .. వాటిని బలపరుస్తూ కొన్ని సాక్ష్యాలు బయటికి రావడం .. ఆయనను అరెస్ట్ చేయడం .. చకచకా జరిగిపోయాయి. అసలు ఏం జరుగుతుందో .. కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో శిల్పా శెట్టికి వెంటనే అర్థమైందో లేదో తెలియదుగాని, ఆమె చెప్పిన సమాధానాలు అతకలేదు. మొదట్లో తన భర్తను వెనకేసుకు వస్తున్నట్టుగా ఆమె మాటలు ఉన్నప్పటికీ, ఆ తరువాత ఆ మాటల్లో మార్పు వస్తూ కనిపించింది. అందుకు కారణం వాస్తవాలను ఆమె గ్రహిస్తూ రావడమేనని అంటారు.

కాలం కలిసొస్తే అన్నీ మన వెంటే వస్తాయి .. లేదంటే ఆ క్షణమే అన్నీ మనలను వదిలేస్తాయి అన్నట్టుగా, శిల్పా శెట్టి చేతిలో ఉన్న షోలు .. యాడ్స్ ఆమె చేతి నుంచి జారిపోయాయి. తన భర్త ఇలాంటి పనులు చేస్తున్నాడనే విషయం నిజంగా తనకి తెలియదనీ .. తాను బిజీగా ఉన్న సమయంలో ఇలాంటివి జరుగుతూ వచ్చాయనే విషయం తనకి అర్థమైందని ఆమె మీడియాతో చెప్పుకొచ్చింది. ఇక ఆమె తన భర్త నుంచి విడిపోవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఇన్ స్టాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. 'ఎవరూ కూడా జీవితంలో వెనక్కి వెళ్లి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించలేరు. కానీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టి సరైన ముగింపును ఇవ్వొచ్చు' అని ఆమె రాసుకొచ్చింది. రాజ్ కుంద్రాతో తన బంధాన్ని తెంచుకోవాలనే ఆలోచనతో ఆమె ఉందనడానికి ఇదే నిదర్శనమని అంతా అనుకుంటున్నారు. మరి శిల్పా శెట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో .. ఈ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.