Begin typing your search above and press return to search.

శిల్పా శెట్టి పండుగ చేసుకోవడం కూడా తప్పేనా?

By:  Tupaki Desk   |   9 Sep 2021 2:30 PM GMT
శిల్పా శెట్టి పండుగ చేసుకోవడం కూడా తప్పేనా?
X
బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగిన శిల్పాశెట్టి ఇప్పుడు తన భర్త వల్ల అభాసుపాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కెరీర్ లో సినిమాల పరంగా ఆకట్టుకొని ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ నటికి భర్త రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసులో అరెస్ట్ కావడం శరాఘాతంగా మారింది.

హీరోయిన్ గా ముగింపు దశకు వచ్చిన వేళ బ్రిటీష్ రియాలిటీ షో ‘బిగ్ బ్రదర్’లో నటించడం ద్వారా ఎక్కడ లేని పాపులారిటీని శిల్పా శెట్టి తెచ్చుకుంది. ఆ షోలో ఆమెపై వర్ణ వివక్ష చూపడంతో సానుభూతి వర్కవుట్ అయ్యి అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది.

ఇక ఆ తర్వాత రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకొని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ లో వాటా పొందింది. యోగా బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. భర్తతో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇలా శిల్పా రేంజ్ మారిపోయింది. కెరీర్ ముగిసిందనుకున్న స్థితి నుంచి ఆమె ఎదుగుదల చూసి తన తోటి హీరోయిన్లు అసూయ చెందారు.

కానీ సడెన్ గా భర్త అరెస్ట్ తో ఇప్పుడు శిల్పా శెట్టి జీవితం అల్లకల్లోలంగా మారింది. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా.. అశ్లీల వీడియోల కేసులో ఇరుక్కొని విచారణ ఎదుర్కొంటున్నారు. అతడిపై అభియోగాలు బలంగా ఉన్నాయి. రుజువైతే జైలు శిక్ష పడడం ఖాయమంటున్నారు. శిక్ష సంగతి పక్కనపెడితే ఇప్పట్లో అంత తేలికగా ఈ వ్యవహారం బయటపడేటట్లు కనిపించడం లేదు. కుంద్రా కేసు వల్ల పర్సనల్ అవకాశాలు కూడా కోల్పోతోంది. ఆమె జడ్జిగా వ్యవహరించే డ్యాన్స్ షో నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక ఆమె చేతిలో ఉన్న కమర్షియల్ బ్రాండ్స్ కొన్ని చేజారేలా కనిపిస్తున్నాయి. కొత్త బ్రాండ్లు ఏవీ ఆమెను సంప్రదించడం లేదు.

ప్రస్తుతం అశ్లీల వీడియోల కేసులో పీకల లోతు కష్టాల్లో పడ్డ రాజ్ కుంద్రా జైలులో ఉన్నారు. ఈ సమయంలో ఆయన భార్య శిల్పా శెట్టి వినాయక ఉత్సవాలకు సిద్ధపడ్డారు. పూజలు, పునస్కారాలు, నవరోజులు వేడుకలు చేసేందుకు పూనుకున్నారు. భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పాశెట్టిపై కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసులు విచారించారు కూడా. ఈ క్రమంలోనే శిల్పా శెట్టి వాటి నుంచి తేరుకొని ఇటీవలే తన కార్యకలాపాల్లో టీవీ ప్రోగ్రాములు, సినిమాల్లో యాక్టివ్ అయ్యారు.

అయితే శిల్పా శెట్టి వినాయక చవితి వేడుకలకు సిద్ధమవడంపై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. భర్త జైలులో ఉన్న బాధ శిల్పలో ఏమాత్రం కనిపించడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆచారాలు మరువకుండా పండుగ జరుపుకోవాలని అనడం ప్రశంసనీయం అని మరికొందరు ఆమెకు సపోర్టు చేస్తున్నారు.

కాగా శిల్పా శెట్టి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన నివాసంలో ఆడంబరంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తోంది.