Begin typing your search above and press return to search.

శివ.. ఆ సినిమాకు కాపీ.. అసలు విషయాన్ని బయటపెట్టిన వర్మ

By:  Tupaki Desk   |   13 July 2022 10:30 AM GMT
శివ.. ఆ సినిమాకు కాపీ.. అసలు విషయాన్ని బయటపెట్టిన వర్మ
X
'నా ఇష్టం' అన్న మాటకు తెలుగునాట కొత్త తరహాను పరిచయం చేసిన వ్యక్తి రాంగోపాల్ వర్మ. తెలుగు సినిమా గతిని మార్చేసి.. తన తొలి సినిమా 'శివ'తో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన అతగాడి టాలీవుడ్ మీద అంతా ఇంతా కాదు. అతగాడు తీసిన శివ మూవీ రిలీజ్ అయిన కొత్తల్లో యూత్ మొత్తం సైకిల్ చైన్లు పట్టుకొని తిరిగే వారు. అప్పటివరకు జరిగిన గొడవలకు భిన్నంగా.. శివలో మాదిరి.. చైన్లు.. రాడ్లతో దాడులు చేసుకోవటమే కాదు.. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమాను కొత్త తరహాలో తీయాలన్న ఆలోచనకు తెర తీసిన దర్శకుడిగా వర్మ నిలిచారు.

తనదైన కథ.. స్క్రీన్ ప్లే.. టేకింగ్ తో పాటు.. నటీనటుల ఎంపికలోనూ అప్పటివరకు సాగుతున్న మూస ధోరణి మొత్తాన్ని బద్ధలు కొట్టేసిన రాంగోపాల్ వర్మ.. అనతి కాలంలోనే అగ్ర దర్శకుడిగా మారారు. ఆ తర్వాత జరిగిందంతా తెలిసిందే. తెలుగు సినిమాను మార్చేసిన వర్మ.. ఇటీవల కాలంలో నాసిరకం సినిమాలు తీస్తూ జనాల చేత తిట్టించుకుంటున్న పరిస్థితి. పని మీద కంటే కూడా వివాదాల మీదనే ఎక్కువగా ఫోకస్ చేసే వర్మ తీరు తరచూ వార్తలుగా మారుతుంటాయన్న సంగతి తెలిసిందే.

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు మొత్తం కల్ట్ క్లాసికల్ గా నిలిస్తే.. ఇటీవలకాలంలో అతగాడు తీసిన సినిమాలు చెత్తకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయన్న విమర్శ ఉంది. ఇలాంటివేళ.. అతడు దర్శకత్వం వహించిన లడ్కీ (అమ్మాయి) హిందీ.. తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కావటంతో పాటు.. పాన్ ఇండియా మూవీగా మారింది. ఈ సినిమాను చైనాలోనూ విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. తన తాజా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న రాంగోపాల్ వర్మ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తాను తీసిన మొదటి మూవీ.. 'శివ'కు సంబంధించిన ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడించారు. దాదాపు 23 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మూవీ మొత్తం ఒక హాలీవుడ్ సినిమాను చూసి.. కాపీ కొట్టినట్లుగా పేర్కొన్నారు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీని చూసి శివ సినిమాను కాపీ కొట్టినట్లుగా చెప్పిన వర్మ.. 'ఆ సినిమాలో రెస్టారెంట్ కోసం హీరో పోరాడతాడు. శివ సినిమాలో కాలేజీ కోసం పోరాడతాడు. మిగిలిన స్క్రిప్టు మొత్తం సేమ్ టు సేమ్' అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు.

దాదాపు పాతికేళ్ల క్రితం తాను తీసిన మొదటి సినిమా మొత్తం కాపీనే అన్న షాకింగ్ నిజాన్ని తాజాగా వెల్లడించిన వర్మ.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాల్ని సైతం వెల్లడించారు. శివ సినిమా స్క్రిప్టును 20 నిమిసాల్లో రాయగలిగానని.. ఎందుకంటే.. అక్కడ రెస్టారెంట్ తీసి కాలేజీ బ్రాక్ గ్రౌండ్ ను పెట్టానని..

అందుకే చాలా త్వరగా రాయగలిగినట్లుగాచెప్పారు. టాలీవుడ్ ను తీవ్రంగా ప్రభావితం చేసిన 'శివ' కాపీ అన్న చేదు నిజం బయటకు రావటం.. దాని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో వర్మ నోటి నుంచి ఈ తరహా షాకులు మరెన్ని బయటకు వస్తాయో?