Begin typing your search above and press return to search.

ఆర్టిస్టుల కోసం ఓల్డేజ్ హోమ్

By:  Tupaki Desk   |   25 Feb 2019 8:59 AM GMT
ఆర్టిస్టుల కోసం ఓల్డేజ్ హోమ్
X
మూవీ ఆర్టిస్టుల సంఘం `మా` అధ్య‌క్షుడు శివాజీరాజా ఓ కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే `మా` అసోసియేష‌న్ త‌ర‌పున ఫించ‌న్ ప‌థ‌కం - విద్యా ల‌క్ష్మి - క‌ళ్యాణ ల‌క్ష్మి వంటి ప‌థ‌కాలు అమ‌ల్లో ఉన్నాయి. వీటితో పాటు ఒక ఓల్డేజ్ హోమ్ (వృద్ధాశ్ర‌మం)ని నిర్మించాల‌న్న‌ది నా జీవితాశయం అని ప్ర‌క‌టించారు. అందుకోసం ఇప్ప‌టికే స్థ‌లాల ప‌రిశీల‌న సాగింద‌ని - వాటిని డొనేట్ చేసేందుకు దాత‌లు సిద్ధంగా ఉన్నార‌ని వెల్ల‌డించారు. త‌న‌కు వృద్ధాశ్ర‌మం నిర్మించాల‌న్న ఆలోచ‌న రావ‌డానికి కార‌ణాన్ని ఆయ‌న వివ‌రించారు.

సీనియ‌ర్ ఆర్టిస్ట్ రంగ‌నాథ్ గురించి.. ఆయ‌న చివరి రోజుల గురించి తెలిసిందే. ఆయ‌న మ‌ర‌ణం న‌న్ను ఎంత‌గానో క‌ల‌చివేసింది. అందుకే ఆయ‌న‌లా ఏ ఇత‌ర ఆర్టిస్టు ఓల్డ్ ఏజ్ లో అంత ఇబ్బంది ప‌డ‌కూడ‌ద‌నే దూర‌దృష్టితో ఈ ఆలోచ‌న చేస్తున్నామ‌ని శివాజీ రాజా తెలిపారు. 16 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో మ‌ర‌ణించాల్సిన నేను ఇన్నేళ్లు బ‌తికి ఉండ‌డ‌మే బోన‌స్. అందుకే ఒక మ‌నిషిగా నేను మంచి ప‌నులు చేయాల‌నే సంక‌ల్పించాను. అందుకే ఇన్నేళ్ల‌లో దేశంలోనే ఏ ప‌రిశ్ర‌మ‌లోనూ ఆర్టిస్టుల సంఘం త‌ర‌పున చేయ‌లేని ప‌నుల్ని చేస్తున్నామ‌ని అన్నారు.

ఓల్డేజ్ హోమ్ ఆలోచ‌న న‌చ్చిన ఓ అమెరికా ఎన్నారై ఆరు ఎక‌రాల భూమిని `మా` అసోసియేష‌న్ కి దాన‌మిస్తాన‌ని అన్నారు. అలాగే వేరొకాయ‌న శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలోని ఓ గ్రామం వ‌ద్ద 10 ఎక‌రాల గుట్టను దానమివ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. వీటిలో ఏదో ఒక‌టి ఎంపిక చేసుకుని అక్క‌డ ఓల్డేజ్ హోమ్ ని నిర్మిస్తాం. 10 శాతం మీడియాలో వృద్ధులైన జ‌ర్న‌లిస్టుల‌కు అవ‌కాశం క‌ల్పిస్తాం అని తెలిపారు. కేర‌ళ‌లో ఉండే అంద‌మైన హ‌ట్స్ త‌ర‌హాలో వీటిని నిర్మించాల‌న్న ఆలోచ‌న ఉంది అని ఆయ‌న‌ వెల్ల‌డించారు. త‌న‌కు పుట్టిన‌రోజు వేడుక‌లు చేసుకునే అల‌వాటు లేద‌ని తెలిపారు. మార్చి 10న మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంద‌ర్భంగా నేడు ప్ర‌త్యేకించి మీడియా స‌మావేశాల్లో శివాజీ రాజా మాట్లాడ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇన్నేళ్ల‌లో ఏనాడూ ఇండ‌స్ట్రీలో బ‌ర్త్ డేలు చేసుకోని ఆయ‌న రేపు ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజును సాటి ఆర్టిస్టుల న‌డుమ జ‌రుపుకోనున్నారు. ఆయ‌న ప‌థ‌కాల వ‌ల్ల ల‌బ్ధి పొందిన వంద‌లాది ఆర్టిస్టులు నేడు ఫిలింఛాంబ‌ర్ కార్యాల‌యానికి విచ్చేశారు. శివాజీ రాజా మ‌రోసారి మా అధ్య‌క్షుడిగా కొన‌సాగాలాని నిన‌దించారు.