Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ నోటీసుల‌పై మా అధ్య‌క్షుడి మాట ఇదే!

By:  Tupaki Desk   |   14 July 2017 10:35 AM GMT
డ్ర‌గ్స్ నోటీసుల‌పై మా అధ్య‌క్షుడి మాట ఇదే!
X
హైద‌రాబాదు మ‌హా న‌గ‌రంతో పాటు యావ‌త్తు తెలుగు నేల‌లో తీవ్ర క‌ల‌క‌లంగా మారిన మాద‌క‌ద్ర‌వ్యాల వ్య‌వ‌హారంపై ఇప్పుడు పెద్ద స‌స్పెన్సే న‌డుస్తోంది. కెల్విన్ అనే ఓ డ్ర‌గ్స్ వ్యాపారితో పాటు అత‌డి ఇద్ద‌రు అనుచ‌రుల‌ను ఎక్సైజ్ ఎన్‌ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన ద‌రిమిలా... వారి సెల్ ఫోన్ల‌లోని డేటా ఆధారంగా కూపీ లాగుతున్న పోలీసులు డ్ర‌గ్స్ వాడుతున్న వారు వంద‌ల్లోనే కాకుండా వేలు, ల‌క్ష‌ల్లో కూడా ఉన్నారంటూ మీడియాకు లీకులు ఇచ్చేసి... పెద్ద దుమార‌మే రేపారు. ఇప్పుడు ఎక్క‌డ విన్నా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపైనే చ‌ర్చ న‌డుస్తోంది.

ఇదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ దందాతో టాలీవుడ్‌ కు కూడా సంబంధాలున్నాయ‌ని, కెల్విన్ సెల్ ఫోన్ డేటాలో ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయ‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వీరంద‌రికీ పోలీసులు నోటీసులు జారీ చేశార‌ని, త్వ‌ర‌లోనే వీరంతా పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందేన‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌ లోని 12 మంది ప్ర‌ముఖుల‌కు నోటీసులు అందాయ‌ని, వారి పేర్ల‌తో స‌హా క‌థ‌నాలు వ‌చ్చేశాయి.

దీనిపై ఎవ‌రికి వారుగా టాలీవుడ్ ప్ర‌ముఖులు స్పందిస్తుండ‌గా... టాలీవుడ్‌ కు పెద్ద దిక్కుగా ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడి హోదాలో శివాజీ రాజా కూడా కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే పోలీసుల మాదిరే ఆయ‌న కూడా అంత పెద్ద‌గా స్ప‌ష్టత లేకుండానే మాట్లాడేసి మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ పెంచేశార‌నే చెప్పాలి. డ్ర‌గ్స్ దందాకు సంబంధించి టాలీవుడ్‌ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు నోటీసులు జారీ అయిన మాట వాస్త‌వమేన‌ని ఒప్పుకున్న ఆయ‌న‌... అయితే మీడియాలో వ‌స్తున్నంత మేర సంఖ్య‌లో నోటీసులు అంద‌లేద‌న్నారు. అయితే మీడియా మాత్రం గోరంత‌ల‌ను కొండంత‌లు చేసేస్తూ వార్త‌లు రాస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

మీడియా చెబుతున్న లిస్ట్ లో నోటీసులు వ‌చ్చిన వారి పేర్ల‌తో పాటు ఏ పాపం ఎరుగ‌ని, నోటీసులు రాని వారి పేర్లు కూడా ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయినా శివాజీ రాజా ఏమ‌న్నారంటే.... *ఇండస్ట్రీలో కొంతమందికి నోటీసులు రావటం వాస్తవమే, అయితే నోటీసులు రాని వారి పేర్లు కూడా మీడియాలో వినిపిస్తుండటం బాధాకరం. తప్పు చేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు, కానీ చేయని వారిని నిధించటం సరికాదు. నోటీసులు అందిన వారి పేర్లను వేసే విషయంలో మీడియా సంయమనం పాటించాలి* అని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.