Begin typing your search above and press return to search.

మా ఎల‌క్ష‌న్‌: మెగాస్టార్ ని అవ‌మానించారా?

By:  Tupaki Desk   |   8 March 2019 5:28 AM GMT
మా ఎల‌క్ష‌న్‌: మెగాస్టార్ ని అవ‌మానించారా?
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు మార్చి 10న జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల వేడి రాజుకుపోతోంది. అంత‌కంత‌కు హీట్ పెంచేస్తోంది. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న శివాజీ రాజా - సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్స్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. గ‌త రెండు రోజులుగా సీనియ‌ర్ న‌రేష్ మీడియాల‌ కెక్కి త‌న‌ని విమ‌ర్శించ‌డంతో శివాజీ రాజా ఎంతో ఎమోష‌న్ అవ్వ‌డం మీడియా లైవ్ ల‌లో క‌నిపించింది. న‌రేష్ విమ‌ర్శ‌ల్లో నిజానిజాలెంత‌? అన్న‌దానిపైనా ఆర్టిస్టుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

గురువారం సాయంత్రం హైద‌రాబాద్ ఎఫ్ ఎన్‌ సీసీలో జ‌రిగిన శివాజీ రాజా ప్యానెల్ మీడియా స‌మావేశంలో శివాజీ రాజా కంటత‌డి పెట్టడం.. న‌రేష్ పై కొన్ని సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేయ‌డం వేడెక్కిస్తోంది. ``పెద్ద‌లు అంటే మ‌ర్యాద లేదు కొంద‌రికి`` అంటూ సీనియ‌ర్ న‌రేష్ ని సూటిగానే విమ‌ర్శించింది ఆ ప్యానెల్ బృందం. దాంతో శివాజీ రాజాను తొలి నుంచి స‌పోర్ట్ చేస్తున్న మెగాస్టార్‌ కి సీనియ‌ర్ న‌రేష్ గౌర‌వం ఇవ్వ‌లేదా? అంటూ మీడియా వ‌ర్గాల్లోనూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. న‌రేష్ ప‌ద‌వీ కాంక్ష‌పైనా .. అత‌డి వ్య‌క్తిత్వంపైనా శివాజీ రాజా ప్యానెల్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది.

శివాజీ రాజా మాట్లాడుతూ-``నరేష్ నా సోదరుడే.. ఇప్పటికి మేమిద్దరం బావుంటాం. కానీ నన్ను దారుణంగా అవమానించాడు. అది తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది. అధ్య‌క్ష పదవినే అవమానించాడు. చాలా కార్యక్రమాల్లో నరేష్ నాకు ఎలాంటి సహకారం అందించలేదు. తాను బిజీలో రాలేక‌పోతున్నాన‌ని చెబితే అర్థం చేసుకుని సర్దుకుపోయాను. కానీ మెగాస్టార్ చిరంజీవి అంత‌టి పెద్ద స్టార్ తో అమెరికాలో ఈవెంట్ నిర్వహిస్తే.. దాని రిహార్సల్స్ కి కూడా నరేష్ హాజరు కాలేదు. ఈవెంట్ కోసం ఆర్టిస్టుల కోఆర్డినేషన్ కూడా చేయ‌లేదు. స్నేహితుడు శ్రీకాంత్ తోడుగా ఉండడం వ‌ల్ల‌నే నిల‌బ‌డ‌గ‌లిగాను`` అని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసారు. శివాజీరాజాకు శ్రీకాంత్ - కమెడియన్ పృథ్వి - నటుడు నాగినీడు త‌దిత‌ర బృందం అండ‌గా నిలుస్తున్న సంగ‌తి తెలిసిందే. ``వ‌చ్చే సీజ‌న్ కి నువ్వు అధ్య‌క్షుడిగా ఉండు.. ఈసారికి మంచి ప‌నులు చేస్తున్న‌ శివాజీరాజాకి అండ‌గా నిలవాల్సిందిగా న‌రేష్ ని మెగాస్టార్ చిరంజీవి కోరార‌ని అయితే అందుకు న‌రేష్ ఒప్పుకోకుండా పోటీకి దిగాడని ఆర్టిస్టుల్లో ముచ్చ‌ట సాగ‌డం వేడెక్కించింది. అయితే శివాజీ రాజా చేసిన ఆరోప‌ణ‌ల‌పై న‌రేష్ స్పందించాల్సి ఉంది. అస‌లు నిజాలేంటో ఆయ‌న చెప్పాల్సి ఉంది.