Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల వేళ `మా`లో లుక‌లుక‌లు?

By:  Tupaki Desk   |   15 Feb 2019 8:11 AM GMT
ఎన్నిక‌ల వేళ `మా`లో లుక‌లుక‌లు?
X
ఎన్నిక‌లొస్తే ఘ‌ర్ష‌ణ‌లు బ‌య‌ట‌ప‌డ‌తాయ్.. వాతావ‌ర‌ణం వేడెక్కిపోతుంది. ప‌ద‌వి కోసం ఎంత‌కైనా తెగించ‌డం నాయ‌కుల ల‌క్ష‌ణం. అది చిన్న‌దైనా.. పెద్దదైనా.. ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన‌ ఇష్యూ. పైగా 750 మంది స‌భ్యులున్న‌ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించాల్సి ఉంటుంది. `మా` అసోసియేష‌న్ కు ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. అంతేకాదు.. రాబోవు ఎన్నిక‌ల్లో క‌ల్లోలానికి ఛాన్సుంద‌ని, సంఘంలో అంత‌ర్గ‌త క‌ల్లోలం ఉవ్వెత్తున తెర‌పైకి రానుంద‌ని లీకులు అందాయి.

ఎన్నిక‌ల‌తో సంబంధం లేకుండానే గ‌త ఏడాది అంతా మా అసోసియేష‌న్ జ‌నాల నోళ్ల‌లో పడింది. క‌మిటీ కీల‌క స‌భ్యులే రోడ్డెక్క‌డంతో మీడియా లైవ్ లో `మా` అబాసుపాలైంది. `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్ మ‌ధ్య మాటా మాటా పెరిగి.. సీన్ ఎక్క‌డికో వెళ్లింది. నిధుల గోల్ మాల్ పై విచారించాలి! అంటూ పెద్ద ర‌భ‌స జ‌ర‌గ‌డంతో పెద్ద‌లు పూనుకుని స‌ద్ధుమ‌ణిగేలా చేయాల్సి వ‌చ్చింది. అదంతా గ‌తం అని అనుకుని అప్ప‌టికి వ‌దిలేసినా ప్ర‌స్తుతం ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది కాబ‌ట్టి మ‌ళ్లీ కార్చిచ్చు రగులుకునేందుకు ఆస్కారం ఉంద‌ని స‌మాచారం అందుతోంది. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఆర్టిస్టుల్లో గుస‌గుస‌లు వేడెక్కిస్తున్నాయ్.

మార్చి 10న `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి ఎన్నిక‌ల్లో ద్విముఖ పోరు ఖాయ‌మైంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుత అధ్య‌క్షుడు శివాజీ రాజాపై పోటీకి దిగేందుకు న‌రేష్ స‌న్న‌ద్ధంగా ఉన్నార‌ట‌. అంటే ఇరు వ‌ర్గాల మ‌ధ్య హోరాహోరీ తప్ప‌ద‌నే దీన‌ర్థం. అయితే క‌మిటీలో మెజారిటీ జ‌నం మ‌రోసారి శివాజీరాజానే అధ్య‌క్షుడిగా ఉంటే బావుంటుంద‌ని భావించి.. అత‌డిని ఏకగ్రీవం చేయాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెస్తున్నార‌ని తెలిసింది. అందుకు ప్ర‌త్యేకించి కార‌ణం లేక‌పోలేదు. గ‌త ఏడాది మా అసోసియేష‌న్ ఎన్ని ర‌కాలుగా వివాదాల్లోకి వ‌చ్చినా శివాజీ రాజా కొన్ని మంచి ప‌నులు చేయ‌డంలో స‌ఫ‌ల‌మ‌య్యారు. పేద క‌ళాకారుల‌కు నిజాయితీగా ఫించ‌ను ఇవ్వ‌డం, పేద క‌ళాకారుల ఆడ‌ బిడ్డ‌ల‌కు పెళ్లిల్ల కోసం, చ‌దువుల కోసం సాయమ‌య్యేలా కొత్త ప‌ధ‌కాల్ని ప్ర‌వేశ పెట్ట‌డం.. వీటితో పాటు సీనియ‌ర్ ఆర్టిస్టుల‌ను జ‌న‌ర‌ల్ బాడీ మీటింగుల‌కు పిలిచి ఆదుకోవడం, లేదా వారి స్థితిగ‌తుల్ని తెలుసుకోవ‌డం వంటి ఎన్నో కార్య‌క్ర‌మాలు చేశారు. మా సొంత‌ భ‌వంతి నిర్మాణంపైనా క్లారిటీతోనే ఉన్నారు. అందువ‌ల్ల మ‌రోసారి శివాజీ రాజాకే ఆ ఛాన్స్ ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఎవ‌రెన్ని చేసినా.. ఏక‌గ్రీవానికి అంగీక‌రించ‌కుండా పోటీబ‌రిలో దిగేందుకే ఇప్ప‌టికే న‌రేష్ సంసిద్ధంగా ఉన్నార‌న్న స‌మాచారం వేడెక్కిస్తోంది.