Begin typing your search above and press return to search.

సీనియర్ హీరో కూతురి డెబ్యూ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందా...?

By:  Tupaki Desk   |   2 July 2020 2:30 PM GMT
సీనియర్ హీరో కూతురి డెబ్యూ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుందా...?
X
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ - జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక ఇప్పటికే వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. 'దొరసాని' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివాత్మిక నటిగా తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారు. ఇప్పుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కూడా వెండితెర ఆరంగేట్రం చేస్తున్నారు. నిజానికి శివాని డెబ్యూ మూవీ మధ్యలో ఆగిపోవడంతో అక్క కంటే ముందు చెల్లి శివాత్మిక టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ ఫాంటసీ లవ్ స్టోరీతో శివానీ రాజ‌శేఖ‌ర్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఆమె 'వెన్నెల' అనే రోల్‌ ప్లే చేయబోతోంది.

శివాని పుట్టినరోజు సందర్భాన్ని పురష్కరించుకొని సినిమాలో ఆమె పోషిస్తోన్న క్యారెక్టర్ ప‌రిచ‌య పోస్టర్‌ ను చిత్ర బృందం విడుద‌ల చేయగా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంతో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రానికి కే. మల్లిఖార్జున్ రామ్ వహించారు. మహాతేజా క్రియేషన్స్ మరియు ఎస్.ఒరిగినల్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా తేజ - శివాని హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకి 'అద్భుతం' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. లాక్ డౌన్ కి ముందే ఈ మూవీ చాలా వరకు చిత్రీకరణ జరుపుకుంది. చిత్రీకరణ స్టార్ట్ చేసిన వెంటనే మిగతా షూటింగ్ కంప్లీట్ చేయనున్నారు. ఇంకా అధికారికంగా పేరు ఖరారు చేయని ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి డైరెక్ట్ ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.