Begin typing your search above and press return to search.

బాహుబ‌లికి ప్రీక్వెల్ రాబోతోంది:శోభు యార్ల‌గ‌డ్డ‌

By:  Tupaki Desk   |   6 May 2018 7:27 AM GMT
బాహుబ‌లికి ప్రీక్వెల్ రాబోతోంది:శోభు యార్ల‌గ‌డ్డ‌
X
టాలీవుడ్ స్టామినాను `బాహుబ‌లి` చిత్రం ప్ర‌పంచానికి చాటి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఎన్నో అవార్డులు, మ‌రెన్నో రివార్డుల‌తో పాటు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో మంది ఆద‌ర‌ణ‌ను బాహుబ‌లి చూరగొంది. అయితే, బాహుబ‌లి-2 విడుద‌ల త‌ర్వాత బాహుబ‌లి-3 తీయ‌బోతున్నార‌ని పుకార్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆ ఉద్దేశ్యం లేద‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌డంతో ఆ పుకార్ల‌కు తెర‌ప‌డింది. తాజాగా, బాహుబ‌లి సిరీస్ నుంచి మ‌రో పార్ట్ రాబోతోంద‌ని ఆ చిత్ర నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే బాహుబ‌లికి ప్రీక్వెల్ నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు. మూడేళ్ల‌పాటు ఆ ప్రీక్వెల్ ను చిత్రీక‌రించ‌బోతున్నామ‌ని శోభు ....ఓ పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఐఐఎఫ్‌ఏ-2016 ఉత్తమ చిత్రంగా`బాహుబలి - ది బిగినింగ్`ఎంపికైన సంగ‌తి తెలిసిందే. `జాతీయ చలనచిత్ర పురస్కారం-2017కుగానూ ఉత్తమ ప్రజాదరణ విభాగంలో `బాహుబలి - ది కన్‌క్లూజన్‌` అందుకుంది. ఈ నేప‌థ్యంలోనే బాహుబ‌లి-3 పై ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే, సీక్వెల్ ఉండ‌క‌పోవ‌చ్చని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా, బాహుబ‌లి ప్రీక్వెల్ పై శోభు స్వ‌యంగా ప్ర‌క‌ట‌న చేశారు. ఆగస్టు నుంచి కొత్త న‌టీ నటులతో బాహుబలి ప్రీక్వెల్‌ నిర్మించాలని నిర్ణయించిన‌ట్లు శోభు తెలిపారు. గ‌తంలో నిర్మించిన మాహిష్మతి సామ్రాజ్యం సెట్ అలాగే ఉంద‌ని, దానితోపాటు మరికొన్ని సెట్లు వేస్తున్నామ‌ని శోభు అన్నారు. ఆ ప్రీక్వెల్ ను మూడేళ్లపాటు చిత్రీకరిస్తామ‌న్నారు.

ఇంగ్లిషు, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌ సిరీస్ కు సన్నాహాలు చేస్తున్నామ‌ని శోభు అన్నారు. 192 దేశాల్లో ఒకేసారి లైవ్ వెళ్లేవిధంగా ప్లాన్ చేస్తున్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌న్నారు. కాగా, 'ది రైజ్ ఆఫ్ సివగామి' పేరిట ర‌చ‌యిత ఆనంద్ నీలకంఠన్ రాసిన నవలను గ‌తంలో విడుదల చేసిన‌ సంగతి తెలిసిందే. ఆ న‌వ‌ల ఆధారంగానే ఈ ప్రీక్వెల్ ను రూపొందించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. బాహుబ‌లిలో కీల‌క పాత్ర అయిన శివగామి బాల్యం....నుంచి మాహిష్మతి సామ్రాజ్య రాజ‌మాత‌గా విస్తరించిన తీరు... కట్టప్ప ఎవ‌రు? ఎక్కడివాడు? మాహిష్మ‌తికి బానిస ఎందుకు కావాల్సి వ‌చ్చింది అన్న విష‌యాల‌ను ఆ ప్రీక్వెల్ లో చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఏది ఏమైనా బాహుబ‌లి ప్రియుల‌కు ఈ ప్రీక్వెల్ ఓ శుభ‌వార్త వంటిద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే, ఆ ప్రీక్వెల్ ను వీక్షించేందుకు మూడేళ్ల పాటు నిరీక్షించ‌క త‌ప్ప‌దు మ‌రి.