Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ గురించి షాకింగ్ విష‌యాలు

By:  Tupaki Desk   |   27 Sep 2016 10:30 PM GMT
ఆ డైరెక్టర్ గురించి షాకింగ్ విష‌యాలు
X
డిప్రెష‌న్. ఆధునిక జీవన శైలితో ఒత్తిడిని త‌ట్టుకోలేక ఈ త‌రం ఎదుర్కొంటున్న పెద్ద స‌మ‌స్య ఇది. సామాన్యుల నుంచి సెల‌బ్రెటీల వ‌ర‌కు అంద‌రూ దీని బాధితులే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే సైతం డిప్రెష‌న్ బారిన ప‌డి ఎంత వేద‌న అనుభ‌వించిందో కొన్ని నెల‌ల కింద‌టే వెల్ల‌డైంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ కూడా దీని బాధితుడే అని తాజాగా వెల్ల‌డైంది. డిప్రెష‌న్ కార‌ణంగా రెండేళ్ల‌కు పైగా తీవ్ర మ‌నోవేద‌న‌కు గురయ్యాన‌ని.. పిచ్చివాడిలా త‌యార‌య్యాన‌ని క‌ర‌ణ్ జోహార్ తెలిపాడు. త‌న వేద‌న గురించి క‌ర‌ణ్ ఏమ‌న్నాడో అత‌డి మాట‌ల్లోనే..

‘‘రెండేళ్ల కింద‌ట నేను తీవ్ర‌మైన మాన‌సిక వేద‌న ఎదుర్కొన్నాను. డిప్రెష‌న్లో ఉన్నాను. ఆ స‌మ‌యంలో నేను చాలా హెల్ప్ లెస్ గా ఫీలయ్యేవాడిని, చాలా నిరాశ‌గా అనిపించేది. నా బాధ‌కు కార‌ణ‌మేంటో తెలిసేది కాదు. ఈ బాధ భ‌రించ‌లేక ముంబ‌యి వదిలి పారిపోతూండే వాడిని. విమానాల్లో తిరుగుతూండేవాడిని. వేరే సిటీల్లో ఏమీ తోచక రోడ్డుపై దిక్కు తోచక చక్కర్లు కొట్టేవాడిని. ఎవరితోనూ ఏమీ చెప్పాల‌నిపించేది కాదు. ఏమీ మాట్లాడేవాడిని కాదు. బెడ్ మీది నుంచి లేవాల‌నిపించేది కాదు. నా బాధ‌కు కార‌ణ‌మేంట‌ని చాలా ఆలోచించేవాడిని.

44 ఏళ్ల వ‌య‌సులో డిప్రెషన్లోకి వెళ్ల‌డానికి కార‌ణం రిలేష‌న్ షిప్ లేక‌పోవ‌డ‌మే కావ‌చ్చు. నాన్న చ‌నిపోయాడు. ఎవ‌రితోనూ రిలేష‌న్ షిప్ లేదు. ప్రేమ లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం కావ‌చ్చు. రెండేళ్ల క్రితం నాకు నా మానసిక స్థితి గురించి తెలిసింది. ఒకసారి గుండెపోటు వచ్చిందేమోనని అనుకున్నాను. వైద్యుడిని క‌లిసేవ‌ర‌కు నేను డిప్రెష‌న్లో ఉన్న సంగ‌తి తెలియ‌దు. రెండేళ్ల పాటు మందులు వాడితే ఈ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాను. 3 నెలల ముందు చికిత్స ఆపేశాను. ఇప్పుడు నా ప‌రిస్థితి బాగానే ఉంది’’ అని క‌ర‌ణ్ తెలిపాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/