Begin typing your search above and press return to search.

సంతాప సభలో షాకింగ్ మాట: మార్కెట్ రేటుకు రెబల్ స్టార్ కు ఫ్లాట్ ఇవ్వలేదు

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:56 AM GMT
సంతాప సభలో షాకింగ్ మాట: మార్కెట్ రేటుకు రెబల్ స్టార్ కు ఫ్లాట్ ఇవ్వలేదు
X
రెబల్ స్టార్ గా సుపరిచితులు కృష్ణంరాజు అందరిని వదిలేసి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవటం తెలిసిందే. సీనియర్ నటీనటులు మరణించినా.. పెద్దగా స్పందించని చిత్ర పరిశ్రమ అందుకు భిన్నంగా ఆయన సంతాప సభను నిర్వహించటం చూసినప్పుడు.. పలువురికి దక్కని గుర్తింపు ఆయనకు దక్కిందని చెప్పాలి. ఈ సందర్భంగా పలువురు వక్తలు నోరు విప్పి మాట్లాడినా.. మిగిలిన వారికి భిన్నంగా సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం మనసులోని మాటల్ని చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీశాయని చెప్పాలి.

తాను నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రానికి హీరో కృష్ణంరాజు అన్న విషయాన్ని గుర్తు చేసిన తమ్మారెడ్డి.. ఆ సినిమాలో ఆయనకు నాలుగు పాటలు ఉంటే.. ఆయనకు నాలుగు పాటలు పెడితే బాగోదన్న విషయాన్ని ఆయనకే తాను నేరుగా చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రానికి దర్శకుడు తన సోదరుడే అని.. ఆయనకు పాటలు వద్దంటే.. ఎలా? అన్నారని.. దీంతో నిర్మాతగా కొత్త అయినప్పటికీ కృష్ణంరాజు వద్దకు వెళ్లి.. బాబాయ్ నాలుగు పాటలు అంటున్నారు.. మీలాంటి సీరియస్ హీరోకి పాటలు పెడితే ఏం బాగుంటుందని మనసులోని మాటను నేరుగా చెప్పేశానన్నారు.

ఇంకో హీరో అయితే.. బూతులు తిట్టే వారని.. కానీ కృష్ణంరాజు మాత్రం నా వైపు చూసి నవ్వి.. నేను పనికి రానా? అని అడిగారని.. ఆ తర్వాత తాను చెప్పినట్లే సినిమాలో పాటలు లేకుండానే పూర్తి చేసినట్లు చెప్పారు. ఇలా మరే హీరో కూడా చేయలేని పని కృష్ణంరాజు చేసే వారని..

మనసులో ఏమీ పెట్టుకునే వారని చెప్పారు. ఇదిలా ఉంటే.. గడిచిన ఐదేళ్లలో ఆయన ఫోన్ చేస్తే.. లిఫ్టు చేసేందుకు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. అలాంటి తాను ఇక్కడికి వచ్చి మాట్లాడాలన్నా తనకు సిగ్గుగా అనిపించినట్లు చెప్పారు.

మూడేళ్ల క్రితం మూవీ టవర్స్ కు వచ్చి.. ఫ్లాట్ కొనేందుకు ఆసక్తి చూపించారని.. మార్కెట్ రేటు ఉంటుందని చెబితే.. ఎంతైనా ఫర్లేదని చెప్పారన్నారు. కారణం ఏమైనా.. ఆయనకు ప్లాట్ ఇవ్వలేకపోయామన్నారు. మార్కెట్ ధరకు డబ్బులు ఇస్తామని చెప్పినా ఫ్లాట్ ఇవ్వలేకపోవటం బాగోలేదన్నారు. ఆ తర్వాత ఆ సంస్థ నుంచి తాను బయటకు వచ్చేసినట్లు చెప్పారు. సినిమా వ్యక్తికి మార్కెట్ ధరకు కూడా ఫ్లాట్ ఇవ్వలేకపోతున్నందుకు సిగ్గుపడినట్లు చెప్పుకున్నారు.

మనిషి పోయిన తర్వాత సంతాప సభ పెట్టటం.. శ్రద్దాంజలి ఘటించటం కాదని.. సీనియర్ ఆర్టిస్టులను గౌరవించటం నేర్చుకోవాలన్నారు. ఇండస్ట్రీలో పెట్టే ఏ అసోసియేషన్ అయినా చిత్ర పరిశ్రమలోని వారికి మంచి చేసేందుకే అని.. అలా కాకుండా వ్యాపారం చేద్దామనుకుంటే మాత్రం.. దానికి మించి సిగ్గు పడాల్సిన విషయం మరొకటి ఉండదన్నారు. మనసులోనిది దాచుకోలేకే చెప్పేస్తున్నానని.. తనను క్షమించాలని కోరుతూ ఓపెన్ అయిపోయారు తమ్మారెడ్డి.

అంతలా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా చెప్పే దమ్ము.. ధైర్యం తమ్మారెడ్డికేనని చెప్పాలి. పనిలో పనిగా.. కృష్ణంరాజుకు మార్కెట్ ధరకు ప్లాట్ ఇవ్వకపోవటానికి వెనుకున్న కారణం మీదా ఓపెన్ అయిపోతే మరింత క్లారిటీ వచ్చేదని మాత్రం చెప్పక తప్పదు..


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.