Begin typing your search above and press return to search.

ఇన్ని రూల్స్ పాటిస్తూ షూటింగ్స్ చేయడం జరిగే పనేనా...?

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:00 PM GMT
ఇన్ని రూల్స్ పాటిస్తూ షూటింగ్స్ చేయడం జరిగే పనేనా...?
X
సినీ ఇండస్ట్రీ గత రెండున్నర నెలలుగా మూతబడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు సినిమా షూటింగులకు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతిస్తూ వస్తున్నాయి. కాకపోతే కొన్ని షరతులను నిబంధనలతో మాత్రమే అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా జూన్ 15 నుండి సీరియల్స్ మరియు సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చని వెల్లడించాయి. తెలంగాణా ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ రూల్స్ ప్రకారం షూటింగ్ స్పాట్ లో ఉండే నటీనటులు టెక్నీషియన్స్ సహాయ సిబ్బంది ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. సెట్స్ లో అందరూ భౌతిక దూరం పాటిస్తూ ఉండాలి. షూటింగ్ ఎక్కడ జరిగినా వెంట ఒక డాక్టర్ కంపల్సరీగా ఉండాలి. శానిటైజర్స్ అండ్ మాస్క్స్ షూటింగ్ లొకేషన్స్ లో ఎంట్రీ అండ్ ఎక్జిట్ పాయింట్స్ వద్ద అందుబాటులో ఉంచాలి. చిత్రీకరణ సమయంలో లొకేషన్ లో 40 మందికి మించి ఉండరాదు. షూటింగ్ స్పాట్ లో పొగత్రాగడం.. పొగాకు ఉత్పత్తులు నమలడం పూర్తిగా నిషిద్ధం అని పేర్కొన్నారు.

అంతేకాకుండా 10 ఏళ్ళ లోపు పిల్లలను 60 ఏళ్ళ పై బడిన వారు షూటింగ్ లో పాల్గొనాలంటే మెడికల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. షూటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరూ చిత్రీకరణలో పాల్గొనకముందే మెడికల్ సర్టిఫికెట్.. మెడికల్ స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. విజిటర్స్ ని షూటింగ్ లొకేషన్స్ లోకి అనుమతించ కూడదు. వీలైనంత వరకు సినిమా షూటింగ్స్ ఇండోర్ లోనే జరుపుకోవాలని.. కంటోన్మెంట్ జోన్స్ లో మాత్రం షూటింగ్ కి అనుమతి లేదని పేర్కొంది. నటీనటులు టెక్నీషియన్స్ సహాయ సిబ్బంది అందరూ భోజనం నీళ్లు ఇంటి వద్ద నుండే తెచ్చుకోవాలని సూచించారు. నటీనటులు తమ వ్యక్తిగత మేకప్ కిట్ ని ఇతరులతో షేర్ చేసుకోవడానికి వీలులేదు. అంతేకాకుండా షూటింగ్ సమయంలో ఏ వ్యక్తి అయినా అనారోగ్యానికి గురైతే పూర్తి బాధ్యత నిర్మాతదే. ఈ షరతులకు అన్నిటికీ అంగీకరిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ లెటర్ ఇవ్వవలసి ఉంటుంది.

అయితే ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఎంతవరకు షూటింగ్స్ చేయగలరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ముంబైలో షూటింగ్స్ కి అనుమతిచ్చినప్పటికీ ఆ కండిషన్స్ వలన ఇప్పటి వరకు చిత్రీకరణ స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటీనటులు నిర్మాతలు ఈ విషయంపై ఆలోచించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ హీరోలు అప్పుడప్పుడే తొందరేమీ లేదని.. అన్ని అనుకూలంగా మారిన రోజే షూటింగ్స్ చేసుకోవచ్చని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్న సమయంలో నిర్మాతలు అంతా తమదే భాద్యత అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడానికి ముందుకొస్తారో లేదో చూడాలి.