Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల‌పై ఆర్థిక భారం ఒత్తిడి త‌గ్గాలంటే?

By:  Tupaki Desk   |   7 May 2021 1:30 AM GMT
నిర్మాత‌ల‌పై ఆర్థిక భారం ఒత్తిడి త‌గ్గాలంటే?
X
సినిమా నిర్మాణం అంటే సాహ‌సాల‌తో కూడుకున్న‌ది. వ‌డ్డీల‌కు అప్పులు తేవాలి. సినిమాలు తీయాలి. ఆపై తిరిగి వాటిని చెల్లించాలి. ఎక్క‌డ తేడా కొట్టినా అది ఏకంగా కుటుంబాల్ని రోడ్ల‌పైకి తెస్తుంది. ఇలాంటి ప‌రిస్థితి సినీనిర్మాత‌ల‌కు రాకూడ‌దు అంటే ప్ర‌తిదీ స‌వ్యంగా సాగాలి.

కానీ ఇప్పుడున్న క్రైసిస్ చూస్తుంటే ఏదీ అనుకూలంగా లేదు. ఇప్ప‌టికే ఏప్రిల్ - మే - జూన్ కాలానికి రిలీజ్ తేదీలు ఫైన‌ల్ చేయ‌డం క‌ష్టంగా మారింది. చాలా సినిమాలు వాయిదా ప‌డ్డాయి. క‌నీసం మూడు నెల‌ల పాటు సెకండ్ వేవ్ థ‌ర్డ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతుంద‌నుకుంటే ఆ త‌ర్వాతే రిలీజ్ గురించి ఆలోచించే స‌న్నివేశం ఉంటుంది.

ఇక ఇప్ప‌టికే కొంత షూటింగులు చేయాల్సిన‌వి ఉన్నాయి. స‌గంలో ఉన్న‌వి.. ప్రారంభంలో ఉన్న‌వి కూడా ఏం చేయాలో తెలీని ప‌రిస్థితి. సెట్స్ పై ఉన్న చాలా సినిమాల‌కు అప్పులు తెచ్చి పెట్టే ప‌రిస్థితి ఉంటుంది. అయితే ఇవ‌న్నీ ఆర్థికంగా వ‌డ్డీల భారం అమాంతం పెంచుతాయి. ఏదీ పూర్తి కాదు. రిలీజ్ కాదు .. అంటే అలాంట‌ప్పుడు రిట‌ర్నులు కుద‌ర‌దు. ఇది నిర్మాత‌ల‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. ఉత్ప‌త్తి సిద్ధం చేయ‌డం చ‌క‌చ‌కా అమ్మేయ‌డం జ‌ర‌గ‌క‌పోతే ఆ ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించేదే.

ఇప్ప‌టికి 25 సినిమాల షూటింగులు వాయిదా ప‌డ్డాయని అధికారికంగా తెలుసు. అన‌ధికారికంగా ఇంకో పాతిక ఉంటాయి. ఇవ‌న్నీ పూర్తి కావాలి. లేదంటే అంద‌రికీ చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉంటాయి. ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాల‌కు ఒకే ఒక్క హోప్ .. మొద‌టి వేవ్ త‌ర్వాత కోలుకున్న‌ట్టే తిరిగి ప‌రిశ్ర‌మ కోలుకుంటే అవ‌న్నీ మ‌ర్చిపోయే అవ‌కాశం ఉంటుంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఎంత వేగంగా పూర్త‌యితే అంతా ప్ర‌జ‌ల‌కు భరోసా ఉంటుంది. క‌రోనా వేవ్ ని ఎదురించి నిల‌దొక్కుకుంటే .. ప‌రిశ్ర‌మ ఓపిగ్గా వేచి చూసినందుకు ఫ‌లితం ఉండొచ్చు. జ‌నం తిరిగి థియేట‌ర్ల‌కు వ‌స్తే నష్టాల శాతం త‌గ్గించుకుని బ‌య‌ట‌ప‌డేందుకు ఆస్కారం ఉంటుంది. అలా జ‌ర‌గాల‌నే ఆకాంక్షిద్దాం.