Begin typing your search above and press return to search.

డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రాన్ని జ‌క్క‌న్న మ‌రిచాడా?

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:30 AM GMT
డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రాన్ని జ‌క్క‌న్న మ‌రిచాడా?
X
భార‌త‌దేశంలో ఒక ప్రాంతీయ భాష నుంచి ఎదిగి.. జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో త‌న ఉనికిని చాటుకుంటున్న ఒక దిగ్ధ‌ర్శ‌కుడి ప్ర‌క‌ట‌న‌ను హిందీ మీడియా విశ్లేష‌కులు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. అంతేకాదు... అత‌డు చేసిన కామెంట్ స‌రి కాదు అంటూ పెద్ద స్టోరీలే అల్లారు. ఇంత‌కీ ఎవ‌రా దిగ్ధ‌ర్శ‌కుడు ? అంటే అత‌డు నిస్సందేహంగా మ‌న ద‌ర్శ‌క‌ధీర ఎస్.ఎస్. రాజ‌మౌళి.

గ‌త కొంత‌కాలంగా హిందీ మీడియా సౌత్ ప్ర‌తిభ‌పై అక్క‌సు వెల్ల‌బోసుకోవ‌డానికి ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పుడు రాజ‌మౌళి చేసిన ఒక కామెంట్ ని త‌ప్పుగా అభివ‌ర్ణిస్తూ దానితో టీఆర్పీ గేమ్ ఆడ‌డం బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కీ ఏ విష‌యంలో రాజ‌మౌళిని హిందీ మీడియా త‌ప్పు ప‌ట్టింది? అంటే వివ‌రంలోకి వెళ్లాలి.

ఇటీవ‌ల హిందీ చిత్ర పరిశ్రమ కుదేలవ్వ‌డానికి ఓ బ‌హిరంగ వేదికపై రాజ‌మౌళి కార‌ణం చెప్పారు. ఈ దుస్థితికి తారలు- దర్శకులు వసూలు చేసే భారీ పారితోషికాలే కారణమని RRR ద‌ర్శ‌కుడు SS రాజమౌళి అన్నారు. ఒక సినిమా విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ ని స్టార్స్ తీసుకుంటున్నారు. వారి రెమ్యునరేషన్ ను పెంచుకుంటున్నారు.. అనేది అత‌డి ఉద్ధేశం. అయితే రాజ‌మౌళి అన్న‌ది స‌రికాద‌ని స‌ద‌రు హిందీ మీడియా విశ్లేష‌కుడు త‌ప్పు ప‌ట్టారు. కానీ రాజ‌మౌళి అన్న‌దే ముమ్మాటికీ నిజం. బాలీవుడ్ లో స్టార్ డమ్ ఉన్న‌వాళ్లు పారితోషికాల పేరుతో దోపిడీ చేస్తున్నార‌న్న‌ది ఒక ప‌చ్చి నిజం. ఇది కేవ‌లం బాలీవుడ్ కే వ‌ర్తించ‌దు. అన్ని ప్రాంతీయ భాష‌ల‌కు వ‌ర్తిస్తుంది. తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్ట‌ర్ల పారితోషికాల గురించి ధైర్యంగా మాట్లాడ‌గ‌లిగిన ఏకైక ద‌ర్శ‌కుడు వెట‌ర‌న్‌ దాసరి నారాయ‌ణ‌రావు. ద‌ర్శ‌క‌రత్న దాస‌రి నారాయ‌ణ‌రావు బ‌హిరంగ వేదిక‌ల‌పైనే స్టార్లు.. స్టార్ డైరెక్ట‌ర్ల అత్యాశ‌ను చెడామ‌డా తిట్టేసేవారు. స్టార్ల వాల‌కాన్ని నిర్మాత‌ల‌పై డామినేష‌న్ నేచుర్ ని ప‌దే ప‌దే తీవ్రంగా విమ‌ర్శించేవారు. నిర్మాత‌లు ఫైనాన్షియ‌ర్ గా డ‌బ్బు స‌ర్ధేవాడిగా మార‌డానికి హీరోల అహంకార‌మే కార‌ణ‌మ‌ని చాలా సార్లు బ‌హిరంగ వేదిక‌ల‌పై చీవాట్లు కూడా పెట్టారు. కానీ ఎవ‌రూ మారరు. ఆయ‌న దివంగ‌తులైన‌ త‌ర్వాత ఆ సాహ‌సం ఇంకెవ‌రూ చేయ‌లేదు. రూ.30కే దొర‌కాల్సిన టిఫిన్ కి నేడు రూ. 60 చెల్లించాల్సి వ‌స్తోంది. అయితే దీనికి కార‌ణం ఇడ్లీ సాంబార్ తినేవాడికి తెలుసా? అడిగేవాడున్నాడా? తిన్న త‌ర‌వాత ఫోన్ పే చేయ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు. అలాగే సినీప‌రిశ్ర‌మ‌లో పారితోషికాల పెంపు కూడా స్టార్ల ఇష్టానుసారం జ‌రుగుతుంద‌నేది వాస్త‌వం. దానిని చెల్లించ‌డం నిర్మాత విధిగా మారింది. రంగుల ప్ర‌పంచంలో హీరోలు ఉన్న‌దాని కంటే అన‌వ‌స‌ర హైప్ క్రియేట్ చేయ‌డం డబుల్ గేమ్ ఆడ‌టం చాలా స‌హ‌జం. దీనికి మీడియాల‌ను కూడా తెలివిగా వాడుకునే తెలివైన‌ హీరోలున్నారు. ప్రతిసారీ మీడియాని ఆకులో వ‌క్క‌లా..కూర‌లో క‌రివేపాకులా చూసే సెల‌బ్రిటీలకు స్టార్ల‌కు కొద‌వేమీ లేదు. చాలా మంది కేవ‌లం త‌మ పబ్లిసిటీ కోసం మాత్ర‌మే ఉపయోగించుకుంటార‌నే స‌త్యం కూడా మీడియాలో కొంద‌రికే తెలుసు. కానీ దానిని ప‌ట్టించుకునేవాళ్లు చాలా ప‌రిమితం. ఇక్క‌డ టీఆర్పీ గేమ్ అన్నిటికీ మూలాధారం.

అంతేకాదు.. స‌ద‌రు హిందీ మీడియా రాజ‌మౌళి వ్యాఖ్య‌ల‌ను త‌ప్పు ప‌డుతూ చాలా ఉదాహ‌ర‌ణ‌ల‌తో ఒక క‌థ‌నాన్ని అద్భుతంగా వండి వార్చింది. నిజానికి ఈ క‌థ‌నంపై ద‌ర్శ‌క‌ధీరుడు ఐదు నిమిషాలు దృష్టి సారిస్తే చాలు. త‌న‌దైన శైలిలో జ‌వాబివ్వ‌గ‌ల‌రు. కానీ అంత‌గా ప‌ని లేని విమ‌ర్శ‌ల‌ను ఆయ‌న ప‌ట్టించుకోరని స‌న్నిహితులు చెబుతారు.

ఇక‌పోతే స‌ద‌రు హిందీ విశ్లేష‌కుడు చెప్పిన‌ట్టు... ఒక స్టార్ వ‌ల్ల‌నే సినిమా హిట్ట‌వుతుంద‌నేది అపోహ. ఎవ‌రైనా స్టార్ జనాదరణ పొందినా ప్రారంభ దశలో మాత్ర‌మే మ‌నుగ‌డ సాగించ‌గ‌ల‌డు. ఆ త‌ర్వాత కంటెంటే మాట్లాడాలి. స‌ద‌రు స్టార్ న‌ట‌న‌తో పాటు ఇతర అంశాలపైనా విజ‌యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ వ‌ర్క‌వుట్ కావాలి. మేకింగ్ ప‌రంగా టెక్నిక్ బ‌డ్జెట్లు చాలా అవ‌స‌రం.

కంటెంట్ తో ఎదిగిన హీరో ఎవ‌రు? అంటే హిందీలో ఉదాహరణకు రాజేష్ ఖన్నా. ఆయ‌న‌ 'ఆరాధన' తర్వాత స్టార్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ విషయానికొస్తే 1969 లో తొలి చిత్రం 'సాత్ హిందుస్తానీ' విడుదలైన త‌ర్వాతా చాలా కష్టపడ్డాడు. 1973లో 'జంజీర్‌' సూపర్ స్టార్ గా మార్చింది. ఇంతకు ముందు కాలంలో నటుడి టాలెంట్ ని చూసి నిర్మాత కాల్షీట్లు తీసుకునేవారు. లేకుంటే సంజీవ్ కుమార్- రిషి కపూర్- శత్రుఘ్న సిన్హా- గోవింద- అమోల్ పాలేకర్ వంటి నటులు తమ చిత్రాలను రజతోత్సవాలకు స్వర్ణోత్సవాలకు తీసుకెళ్లేవారు కాదు.

ముఖ్యంగా కంటెంట్... ప్ర‌తిసారీ ఎక్కువగా పరిగణించాలి. ఏ నటుడినైనా కంటెంట్ స్టార్ చేస్తుంది అనేది వాస్తవం. స్టార్ ల పారితోషికాలు డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రాన్ని అనుసరించి పెరుగుతాయని రాజమౌళి తెలుసుకోవాలి! అంటూ స‌ద‌రు క్రిటిక్ విశ్లేషించాడు. నిజ‌మే..! అంతా బాగానే ఉంది కానీ స‌ద‌రు హిందీ విశ్లేష‌కుడు మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని తెలుసుకోవాలి. తెలుగు చిత్ర‌సీమ‌లో మ‌నుగ‌డ సాగించాల్సిన చాలా మంది సీనియ‌ర్ నిర్మాత‌లు ఇటీవ‌లి కాలంలో మాయం కావ‌డానికి కార‌ణం కార్పొరెట్ రంగ ప్ర‌వేశంతో మారిన ముఖ‌చిత్ర‌మే కార‌ణ‌మ‌న్న టాక్ బ‌లంగా ఉంది. కార్పొరెట్ కంపెనీలు క‌ళ్లు మూసుకుని స్టార్లు.. స్టార్ డైరెక్ట‌ర్ల‌కు హ‌ద్దు మీరి గుడ్డిగా భారీ పారితోషికాలు వెద‌జ‌ల్ల‌డంతో సాంప్ర‌దాయ నిర్మాత‌లు నిల‌బ‌డ‌లేక‌పోయారు. దీనికి తోడు కార్పొరెట్ చేసిన భారీ పారితోషికం క‌ళ్ల జూసాక స్టార్లు అదే డిమాండ్ ని కొన‌సాగించారు. దీంతో చాలా మంది నిర్మాత‌లు చాప చుట్టేసారు. ఇక ఇలాంటి ద‌శ‌లో ఉన్న టాలీవుడ్ లో క‌రెక్ష‌న్ కోసం ఒక ప్ర‌య‌త్నం జ‌రిగింద‌నేది స‌ద‌రు విశ్లేష‌కునికి తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు.

స్టార్లు డిమాండ్ చేయ‌డం అనేది హిందీ సినిమాలకే పరిమితం కాదు. సినిమా అడ్మిషన్ రేట్లతో పాటు స్టార్ ధరలు కూడా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలలో ఇటీవ‌లి కాలంలో పెద్ద ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి టాలీవుడ్ ఫిలింఛాంబ‌ర్- నిర్మాత‌ల గిల్డ్-నిర్మాల మండ‌లి సంయుక్తంగా ఓ ప్ర‌య‌త్నం కూడా చేశాయి. తారలను పారితోషికాల విష‌యంలో సహేతుకంగా ఒప్పించేందుకు కొన్ని తీర్మానాలను ఆమోదించాయి. ఇత‌ర సాంకేతిక విభాగాల పారితోషికాలు అదుపుత‌ప్ప‌కుండా నిరోధించే కొన్ని నియ‌మాల‌ను కూడా ప్ర‌తిపాదించారు. అయితే ఇదంతా దేనికి చేయాల్సి వ‌చ్చింది? అంటే స‌క్సెస్ తో పాటు అమాంతం రెట్టింపు పారితోషికాల‌(కొంద‌రు నాలుగు రెట్లు తీసుకుంటారు)తో నిర్మాత‌ను స‌ర్వ‌నాశ‌నం చేసే స్టార్ హీరోలు కూడా అర్థం చేసుకోవాల‌ని జ‌రిగిన ప్ర‌య‌త్నం. ఇప్పుడు చెప్పండి .. రాజ‌మౌళి జాతీయ మీడియా ముందు స్టార్ల పారితోషికాల పెంపును విమ‌ర్శించ‌డం స‌రైన‌దేనా కాదా? ఇంత‌కుముందు ఇడ్లీ సాంబార్ రూ.30కే దొరికేది. క‌డుపునిండా తినక‌పోయినా సాంబార్ తో పొట్ట నింపి మ‌నుగ‌డ సాగించేవారు. కానీ ఇప్పుడ‌లా కాదు క‌దా? రూ.30 రేటుని అమాంతం రూ.60 గా మార్చినా క‌డుపు నిండ‌టం లేదు. స‌రిక‌దా ఆ డ‌బ్బు ఎందుకు చెల్లించామో కూడా తెలీని అయోమ‌య స్థితిలో సామాన్యుడు ఉన్నాడు. స్టార్ల పారితోషికాల పెంపు వ‌ల్ల‌నే థియేట‌ర్ల‌లో టిక్కెట్ల ధ‌ర‌లు అమాంతం పెరిగాయి. దీంతో థియేట‌ర్ల‌కు వెళ్లేందుకు సామాన్యుడు త‌డ‌బ‌డుతున్నాడు. సెల‌క్టివ్ గా కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే థియేట‌ర్ల‌కు వెళుతున్నారు.

రూ.30 టిఫిన్ ధ‌ర‌ను పెరిగిన నిత్యావ‌స‌రాల ధ‌ర‌లకు అనుగుణంగా రూ.40 కి పెంచితే న్యాయం. కానీ రూ.60కి అమ్ముతారు. ఇప్పుడు స్టార్ల రెమ్యున‌రేష‌న్లు కూడా ఇలానే రెట్టింపు లేదా నాలుగు రెట్లు పెంచేయ‌డం అల‌వాటుగా మారింద‌ని ఒక ప్ర‌ముఖ నిర్మాత కం పంపిణీదారుడు విశ్లేషించారు. ఇది చాలా అన్యాయ‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. డమాండ్ స‌ప్ల‌య్ సూత్రంపైనా కాదు.. స‌క్సెస్ రేటు 5శాతం మించ‌ని ప‌రిశ్ర‌మ‌లో సంద‌ర్భాన్ని బ‌ట్టి కూడా పారితోషికం నిర్ణ‌యించాలి. పారితోషికాల పెంపుపై చ‌ర్చించ‌డం సున్నిత విష‌యం. ఒక్కొక్క‌రూ ఒక్కోలా విశ్లేషిస్తారు. కానీ కొన్ని క‌ఠోర‌ వాస్త‌వాల‌ను అంగీక‌రించేందుకు స్టార్లు కూడా సిద్ధంగా ఉండాలి. నిర్మాత ఉంటేనే మ‌నుగ‌డ‌. దీనిని గుర్తించి విశ్లేష‌కులు విశ్లేషిస్తే స‌రైన‌ది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.