Begin typing your search above and press return to search.

షోలు క్యాన్సిల్ చేశారు.. థియేటర్స్ క్లోజ్ చేశారు..!

By:  Tupaki Desk   |   25 March 2021 6:04 AM GMT
షోలు క్యాన్సిల్ చేశారు.. థియేటర్స్ క్లోజ్ చేశారు..!
X
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సుమారు 9 నెలల పాటు థియేటర్స్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఎట్టకేలకు 50 శాతం ఆక్యుపెన్సీతో రీ ఓపెన్ చేశారు. సినిమాలు చూడటానికి జనాలు థియేటర్ల వరకూ వస్తారా అనే సందేహాలను తుడిచేస్తూ ఎగబడి సినిమాలు చేసేశారు. ఈ క్రమంలో థియేటర్ ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచేసారు. సంక్రాంతి మొదలు కొని శివరాత్రి వరకు అన్ని సినిమాలు మంచి వసూళ్ళు రాబట్టడంతో ఇండస్ట్రీ గాడిలో పడ్డట్టే అని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మళ్లీ కరోనా సెకండ్ వేవ్ తీవ్రం అవుతున్న నేపథ్యంలో నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు - థియేటర్ ఓనర్స్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

గత శుక్రవారం విడుదలైన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన 'చావు కబురు చల్లగా'.. రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మంచు విష్ణు 'మోసగాళ్లు'.. ఆది సాయికుమార్ 'శశి' సినిమాలు థియేటర్లలో ప్రదర్శించబడుతున్నాయి. అయితే ఈ సినిమాలకు కనీస స్పంద‌న లేకపోవడంతో షోలు క్యాన్సిల్ చేసుకొని థియేట‌ర్స్‌ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకోవడం దీనికి ఒక కారణమైతే.. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల వల్ల జనాలు ఇలాంటి సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం ఎందుకని ఆలోచిస్తుండటం మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

థియేటర్స్ లో కనీసం 10 శాతం కూడా నిండకపోవడంతో మెయింటైనెన్స్ ఖర్చులు రాకపోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ‌ల్టీప్లెక్స్ లలో షోలు తగ్గించడం.. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ షోలు ఆపేశారట. దీంతో మరోసారి ప్రొడ్యూసర్స్ - ఎగ్జిబిటర్స్ కలవరపడేపరిస్థితులు వచ్చాయి. మరి ఈ శుక్రవారం రాబోయే సినిమాలకు ఆడియన్స్ నుంచి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇదిలావుండగా తెలంగాణా రాష్ట్రంలో సినిమా థియేటర్ల మూసివేత ఉండదని.. యథావిధిగా నడుస్తాయని సినిమాటోగ్రఫీ మినిస్టర్ స్పష్టం చేశారు. థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని.. ప్రభుత్వ గైడ్ లైన్స్ - కోవిడ్ నిబంధనలతో సినిమా థియేటర్ లు యధావిధిగా నడుస్తాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు.