Begin typing your search above and press return to search.

అగ్ర‌నిర్మాత‌కే చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంద‌ట‌!

By:  Tupaki Desk   |   24 Sep 2019 7:01 AM GMT
అగ్ర‌నిర్మాత‌కే చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంద‌ట‌!
X
టాలీవుడ్ అగ్ర‌నిర్మాత‌ల్లో ఏ1 కేట‌గిరీలో నిలిచే పేరు అల్లు అర‌వింద్. తెలుగులో బ‌డా నిర్మాత‌గా ద‌శాబ్ధాల పాటు శాసిస్తున్న‌ ఆయ‌న తెలుగు సినీప‌రిశ్ర‌మ బాస్ గా పిలిపించుకున్నారు. బాలీవుడ్ మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తో నిర్మించిన `గ‌జిని` చిత్రంతో ముంబై ప‌రిశ్ర‌మలోనూ పాపుల‌ర‌య్యారు. అలాంటి బ‌డా నిర్మాత‌కే ఓ అందాల‌ హీరోయిన్ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంద‌ట‌. ఈ బ్యూటీ పేరు చెబితే చాలు నిద్ర‌లో కూడా క‌ల‌వ‌రించే ప‌రిస్థితి ఉంద‌న్న‌ది లేటెస్ట్ టాక్. అస‌లింత‌కీ ఏమైంది.. స‌ద‌రు బ్యూటీతో ఏంటి లొల్లి అంటారా?

పాన్ ఇండియా క్రేజు అంత‌కంత‌కు రెట్టింప‌వుతున్న ఈ శుభ‌సంద‌ర్భంలో బాస్ అల్లు అర‌వింద్ జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `రామాయ‌ణం` పేరుతో మైథ‌లాజిక‌ల్ ట్ర‌యాల‌జీని నిర్మించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. నిర్మాత‌ మ‌ధు మంతెనతో క‌లిసి అర‌వింద్ ఈ చిత్రాన్ని దాదాపు 600కోట్ల బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నార‌ట‌. ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం హృతిక్ రోష‌న్ ని .. రావ‌ణాసురుడి పాత్ర కోసం ప్ర‌భాస్ ని సంప్ర‌దించార‌ని వార్త‌లొచ్చాయి. సీత పాత్ర కోసం దీపిక అయితే బాగుంటుందని మేక‌ర్స్ భావించారు.

కానీ దీపిక కొన్ని కార‌ణాల వ‌ల్ల కాద‌నువ‌డంతో ఆ స్థానంలో శ్ర‌ద్ధాక‌పూర్ ని సంప్ర‌దించార‌ట‌. `సాహో` సినిమాతో శ్ర‌ద్ధ క్రేజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ఆ మ‌ధ్య బాలీవుడ్ లో చేసిన `స్త్రీ` వంద కొట్ల క్లబ్ లో చేర‌డంతో శ్ర‌ద్ధ భారీగా పారితోషికాల్ని డిమాండ్ చేస్తోంది. `రామాయ‌ణం 3డి`లో న‌టించ‌డానికి ఏకంగా 10-11 కోట్లు డిమాండ్ చేసింద‌ని తెలిసింది. ఈ ఫిగ‌ర్ విన్న అల్లు అర‌వింద్ కు చెమ‌ట‌లు ప‌ట్టాయ‌ట‌. హీరోయిన్ కే ఈ స్థాయిలో ఇస్తే మ‌రి హీరోకు ఎంత కేటాయించాలి అన్న సందిగ్ధ‌త త‌లెత్తింద‌ట‌. `సాహో`తో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ శ్ర‌ద్ధాని తీసుకోవాలా? లేక మ‌రో హీరోయిన్ ని వెత‌కాలా అని మేక‌ర్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని ఫిలింన‌గ‌ర్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే రామాయ‌ణం ట్ర‌యాల‌జీ సిరీస్ .. ఇందులో మూడు చిత్రాలు నిర్మిస్తార‌ని తెలుస్తోంది. ఈ మూడింటికి క‌లిపి శ్ర‌ద్ధా అంత డిమాండ్ చేసిందా లేక ఒక్కో చిత్రానికి అంత ఆశిస్తోందా? అన్న‌ది తెలియాల్సి ఉంది.

ఈ చిత్రానికి `దంగ‌ల్‌` ఫేమ్ నితీష్ తివారితో పాటు ప్ర‌ముఖ కెమెరామెన్.. `మామ్‌` ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్య‌వార్ సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. 3డీలో తెర‌పైకి రాబోతున్న ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి తీసుకురావాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.