Begin typing your search above and press return to search.

నెపోటిజం పై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు...!

By:  Tupaki Desk   |   28 July 2020 11:50 AM GMT
నెపోటిజం పై శృతి హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు...!
X
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో 'నెపోటిజం'పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు.. ఇప్పుడు మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా దీనిపై డిస్కషన్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువైందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన బయట వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ ఇస్తుంటారని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా నెపోటిజంపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులందరూ ఈ నెపోటిజం గురించి వారి అభిప్రాయలను వెల్లడిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ నటవారసురాలు స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై స్పందించింది.

సీనియర్ హీరో హీరోయిన్లు కమల్ హాసన్ - సారిక దంపతుల పెద్ద కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శృతి హాసన్. బాలీవుడ్ లో అంతగా మెప్పించలేకపోయినా సౌత్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఇటీవల శృతి నటించిన ''యారా'' అనే హిందీ సినిమా ఓటీటీలో రిలీజవుతున్న సందర్భంగా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో నెపోటిజం గురించి మాట్లాడుతూ ''నేను సినీ ఇండస్ట్రీలో చాలా ఈజీగానే ఎంట్రీ ఇచ్చాను. దానికి చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణ ప్రభావం.. నా ఇంటిపేరు చాలా ఉపయోగపడింది. నా తల్లిదండ్రుల వల్లే నేను సులభంగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టగలిగాను. నేను దానిని ఖండించలేను. అయితే ఇండస్ట్రీలోకి ప్రవేశించాక మాత్రం నా జర్నీ సాఫీగా సాగలేదు. అది అందరికీ తెలుసు. ఎన్నో పరాజయాలను ఎదుర్కొన్నాను. ఎంతో కాలం తర్వాతే నాకు విజయం వచ్చింది. నేను అర్థం చేసుకుందేంటంటే వారసత్వం వల్ల ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం ఈజీ.. కానీ నిలదొక్కుకోవడం మాత్రం కష్టం'' అని చెప్పుకొచ్చింది.