Begin typing your search above and press return to search.

మంగళవారం శృతికి మంటెక్కిపోయింది

By:  Tupaki Desk   |   22 Jun 2016 3:41 AM GMT
మంగళవారం శృతికి మంటెక్కిపోయింది
X
జూన్ 21 స్పెషాలిటీ గురించి మనలో చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్లు పట్టించుకోకపోవచ్చు. సంవత్సరం మొత్తంలో అత్యంత సుదీర్ఘంగా పగటి సమయం ఉండే రోజు జూన్ 21. అయితే.. ఈ రోజు వచ్చేసరికి మన దగ్గర వానలు మొదలైపోతాయ్ కాబట్టి.. ఈ తేడా మనకు తెలీదు కానీ.. అమెరికాలో కొన్ని ఏరియాల వాళ్లకి మాత్రం ఇది భయంకరమైన రోజు.

సంవత్సరం మొత్తంలో అత్యధికంగా ఎండ వేడి ఉండేది జూన్ 21 నాడే. అన్ని ప్రాంతాల్లో కాదు కానీ.. లాస్ ఏంజెల్స్ లో ఈ మంట బాగా ఉంటుంది. అందుకనే ఆ విషయాన్ని బాగా ప్రచారం చేసేసి.. వీలైనంతగా బయటి పనులేవీ పెట్టుకోవద్దని ప్రజలకు ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. అయినాసరే వాటిని పట్టించుకోవడం కుదరలేదంటూ.. సౌత్ బ్యూటీ శృతి హాసన్ తెగ ఫీలయిపోతోంది. ప్రస్తుతం తండ్రితో కలిసి శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తున్న శృతి.. ఆ మూవీ షూటింగ్ లో భాగంగా ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లోనే ఉంది.

'ఏడాది మొత్తంలో ఇవాళే అత్యధికంగా వేడి ఉంటుందట. లాస్ ఏంజెల్స్ ప్రజలను ఇళ్లలోనే ఉండమనే సూచనలు కూడా అందాయి. అయితే.. మేమేం చేశామో తెలుసా? అవుట్ డోర్స్ లో షూటింగ్ చేస్కున్నాం..హహహ' అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్. పైకి నవ్వుతోంది కానీ.. అంత పెద్ద సిటీలో జనాలు బయటకు రాకుండా ఇళ్లలో దాక్కుంటే.. తాను మాత్రం షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చేసరికి.. ఆ ఎండ వేడికి శృతికి మంటెక్కిపోయి ఉంటుంది. అందుకే ఆ సంగతిని అంత డీటైల్డ్ గా ట్వీట్ లో పెట్టింది.