Begin typing your search above and press return to search.

మ‌గ‌రాయుడు అన్నందుకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ?

By:  Tupaki Desk   |   30 July 2020 5:30 AM GMT
మ‌గ‌రాయుడు అన్నందుకే ప్లాస్టిక్ స‌ర్జ‌రీ?
X
అందాన్ని ఎలివేట్ చేసేందుకు క‌థానాయిక‌లు ప్లాస్టిక్ స‌ర్జ‌రీల్ని ఆశ్ర‌యించ‌డం అనాదిగా చూస్తున్న‌దే. శ్రీ‌దేవి.. శిల్పాశెట్టి.. అమీషా ప‌టేల్..న‌య‌న‌తార‌.. ఇలా ఎంద‌రో నాయిక‌లు ముఖంలో ఏదో ఒక భాగం స‌ర్జ‌రీతో స‌రి చేయించుకోవ‌డం వ‌ల్ల‌నే అంతందాన్ని పొందార‌ని మీడియా క‌థ‌నాలెన్నో వ‌చ్చాయి.

గ‌త కొంత‌కాలంగా శ్రుతిహాస‌న్ ముక్కుకు స‌ర్జ‌రీ జ‌రిగింద‌న్న వార్తా హైలైట్ అవుతోంది. ప‌లుమార్లు మీడియా ముఖంగా ఇదే విష‌య‌మై శ్రుతికి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. అయితే ప్ర‌తిసారీ తాను స‌ర్జ‌రీ చేయించుకున్నాన‌ని త‌న అందం త‌న ఇష్ట‌మే క‌దా! అన్న‌ట్టు మాట్లాడింది శ్రుతిహాస‌న్. ల‌క్ అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మ‌డిని ఆరంభమే మ‌గ‌రాయుడు అనేశార‌ట‌. దాంతో అది త‌ట్టుకోలేక త‌న అందాన్ని మార్చుకునేందుకు స‌ర్జ‌రీని ఆశ్ర‌యించింద‌ని అప్ప‌ట్లో గుస‌గుస‌లు వ‌చ్చాయి.

అదే విష‌యాన్ని కాస్త అటూ ఇటూగా తాజా ఇంట‌ర్వ్యూలోనూ చెప్పుకొచ్చింది శ్రుతి. త‌న తొలి సినిమా స‌మ‌యంలో కామెంట్లు వినిపించాయ‌ని ఒత్తిళ్లు ప‌ని చేశాయ‌ని అందుకే ముఖాకృతి మార్చుకునేందుకు క‌త్తి గాట్లు త‌ప్ప‌లేద‌ని తెలిపింది. ముక్కుకు స‌ర్జ‌రీ చేయించుకున్న విష‌యాన్ని నిజాయితీగానే అంగీక‌రించింది.

అలాగే తాను ప్లాస్టిక్ సర్జరీని ప్రోత్సహించను అని చెబుతూనే అది వ్యక్తిగత ఎంపిక అని శ్రుతి తెలిపింది. మేం అందం పెంచుకునేందుకు శ‌స్త్ర చికిత్స‌ను ఆశ్ర‌యించ‌లేదు అని ఎవ‌రైనా క‌థానాయిక అంటే అంత‌కంటే అబ‌ద్ధం మ‌రొక‌టి ఉండ‌ద‌ని సాటి హీరోయిన్ల పైనా పంచ్ వేసింది శ్రుతి. నేను ఎవ‌రినో అనాల‌ని కాదు కానీ.. జుట్టుకు రంగులు వేయడం.. చర్మాన్ని బ్లీచ్ చేసుకోవ‌డం.. నీలిరంగు కాంటాక్ట్ లెన్సులు ధరించ‌డం.. ఇవ‌న్నీ సాధార‌ణ‌మైన‌వే. 40 వ‌య‌సులో బొటాక్స్ అంటే స్త్రీలు ఆస‌క్తిగా ఉంటార‌ని కూడా అంది. నా లైఫ్ నా ఇష్టం నేను దేనికైనా సిద్ధ‌మేన‌ని శ్రుతి వెల్ల‌డించింది. నిజాన్ని అంగీకరించడానికి సిగ్గుపడనని అంది.