Begin typing your search above and press return to search.

రాగం తాళం పల్లవి మార్చి వాయిస్తుందట..!

By:  Tupaki Desk   |   7 Aug 2019 6:43 AM GMT
రాగం తాళం పల్లవి మార్చి వాయిస్తుందట..!
X
శృతి హాసన్ తన కెరీర్ మొదట్లో ఫ్లాపులతో ఇబ్బంది పడింది కానీ 'గబ్బర్ సింగ్' తనకు సూపర్ బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోయిన్ గా కొంతకాలం కొనసాగింది. ఆయితే లండన్ బేస్డ్ బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో ప్రేమాయణం.. మ్యూజిక్ కెరీర్ పై ఫోకస్ చేయడం లాంటి కారణాలతో దాదాపు రెండున్నరేళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. మ్యూజిక్ కెరీర్ అనుకున్నట్టు టేకాఫ్ కాకపోవడం.. మైఖేల్ తో బ్రేకప్ కావడంతో ఇండియాకు వచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం విజయ్ సేతుపతి చిత్రం 'లాబం' లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాకుండా మంచి స్క్రిప్ట్స్ కోసం.. క్రేజీ ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నా శృతి ఆశించిన స్థాయిలో మాత్రం ఆఫర్లు రావడం లేదట. వచ్చిన అఫర్లేమో తనను ఎగ్జైట్ చేయడం లేదట. అందుకే రూట్ మార్చాలని.. ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని నిర్ణయించుకుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నయనతార.. అనుష్క లాంటివారు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. ఈ రూట్లోనే పయనించి శృతి కూడా తన అదృష్టం పరిక్షించుకోవాలనే ఆలోచనలో ఉందట.

అయితే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం పెద్ద సమస్య కాదేమో కానీ వాటిని చూసేందుకు ప్రేక్షకుల థియేటర్లకు రప్పించడం అంత సులువు కాదు. హీరోయిన్లకు భారీ స్టార్డమ్ ఉంటే తప్ప ఓపెనింగ్స్ కానీ.. కలెక్షన్స్ కానీ రావు. నయన్.. అనుష్కలు అన్ని రకాల సినిమాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించారు. ఆ తర్వాతే ఈ ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు వరసగా చేయడం మొదలు పెట్టారు. వారిద్దరికీ ఆ సినిమాలు వర్క్ అవుట్ అయినట్టు మిగతా హీరోయిన్లకు వర్క్ అవుట్ కావడం లేదు. మరి శృతి ఇన్నేళ్ళు సినిమాలకు గ్యాప్ ఇవ్వడం తో ఫాలోయింగ్ కూడా తగ్గి ఉంటుంది.. ఇప్పుడు ఒక్కసారిగా ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలు అంటే కాస్త కష్టమే. రెండు మూడు సాధారణ సినిమాలు చేసి హిట్స్ సాధించిన తర్వాత ఈ కొత్త రూట్ ఎంచుకుంటే మేలనే అభిప్రాయం వినిపిస్తోంది. అయినా ఈ కమల్ సార్ డాటర్ జనాలు చెప్పేది వినే రకం కాదు..ఎంతైనా లేడీ గబ్బర్ సింగ్ కదా!