Begin typing your search above and press return to search.

అందాల శ్రుతి అస్సలు టైమ్ వేస్టు చేయడం లేదే!

By:  Tupaki Desk   |   18 April 2022 9:30 AM GMT
అందాల శ్రుతి అస్సలు టైమ్ వేస్టు చేయడం లేదే!
X
టాలీవుడ్ తెరకి నాజూకుదనాన్ని పరిచయం చేసిన కథానాయికగా శృతిహాసన్ ను గురించి చెప్పుకోవచ్చు. తెలుగు తెరపై వాలిన ఈ పాలపిట్టకి అభిమానులు కానివారంటూ కనిపించరు. మంచి గంధం ముక్కలాంటి ఈ అమ్మడికి మనసులు సమర్పించని వాళ్లంటూ ఉండరు.

అలాంటి ఈ బ్యూటీకి తెలుగులో మంచి హిట్లు పడ్డాయి. ' గబ్బర్ సింగ్' .. 'రేసుగుర్రం' .. 'శ్రీమంతుడు' .. 'క్రాక్' వంటి సినిమాలు శ్రుతి కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి. ఆ సినిమాలన్నీ కూడా ఆమె గ్లామర్ కి అద్దం పడతాయి .. అర్థం చెబుతాయి.

అలాంటి శృతిహాసన్ ఆ మధ్య లవ్ లో పడిపోయి, ప్రేమకంటే ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని చాటిచెబుదామనుకుంది. కానీ సినిమాలు తగ్గిపోయి ఖర్చులకు డబ్బు అవసరమయ్యేసరికి, ప్రేమకి మాత్రమే కాదు .. డబ్బుకి కూడా దూరంగా ఉండలేమనే విషయాన్ని గ్రహించింది. సంపాదిస్తూనే ప్రేమను కొనసాగించాలనే ఒక పాఠాన్ని వంటబట్టించుకుని, ఆ దిశగానే ముందుకు వెళుతోంది. అందువల్లనే తన ప్రేమికుడు శంతను హజారికాతో షికార్లు కంటిన్యూ చేస్తూనే, షూటింగులకు హాజరవుతోంది. ఎక్కడ ఏ మాత్రం టైమ్ వేస్టు చేయకుండా, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళుతోంది.

ప్రస్తుతం ఆమె చిరంజీవి షూటింగులో బిజీగా ఉంది. బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి 'వాల్తేరు వీర్రాజు' .. 'వాల్తేరు మొనగాడు' టైటిల్స్ ను పరిశిలీస్తున్నారు.

తాజాగా ఈ సినిమా షూటింగులో శ్రుతి హాసన్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా పోస్టు చేసింది. చిరంజీవి - శ్రుతి హాసన్ కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

ఈ మధ్య తెలుగులో శ్రుతి హాసన్ 'క్రాక్' సినిమాతో హిట్ కొట్టింది. ఆ తరువాత 'వకీల్ సాబ్'లో ఏదో శాస్త్రానికి కనిపించినా, అది కూడా ఆమె కెరియర్లో హిట్ గానే నమోదైంది. ఆ తరువాత ప్రభాస్ తో ఆమె 'సలార్' సినిమాకి సంబంధించిన కొన్ని షెడ్యూల్స్ ను పూర్తి చేసింది.

ఇక బాలకృష్ణ 107వ సినిమాగా రూపొందుతున్న గోపీచంద్ మలినేని సినిమాలోనూ ఆమెనే కథానాయికగా. ఇలా శృతిహాసన్ వరుస సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. మరి వీటిలో ఏవి వసూళ్ల పరంగా రెపరెపలాడతాయో .. మాస్ ఆడియన్స్ నుంచి మార్కులను పడతాయో చూడాలి.