Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా రిలీజ్ దిశగా 'శ్యామ్ సింగ రాయ్?'

By:  Tupaki Desk   |   2 Oct 2021 11:30 PM GMT
పాన్ ఇండియా రిలీజ్ దిశగా శ్యామ్ సింగ రాయ్?
X
ఒక సినిమా హిట్ అయితేనే మరో సినిమాలో ఛాన్స్ వస్తుంది. అలా అని చెప్పేసి వరుస హిట్లు రాకపోయినా, హిట్ వచ్చేవరకూ తట్టుకుని నిలబడే క్రేజ్ వస్తుంది. హిట్టు చుట్టూ అవకాశాలు .. క్రేజ్ .. మార్కెట్ .. డిమాండ్ ఇవన్నీ హడావిడిగా ప్రదక్షిణలు చేస్తున్నట్టుగా కనిపిస్తాయి. ఇవన్నీ గ్రహాల మాదిరిగా తమ పని తాము చేసుకుంటూ పోవాలంటే కథ సరిగ్గా ఉండాలి. ఆ కథలో కొత్తదనమనే బలముండాలి. సరైన కథ లేకుండా సినిమా చేయడమంటే, కర్ర లేకుండా సాము చేయడం వంటిదని చెప్పాలి. అందువల్లనే కథ విషయంలో నాని ఒక రేంజ్ లో కసరత్తు చేస్తాడు.

కథల విషయంలో నాని తీసుకునే జాగ్రత్తలను గురించి యంగ్ స్టార్ హీరోలు కూడా వేదికలపై చెబుతూ ఉంటారు. కథా వస్తువు ఏమిటి? కథ ఏ నేపథ్యంలో జరుగుతుంది? ముఖ్యమైన పాత్రలు .. వాటి తీరు తెన్నులు ఎలా ఉంటాయి? అన్ని పాత్రలు కలిసి కథను ప్రేక్షకుడి దగ్గరికి తీసుకువెళుతున్నాయా లేదా? ఇలా అనేక విషయాల్లో సరైన స్పష్టత వచ్చిన తరువాతనే నాని రంగంలోకి దిగుతాడు. అప్పటివరకూ చెక్కడాలు జరుగుతూనే ఉంటాయి. నాని ఇంతవరకూ చేసిన సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.

నానీని తెరపై కాకుండా తమ పక్కింట్లో చూస్తున్నట్టుగా అనిపిస్తుందని కొంతమంది అంటారు. తమ కాలనీ కుర్రాడిలా అనిపిస్తాడని మరికొందరు చెబుతారు. అలా అనుకోవడానికీ .. అనిపించడానికి కారణం .. ఆ కథలపై .. పాత్రలపై జరిగిన కసరత్తే కారణం. పొడుపు కథను చెప్పుకునే సమయంలో సినిమా కథను సెట్ చేయడానికి నాని ఎంతమాత్రం ఒప్పుకోడు .. అదే ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా. అలాంటి నాని 'ఈగ' సినిమాతోనే పాన్ ఇండియా మూవీ చేసినట్టు అయింది. ఇక ఇప్పుడు 'శ్యామ్ సింగ రాయ్' సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాలనే ఉద్దేశంతో ఉన్నాడట.

నాని ఇంతవరకూ చేసిన సినిమాలు వేరు .. 'శ్యామ్ సింగ రాయ్' పరిస్థితి వేరు. ఇందులోని కథా వస్తువు, అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే లక్షణాలను కలిగి ఉంటుంది. నాని లుక్ డిఫరెంట్ గా ఉండటమే కాకుండా, ఇతర పాత్రలు కూడా బలంగా .. విభిన్నంగా కనిపిస్తాయి. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని భావించిన నానీ, దీనిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడట. ఆ దిశగా ఆయన తన ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. మరి పరిస్థితులు ఆయనకి ఎంతవరకూ అనుకూలిస్తాయనేది చూడాలి.

'టాక్సీవాలా' సినిమాతో హిట్ కొట్టేసిన రాహుల్ సాంకృత్యన్, విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమాను రూపొందించాడు. నిర్మాత వెంకట్ బోయినపల్లి ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా కనిపించనుండటం ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఇక జిషు సేన్ గుప్తా .. మురళీ శర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకువెళుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.