Begin typing your search above and press return to search.

తెలుగు ఇండస్ట్రీలో ఇదో కొత్త ఒరవడి!

By:  Tupaki Desk   |   10 Nov 2018 5:30 PM GMT
తెలుగు ఇండస్ట్రీలో ఇదో కొత్త ఒరవడి!
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. సృజనాత్మకత వెల్లివిరిస్తే ఆకాశమే హద్దు.. ప్రేమ పొడచూపితే కవిత్వం వచ్చినట్టు నవయవ్వన ఆలోచనల్లో పాటలు పూదోటగా కనిపిస్తున్నాయి. వినసొంపుగా శ్రోతలను అలరిస్తున్నాయి. తెలుగులో కొత్త సంగీత దర్శకుల ద్వయం పాటలతో మైమరిపిస్తోంది. కీరవాణి - మణిశర్మ - కోటి లాంటి సీనియర్లు ఎప్పుడో ఒకటి అరా సినిమాలకు పాటలు అందిస్తూ సైలెంట్ గా ఉంటున్నారు. కానీ యువ సంగీత దర్శకులు మాత్రం తమ క్రియేటివిటీ పాటలతో దూసుకొస్తున్నారు. సంగీతానికే కొత్త భాష్యం చెబుతున్నారు. మైమరిపించేలా పాటలు ట్యూన్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

ఒకప్పుడు దేశంలో హిందీ పాటలే ట్రెండ్ సెట్టర్ గా ఉండేవి. షారుఖ్ - అమీర్ - సల్మాన్ మెలోడీ ప్రేమ పాటలు దేశవ్యాప్తంగా ఓ ఊపు ఊపాయి. ఇప్పుడు అప్పుడప్పుడు మాత్రమే హిందీ పాటలు మెరుస్తున్నాయి. తాజాగా తెలుగులో కొత్త సంగీత దర్శకులు అద్భుతమైన మ్యూజిక్ తో అలరిస్తున్నారు.

తాజాగా పాటలను పరిశీలిస్తే ‘గీతో గోవిందం’తో గోపి సుందర్ సూపర్ మెలోడీ పాటలను సంధించి అలరించారు. ‘ఇంకేమింకేం కావాలి’ అంటూ సాగే పాటతోనే సినిమాకు సగం బలమొచ్చింది. ఇక తాజాగా టాక్సీవాలా సినిమాలోని జోస్ బేయాస్ సంగీతం వహించిన ‘మాటే వినదుగా’ పాట యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. మిలియన్ల వ్యూస్ దుమ్మురేపుతోంది. ఇప్పటికే 5.1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఊపేస్తోంది. ఈ కొత్త సంగీత దర్శకుడు తొలి సినిమాతో ఇంత మంచి మ్యూజిక్ అందించి ఆశ్చర్యపరిచాడు.

సిద్ శ్రీరాం ఇప్పుడీ యువ గాయకుడి గొంతులోని ఆత్రం ప్రేమ భావనలు బాగా వ్యక్తీకరిస్తోంది. అందుకే ప్రేమ పాటలన్నింటిని ఈయన చేతే పాడిస్తున్నాడు. ఆ హస్కీ వాయిస్ ఎంతో బాగా పేలుతోంది. అందుకే యువ సంగీత దర్శకులకు సిద్ శ్రీరాం వరంగా మారారు. వారి సంగీతంలో కొత్తదనం.. సిద్ శ్రీరాం వాయిస్ తోడై అద్భుతమైన పాటలు విడుదలవుతున్నాయి.

వీరే కాదు తెలుగులో తమన్ - మిక్కీ జే మేయర్ - అనూప్ రూబెన్స్ లు కూడా కొత్తదనం వేట లో ప్రయోగాలు చేస్తూ సరికొత్త పాటలను ఆవిష్కరిస్తున్నారు. ఈ కొత్త ఒరవడితో తెలుగునాట పాటలు సృజనాత్మకంగా వస్తున్నాయి. అవి ఇతర భాష దర్శక నిర్మాతలను కూడా అకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమా సంగీతంతో వచ్చిన ఈ కొత్త మార్పు ఇండస్ట్రీకి మేలు చేస్తోంది. కొత్త సంగీత దర్శకులను ఎంకరేజ్ చేస్తున్న తీరు సినిమాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది.