Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ :సిద్ధార్థ

By:  Tupaki Desk   |   16 Sep 2016 5:15 PM GMT
మూవీ రివ్యూ :సిద్ధార్థ
X
చిత్రం :‘సిద్ధార్థ’

నటీనటులు: సాగర్-రాగిణి-సాక్షి చౌదరి-రణధీర్-సుబ్బరాజు-బెనర్జీ-సన-అజయ్-నాగినీడు తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి
మాటలు: పరుచూరి బ్రదర్స్
నిర్మాత: దాసరి కిరణ్ కుమార్
రచన- దర్శకత్వం: దయానంద్ రెడ్డి

‘మొగిలిరేకులు’ సీరియల్ తో బుల్లితెరపై సూపర్ పాపులర్ అయ్యాడు సాగర్. అతను వెండితెర కథానాయకుడిగా మారి చేసిన సినిమా ‘సిద్ధార్థ’. ఇంతకుముందు ‘అలియాస్ జానకి’ అనే లవ్ స్టోరీ తీసిన దయానంద్ రెడ్డి.. ఈసారి సాగర్ కోసం యాక్షన్ బాట పట్టాడు. ఎస్.గోపాల్ రెడ్డి.. పరుచూరి బద్రర్స్.. మణిశర్మ లాంటి పెద్ద టెక్నీషియన్లు పనిచేయడంతో ఈ సినిమా కొంచెం ఆసక్తి రేకెత్తించింది. బుల్లితెర స్టార్ సాగర్ వెండితెరపై ఎలా చేశాడు.. అతడికి ‘సిద్ధార్థ’ ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉంది.. చూద్దాం పదండి.

కథ:

సూర్య (సాగర్) రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన కుర్రాడు. అతను కొన్ని కారణాల వల్ల తన ఊరి విడిచి మలేషియాకు వచ్చి సిద్ధార్థ అని పేరు మార్చుకుని అజ్నాతవాసం గడుపుతుంటాడు. ఐతే అతడి గతం తాలూకు గొడవలు అతణ్ని వదిలిపోవు. మలేషియాలోనూ సూర్య మీద దాడి జరుగుతుంది. దాన్నుంచి బయటపడి జీవనం సాగిస్తున్న సూర్యకు సహస్ర (రాగిణి) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సహస్ర తల్లి కూడా అవుతుంది. ఐతే ఆ సమయంలోనే తన ఊళ్లో సమస్యను పరిష్కరించుకోవడానికి బయల్దేరతాడు సూర్య. అక్కడికి వెళ్లాక సూర్యకు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. సహస్రను వదులుకుని.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ పరిస్థితుల్లో అతనేం చేశాడు.. ఇంతకీ సూర్య గతమేంటి.. అతడి గురించి తెలిసిన సహస్ర ఎలా స్పందించింది.. చివరికి సూర్య ఎవరిని పెళ్లాడాడు.. తనకు ఎదురైన సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు.. అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘నేను పెంచిన మొక్కలు కూడా నన్ను మోసం చేయవమ్మా.. నేను అనుకున్నపుడే కాయలు.. పూలు కాస్తాయి.. నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు. పెళ్లి కాకుండానే బిడ్డను కనబోతున్నావు’’ అంటూ ‘సిద్ధార్థ’ సినిమాలో పరుచూరి వెంకటేశ్వరరావు ఓ భావోద్వేగమైన డైలాగ్ చెబుతాడు. ఇలాంటి డైలాగులు 80లు.. 90ల్లో పరుచూరి సోదరులు చాలా రాసేవారు. వాటికి ప్రేక్షకులు కదిలిపోయేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి డైలాగ్ రాయడంలో ఔచిత్యం కనిపించదు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి మారింది. సినిమాలు మారాయి. కానీ ‘సిద్ధార్థ’ టీం మాత్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లి అప్పటి కాలానికి సరిపోయే కథాకథనాలతో వచ్చింది. అందుకే కథకు తగ్గట్లుగా ఇలాంటి మాటలు రాశారు పరుచూరి సోదరులు.

సిద్ధార్థ.. వినగానే మంచి ఫీలింగ్ కలిగించే టైటిల్. ట్రైలర్ అదీ చూస్తే మంచి యాక్షన్ సినిమా ఏదో వడ్డించబోతున్నారనిపించింది. పైగా మణిశర్మ.. గోపాల్ రెడ్డి.. పరుచూరి బ్రదర్స్ లాంటి పేర్లను పోస్టర్ మీద చూసి ఇందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండకపోదులే అనుకుంటాం. కానీ థియేటర్లోకి వెళ్లిన తర్వాతే అర్థమవుతుంది ఇది ‘పేరు గొప్ప’ సినిమా అని. ‘సమరసింహారెడ్డి’ కాలం నాటి కథ.. పైగా దానికి ఏమాత్రం సూటవ్వని హీరో.. తలా తోకా లేకుండా సాగిపోయే కథనం.. అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని గందరగోళం.. సీరియల్ తరహాలో నత్తనడకన సాగే సన్నివేశాలు.. స్థూలంగా ఇదీ ‘సిద్ధార్థ’ కథా కమామిషు.

బుల్లితెరపై సాగర్ కు ఎలాంటి ఇమేజ్ అయినా ఉండనివ్వండి. అతను వెండితెరకు కొత్త. అతడికి ఇక్కడ ఎలాంటి ఇమేజ్ లేదు. మరి అలాంటి హీరోను పెద్ద మాస్ హీరో లాగా ప్రొజెక్ట్ చేయాలని ఎందుకనిపించిందో దర్శకుడు దయానందరెడ్డికి. ఈ కథకు సాగర్ ఏమాత్రం సూటవ్వలేదు. మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు మాత్రమే ఈ కథలు నప్పుతాయి. అలాగని ఈ కథ గొప్పగా ఉంది అనుకుంటే పొరబాటే. పదేళ్ల కిందటే ఇలాంటి కథలు ఔట్ డేట్ అయిపోయిన పరిస్థితి. హీరో ఫ్యాక్షన్ గొడవలో తలదూర్చడం.. ఆ తర్వాత ఐడెంటిటీ మార్చుకుని వేరే చోట బతకడం.. అతణ్ని గతం వెంటాడటం.. తిరిగి తన ఊరికి వచ్చి కథకు ముగింపు పలకడం.. ఈ ఫార్ములా ఎంతగా అరిగిపోయిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

ఎంత రొటీన్ అయినా సరే.. ఈ కథనైనా ఆసక్తికరంగా చెప్పారా అంటే అదీ లేదు. ఆరంభంలో హీరోకు ఇచ్చే బిల్డప్ చూస్తే.. అతడికేదో భారీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అందులో చాలా ఇంటెన్సిటీ ఉంటుందని.. అతనో పెద్ద లీడర్ అని భ్రమిస్తాం. కానీ ఫ్లాష్ బ్యాక్ చూశాక.. ‘కొండంత రాగం తీసి..’ అనే సామెత గుర్తుకొస్తుంది. హీరో తండ్రిని శత్రువు చంపుతాడు.. హీరో వెళ్లి అతణ్ని చంపుతాడు. అంతే.. ఓ ఐదు నిమిషాల్లో ముగిసిపోయే సాదాసీదా ఫ్లాష్ బ్యాక్ అది. కొంచెం రిచ్ గా ఉంటుందని ప్రథమార్ధాన్ని మలేషియా బ్యాక్ డ్రాప్ లో నడిపించారు. లవ్ స్టోరీని మిక్స్ చేశారు. అది చాలా పేలవంగా సాగుతుంది.

ఐతే ద్వితీయార్ధం చూశాక ప్రథమార్థమే ఉన్నంతలో బెటర్ అనిపిస్తుంది. ఏ విషయం లేకుండా ఊరికే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిల్డప్పులతో సాదాసీదాగా నడిచే ద్వితీయార్ధం సహనానికి పరీక్ష పెడుతుంది. హీరోయిన్ పాత్రతో సెంటిమెంటు పండించడానికి చేసిన ప్రయత్నం కామెడీ అయిపోయింది. కనీసం హీరో పాత్రను వీరోచితంగా అయినా చూపించి మాస్ ప్రేక్షకుల్ని కాస్తయినా ఎంటర్టైన్ చేశాడా అంటే అదీ లేదు. పెద్ద మాస్ హీరోలా అతను నడిచి రావడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ మోతెక్కించేయడం.. ఏ విషయం లేకుండా సాదాసీదాగా సన్నివేశం ముగియడం.. ఇలా సాగుతుంది వ్యవహారం. క్లైమాక్స్ కూడా రొటీన్.

నటీనటులు:

సాగర్ నటన బాగానే ఉంది కానీ.. ఈ సినిమానే అతడికేమాత్రం సూటవ్వలేదు. అతను ‘మొగిలి రేకులు’ హ్యాంగోవర్లోనే ఉన్నాడని చాలా సన్నివేశాల్లో అర్థమవుతుంది. అతడి బాడీ లాంగ్వేజ్.. హావభావాలు ఈ సీరియల్ నే గుర్తుకు తెస్తాయి. లీడ్ హీరోయిన్ రాగిణికి పెద్ద రోలే దొరికింది కానీ.. ఆమె అంతగా ఆకట్టుకోలేదు. అవసరానికి మించి నటించేసింది. గ్లామర్ పరంగానూ ఆమె అంతగా ఆకట్టుకోలేదు. సాగర్ పక్కన ఆమె సూటవ్వలేదు. సాక్షి చౌదరిది మొక్కుబడి పాత్ర. అజయ్.. సుబ్బరాజు.. రణధీర్.. సన.. కోట శ్రీనివాసరావు.. ఏదో ఆ పాత్రలకు తగ్గట్లుగా చేశారు.

సాంకేతికవర్గం:

‘సిద్ధార్థ’ పాటలు.. నేపథ్య సంగీతం వింటే నిజంగా మణిశర్మ ఈ సినిమాకు పని చేశాడా అని కచ్చితంగా సందేహం కలుగుతుంది. ఆయన ఫామ్ లో లేడని అనుకోవడానికి కూడా లేదు. మొన్నే ‘జెంటిల్మన్’ సినిమాలో అదరగొట్టాడు. ఈ సినిమాకు వచ్చేసరికి ఏమైందో..? అయినా సినిమాలో విషయం లేనపుడు ఆయన మాత్రం ఏం చేస్తారని కూడా సమాధానపరుచుకోవచ్చు. గోపాల్ రెడ్డి ఛాయాగ్రహణం.. పరుచూరి సోదరుల మాటల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవడానికేమీ లేదు. నిర్మాణ విలువలు పర్వాలేదు. సాగర్ మీద ఓ మోస్తరుగానే ఖర్చు పెట్టారు. దర్శకుడు దయానంద్ రెడ్డి పూర్తిగా నిరాశ పరిచాడు. ఈ రోజుల్లో ఓ యువ దర్శకుడికి ఇలాంటి కథాకథనాలతో సినిమా చేయాలనిపించడం ఆశ్చర్యమే. రైటింగ్.. డైరెక్షన్ రెండింట్లోనూ అతను మెప్పించలేకపోయాడు.

చివరగా: ఔట్ డేటెడ్ ‘సిద్ధార్థ’

రేటింగ్- 1.5/5