Begin typing your search above and press return to search.

రజినీ - స్టాలిన్ సమక్షంలో శింబుతో నా పెళ్లి జరగాలి: 'ముత్తు' హీరోయిన్

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:15 PM GMT
రజినీ - స్టాలిన్ సమక్షంలో శింబుతో నా పెళ్లి జరగాలి: ముత్తు హీరోయిన్
X
2018 లో 'జంబ లకిడి పంబ' అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ సిద్ధి ఇద్నాని. ఆ తర్వాత 'ప్రేమ కథా చిత్రం 2' 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' వంటి మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవీ సక్సెస్ అవ్వకపోవడంతో సిద్ధి గురించి ఇక్కడ పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు ఓ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

టాలీవుడ్ లో సక్సెస్ కాకపోవడంతో కోలీవుడ్ మీద దృష్టి పెట్టిన సిద్ధి ఇద్నాని.. స్టార్ హీరో శింబు సరసన 'వెందు తానిండదు కాదు' సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా.. తమిళ నాట శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మరియు అభిమానుల నుండి సానుకూల స్పందన లభిస్తోంది. ఇది రెండు రోజుల్లోనే రూ. 23 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

'వెందు తానిండదు కాదు' ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సిద్ధి ఇద్నాని మాట్లాడుతూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు ఉదయనిధి స్టాలిన్ సమక్షంలో శింబుతో ఆమె వివాహం జరగాలని చెప్పింది. కాకపోతే ఇది రియల్ లైఫ్ లో కాదు లెండి.. ఇలాంటి కథతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పింది.

శింబుతో కలిసి ఎలాంటి స్టోరీలో పనిచేయడానికి ఇష్టపడతారని యాంకర్ అడగ్గా.. సిద్ధి అప్పటికప్పుడు కథ అల్లేసింది. ''శింబు మరియు నేను స్కూల్ డేస్ నుంచే స్వీట్‌ హార్ట్స్‌ గా ఉండాలి. రజనీకాంత్ నా తండ్రిగా.. ఉదయనిధి స్టాలిన్ శింబు సోదరుడిగా నటించాలి. చివరికి రజినీ కాంత్ - ఉదయనిధి స్టాలిన్‌ మాకు పెళ్లి చేస్తే బాగుంటుంది'' అని యంగ్ బ్యూటీ సరదాగా చెప్పుకొచ్చింది.

తమిళ డెబ్యూ VTK తో తమిళ హృదయాలను కొల్లగొట్టిన సిద్ధి ఇద్నాని.. ఇప్పటికే 'నూరు కోడి వానవిల్‌' అనే మరో చిత్రానికి సైన్ చేసింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో కలిసి నటించడానికి అవకాశం వస్తే.. అది చిన్న పాత్ర అయినా చేస్తానని చెబుతోంది.

ఇదిలా ఉంటే, 'వెందు తానిండదు కాదు' చిత్రాన్ని ''ది లైఫ్ ఆఫ్ ముత్తు'' అనే పేరుతో శ్రీ స్రవంతి మూవీర్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు శనివారం మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవ్వగా.. మ్యాట్నీ షోలతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలోకి వచ్చింది.

బ్రతుకు దెరువు కోసం చిన్న పల్లెటూరి నుండి సిటీకి వెళ్లిన ఓ సామాన్య యువకుడు.. అనుకోని పరిస్థితుల్లో చివరికి డాన్ గా ఎలా మారాడనేది ఈ సినిమా కథాంశం. ప్రముఖ రచయిత జయమోహన్ కథ అందించగా.. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. గౌతమ్ మీనన్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాతో సిద్ధి ఇద్నాని పేరు తమిళనాట బాగా వినిపిస్తోంది. మరి 'ముత్తు' తెలుగులోనూ అమ్మడికి మంచి ఆఫర్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.