Begin typing your search above and press return to search.

విశాల్ కుక్క కాదు.. నక్క- శింబు

By:  Tupaki Desk   |   8 Oct 2015 7:30 AM GMT
విశాల్ కుక్క కాదు.. నక్క- శింబు
X
మన మూవీ ఆర్డిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఎంత రచ్చ జరిగిందో గుర్తుంది కదా. ఆ రచ్చకు ఏమాత్రం తీసిపోవట్లేదు తమిళ ‘నడిగర్ సంఘం’ గొడవ. దాదాపు ఆరు నెలల ముందు మొదలైన రభస ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఇంకో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శరత్ కుమార్ వర్గం, విశాల్ వర్గం చెన్నైలో కత్తులు దూసుకుంటున్నాయి. ముందు విశాల్ బృందమే శరత్ వర్గంపై విరుచుకుపడుతూ వాళ్లను డిఫెన్స్ లోకి నెడుతూ వచ్చింది. ఐతే ఎన్నికలు దగ్గర పడే సమయానికి శరత్ వర్గం కత్తులకు పదును పెట్టింది. మొన్న విశాల్-నాజర్ వర్గానికి మద్దతుగా నిలిచినందుకు కమల్ హాసన్ పై శరత్ కుమార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించగా.. తాజాగా శరత్ వర్గం తరఫున ఎన్నికల్లో నిలబడిన యువ కథానాయకుడు శింబు విశాల్ మీద విరుచుకుపడ్డాడు.

తమిళ నటుల కుటుంబంలో చీలికలు తేవడానికి విశాల్ ప్రయత్నిస్తున్నాడని.. నిన్నకాక మొన్న వచ్చిన బచ్చా విశాల్ అని.. శరత్ కుమార్ లాంటి సీనియర్ని విమర్శించడానికి అతడికి అర్హత లేదని శింబు అన్నాడు. నడిగర్ సంఘం విషయంలో ఇబ్బందులేమైనా ఉంటే చర్చించుకోవాలని.. అలా కాకుండా వీధిలో పడి గొడవ చేయడం విశాల్ నీచమైన బుద్ధికి నిదర్శనమని శింబు అన్నాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ పడగొట్టడం గురించి ఇప్పుడొచ్చి గొడవ చేస్తున్న విశాల్.. ఇంతకుముందు ఎక్కడికి పోయాడని శింబు ప్రశ్నించాడు. తమ వర్గానికి చెందిన సీనియర్ నటుడు రాధా రవి విశాల్ ను ‘కుక్క’ అనడం తప్పేనని.. ఐతే విశాల్ నిజానికి ‘నక్క’ లాగా కుటిల యత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తాడు విశాల్. మరి ఈ విమర్శలపై విశాల్ అండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.