Begin typing your search above and press return to search.

బాబూ శింబూ.. ఈ పైత్యమేంది?

By:  Tupaki Desk   |   9 Sep 2015 3:39 AM GMT
బాబూ శింబూ.. ఈ పైత్యమేంది?
X
శింబు అంటే కేరాఫ్ కాంట్రవర్శీ అని స్థిరపడిపోయింది కోలీవుడ్ లో. అతడి ప్రతి సినిమాకూ ఏదో ఒక వివాదం ఉండి తీరాల్సిందే. ‘వాలు’ సినిమా విషయంలో ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. రెండు మూడేళ్ల పాటు వాయిదా పడి.. ఎట్టకేలకు గత నెలలో విడుదలకు నోచుకుందా సినిమా. ఐతే శింబు నటించిన ఇంకో సినిమా విషయంలో ఇప్పుడు గొడవ మొదలైంది. పసంగ లాంటి జాతీయ అవార్డు సినిమా తీసిన పాండిరాజ్ దర్శకత్వంలో శింబు ‘ఇదు నమ్మ ఆళు’ అనే సినిమాలో నటించాడు. నయనతార, హన్సిక కథానాయికలు. ఈ సినిమా నిర్మాత శింబు తండ్రి టి.రాజేందరే. ఈ మూవీ కూడా ఎప్పుడో రెండేళ్ల కిందట రిలీజవ్వాల్సింది. కానీ రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ‘వాలు’ విడుదల తర్వాత ఈ సినిమా విడుదలకు కూడా మార్గం సుగమమైంది. కానీ శింబు, రాజేందర్ ల పైత్యం వల్ల సినిమా రిలీజ్ కు నోచుకోవట్లేదు.

‘ఇదు నమ్మ ఆళు’కు శింబు తమ్ముడు కురలరసన్ సంగీతమందిస్తుండటం విశేషం. ఐతే శింబు, రాజేందర్ ల రికమండేషన్ వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో అతణ్ని మ్యూజిక్ డైరెక్టరుగా పెట్టుకున్నాడు కానీ.. అతడి పని తీరు పాండిరాజ్ కు అస్సలు నచ్చలేదు. అతడిచ్చిన మాస్ ట్యూన్లు వద్దన్నా శింబు, రాజేందర్ వినిపించుకోలేదు. అసలు స్క్రిప్టు ప్రకారం ఏమాత్రం అవసరం లేని రెండు పాటల్ని కలిసి తండ్రీకొడుకులు సినిమాలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఓ మాస్ మసాలా పాట కోసం పట్టుబడుతున్నారు. తన సినిమాలో ఈ పాట అస్సలు సూటవదని మీడియా ముందే నిక్కచ్చిగా చెప్పేశాడు పాండిరాజ్. ఐతే ఈ పాట ఉండాల్సిందే అని పట్టుబడుతున్నారు. పైగా ఇప్పటికే నయనతార డేట్లను చాలాసార్లు వేస్ట్ చేసిన శింబు, రాజేందర్.. ఇంకో రెండు పాటల్లో నటించాలని, అవి పూర్తయ్యాకే బ్యాలెన్స్ రూ.50 లక్షలు పేమెంట్ ఇస్తామని కండిషన్ పెట్టారు. ఐతే నేనా పాటలూ చేయను, ఆ 50 లక్షలూ తీసుకోనని ఖరాఖండిగా చెప్పేసింది నయన్. ఈ వివాదం ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర ఉంది. దీని గురించి శింబు మీడియాకు వివరణ ఇస్తూ.. డైరెక్టరుగా పాండిరాజ్ అభిప్రాయాన్ని గౌరవిస్తానని.. కానీ తన సినిమాల్లో మాస్ పాటల కోసం అభిమానులు ఎన్నో ఆశలతో వస్తారని.. నయన్ కూడా ఆ పాటలు పూర్తి చేస్తే బాగుంటుందని.. తామెవ్వరితోనూ గొడవ పడట్లేదని.. సామరస్యపూర్వకంగానే సమస్య పరిష్కరించుకోవాలని చూస్తున్నామని తెలిపాడు.