Begin typing your search above and press return to search.

పేరేమో సరసుడు.. సినిమాకేమో క్లీన్ ‘యు’

By:  Tupaki Desk   |   8 Jun 2017 11:00 AM GMT
పేరేమో సరసుడు.. సినిమాకేమో క్లీన్ ‘యు’
X
సరసుడు.. ఈ టైటిల్ వినగానే ఏదో తేడాగా అనిపించడం సహజం. ఇదేదో బి-గ్రేడ్ సినిమా టైటిల్ లాగా అనిపిస్తుంది. రొమాన్స్ డోస్ బాగా ఎక్కువున్న సినిమా అనిపిస్తుంది. కానీ టైటిల్ ఇలా ఉన్నప్పటికీ సినిమాలో కంటెంట్ మాత్రం చాలా క్లీన్ గా ఉందంటూ సెన్సార్ బోర్డు వాళ్లు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ కట్టబెట్టారు. శింబు-నయనతార-ఆండ్రియా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా చాలా బాగుందంటూ కితాబు కూడా ఇచ్చారట చిత్ర బృందానికి. ఈ సినిమా తెలుగు అనువాద కార్యక్రమాలు గత ఏడాదే పూర్తయినప్పటికీ.. రిలీజ్ కోసం మంచి డేట్ దొరక్క.. ఇంకొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకుంటూ వచ్చారు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఇదు నమ్మ ఆళు’కు అనువాదమే ఈ ‘సరసుడు’.

శింబు కెరీర్లో ‘ఇదు నమ్మ ఆళు’ చాలా ప్రత్యేకమైన సినిమా. వరుస ఫ్లాపుల్లో సతమతమవుతున్న తరుణంలో అతడికి గత ఏడాది పెద్ద బూస్ట్ ఇచ్చిందీ సినిమా. ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలైన ఈ సినిమా.. చాలా ఆలస్యంగా గత ఏడాదే విడుదలైంది. ఇలా డిలే అయిన సినిమాలు ఆడటం అరుదు. ఈ చిత్రం శింబుకు మరింత ప్రత్యేకంగ మారడానికి మరో కారణం.. ఇందులో అతడి మాజీ ప్రేయసి నయనతార కథానాయికగా నటించడమే. వీళ్ల నిజ జీవితానికి దగ్గరగా ఉండే డైలాగులు సినిమాలో ఉంటాయి. ఇద్దరూ ప్రేమించుకోవడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం.. ఇలా సాగుతుంది ‘ఇదు నమ్మ ఆళు’ సినిమా. ‘కథకళి’..‘మేము’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆదా శర్మ ఓ ఐటెం సాంగ్ చేసింది. ఈ చిత్రం జులైలో ప్రేక్షకుల ముందుకొస్తుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/