Begin typing your search above and press return to search.

పుష్పక విమానం టైటిల్‌ హక్కుల పట్ల సింగీతం వారి రియాక్షన్‌!

By:  Tupaki Desk   |   11 Nov 2021 9:32 AM GMT
పుష్పక విమానం టైటిల్‌ హక్కుల పట్ల సింగీతం వారి రియాక్షన్‌!
X
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన పుష్పక విమానం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను స్వయంగా విజయ్‌ దేవరకొండ నిర్మించడం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాను ఏదో నిర్మించి వదిలేశాం అనుకోకుండా తమ్ముడితో కలిసి గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. తన లైగర్ సినిమా చిత్రీకరణ ఉన్నా కూడా పుష్పక విమానం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమాయకపు బడి పంతులు భార్య పెళ్లి అయిన వెంటనే లేచి పోవడం.. దాన్ని కవర్ చేయడంకు ఆ బడి పంతులు పడే ఇబ్బందులను చాలా వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించడం జరిగిందట.

పుష్పక విమానం పాత సినిమా ఒకటి ఉంది. లెజెండ్రీ డైరెక్టర్‌ అయిన సింగీతం శ్రీనివాస్ గారు తెరకెక్కించిన ఆ సినిమా ఇప్పటికి జనాల్లో చర్చనీయాంశంగా ఉంది. సింగీతం వారు ఆవిష్కరించిన ఎన్నో అద్బుతాల్లో పుష్పక విమానం ఒకటి అనడంలో సందేహం లేదు. ఆ టైటిల్ తో రౌడీ బ్రదర్ సినిమా వస్తుండటంతో ఒక రకమైన చర్చ మొదలు అయ్యింది. ముఖ్యంగా ఈ టైటిల్‌ కు జూనియర్ దేవరకొండ న్యాయం చేయగలడా అంటూ కొందరు.. పెళ్లాం లేచి పోయే కథకు ఈ టైటిల్‌ ఏంటీ అంటూ మరి కొందరు రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో హీరో ఆనంద్ దేవరకొండ టైటిల్ విషయమై స్పందించాడు. కథకు నూరు శాతం యాప్ట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో మాత్రమే టైటిల్ ను ఎంపిక చేయడం జరిగింది కాని.. ఏదో పబ్లిసిటీ వస్తుందని మాత్రం కాదన్నట్లుగా చెప్పేశాడు.

ఈ సినిమా టైటిల్ ను పుష్పక విమానం అనుకున్న సమయంలో సింగీతం వారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన అనుమతితో మా సినిమాకు ఆ టైటిల్‌ ను పెట్టాలనుకున్నాం. ఆయన పర్మీషన్‌ అడిగిన సమయంలో దానికి నా పర్మీషన్ ఏమీ అక్కర్లేదు. పుష్పక విమానం అనేది నేను పుట్టించిన పేరు కాదు. అది మన పురాణ ఇతిహాసాలకు సంబంధించిన పేరు. కనుక ఆ పేరును ఎవరైనా వినియోగించుకోవచ్చు అన్నారు. టైటిల్‌ కథ అవసరం కాబట్టే పెట్టామన్నట్లుగా ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమాకు టైటిల్ యాప్ట్‌ అని ప్రేక్షకులు ఒప్పుకుంటారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాపై ఆనంద్ దేవరకొండ చాలా నమ్మకంతో ఉన్నాడు. తమ్ముడికి ఈ సినిమాతో మంచి విజయాన్ని ఇవ్వాలని విజయ్ దేవరకొండ కూడా ఆశ పడుతున్నాడు. మరి ఏం జరుగుతుంది అనేది మరి కొన్ని గంటల్లో విడుదల కాబోతున్న సినిమా ఫలితంతో క్లారిటీ వచ్చేయనుంది.