Begin typing your search above and press return to search.

సింగ‌ర్ హర్షిత దారుణ హ‌త్య‌!

By:  Tupaki Desk   |   18 Oct 2017 10:56 AM GMT
సింగ‌ర్ హర్షిత దారుణ హ‌త్య‌!
X
హ‌ర్యానా - పంజాబ్ ల‌లో తన అల్బమ్స్ తో యూత్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న సింగ‌ర్‌ హర్షితా దహియాని దారుణ హ‌త్య‌కు గురైంది. ఢిల్లీ శివార్లలో గుర్తు తెలియ‌ని దుండ‌గులు ఆమెను మంగ‌ళ‌వారం సాయంత్రం కాల్చి చంపారు. దహియా తల - గొంతులో ఆరు బుల్లెట్లు దిగడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఢిల్లీలోని నారెల్లా ప్రాంతంలో ఓ షోలో పాల్గొన్న ఆమె తిరిగి పానిపట్ కు వెళ్తుండగా ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఆమెతో పాటు కారులో ముగ్గురు వ్య‌క్తులు ప్ర‌యాణిస్తున్నారు. ప‌థ‌కం ప్ర‌కార‌మే ఇద్ద‌రు దుండ‌గులు ఆమె కారును ఓవ‌ర్ టేక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత అత్యంత సమీపం నుంచి హ‌ర్షితపై కాల్పులు జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత నిందితులు అక్క‌డ నుంచి పారిపోయిన‌ట్లు వారు తెలిపారు.

ఆమెతో పాటు ప్ర‌యాణిస్తున్న వారిని కారు దిగ‌మ‌ని దుండ‌గులు చెప్పిన‌ట్లు హ‌ర్యానా ఎస్పీ రాహుల్ తెలిపారు. ఆ త‌ర్వాత హ‌ర్షిత‌ను అతి దారుణంగా కాల్చి చంపార‌ని చెప్పారు. ఆమె ఘ‌ట‌నా స్థ‌లంలోనే మ‌ర‌ణించిందని తెలిపారు. త‌న‌ సోద‌రి ల‌త‌ భ‌ర్త దినేష్ పై హ‌ర్షిత రేప్ కేసు పెట్టింది. ఆమె త‌ల్లి హత్య కేసులో కూడా హ‌ర్షిత కీల‌క‌మైన సాక్షి. దీంతో, ఆమెను చంపేస్తామంటూ కొద్ది రోజులుగా బెదిరింపులు వ‌స్తున్నాయంటూ హర్షితా కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియా‌లో పోస్ట్ చేసింది. తాజాగా - హ‌ర్షిత‌ను కూడా తీహార్ జైల్లో ఉన్న త‌న‌ భ‌ర్త దినేష్ హ‌త్య చేయించి ఉంటాడని ఆమె సోద‌రి ల‌త ఆరోపిస్తున్నారు. హ‌ర్షిత హత్య ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.