Begin typing your search above and press return to search.

పాట పాడుతూ వేదిక‌పై కుప్ప‌కూలి గాయ‌కుడు 'కెకె' మృతి

By:  Tupaki Desk   |   1 Jun 2022 4:09 AM GMT
పాట పాడుతూ వేదిక‌పై కుప్ప‌కూలి గాయ‌కుడు కెకె మృతి
X
వేదికపై ప్రదర్శన ఇచ్చిన గాయకుడు ఆక‌స్మికంగా కుప్ప‌కూలి మరణించడం క‌ల‌చివేసింది. ప్రముఖ గాయకుడు కెకె లైవ్‌ పెర్ఫామెన్స్‌ లో స‌డెన్ డెత్ కి గుర‌వ్వ‌డం అభిమానుల హృద‌యాల‌ను క‌ల‌చివేస్తోంది. అతడు మరణించినప్పుడు పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో వేదికపై ప్రదర్శన ఇస్తున్నట్లు సమాచారం. కేకే వ‌య‌సు 53. కేకే తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అత్యంత‌ ఆప్తుడు. అత‌డు విక్ట‌రీ వెంక‌టేష్ `ఘ‌ర్ష‌ణ`లో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ `చెలియ చెలియ..`ను ఆల‌పించాడు. రామ్ చ‌ర‌ణ్ `ఎవ‌డు` చిత్రంలో చెలియ చెలియ‌ను పాడారు. ఆర్య 2లో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ఉప్పెనంత ప్రేమ‌కు ఆల‌పించిన‌ది కేకే. మ‌హేష్ `అత‌డు` చిత్రంలో `అవును నిజం..` పాట‌ను ఆల‌పించింది... ప‌వ‌న్ `గుడుంబా శంక‌ర్` లో `లేలే ..` పాట‌ను ఆల‌పించిన‌ది కేకే. తెలుగులో ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ల‌ను ఆల‌పించిన గాయ‌కుడు ఆయ‌న‌. కేకే గానం ఎంతో ఎన‌ర్జీతో కూడుకుని ఉంటుంద‌న్న‌ది ఆయ‌న పాట‌లు వింటే అర్థ‌మ‌వుతుంది.

కేకే కుటుంబ స‌న్నిహితుల‌ స‌మాచారం మేర‌కు.. KK తన ప్రదర్శన సమయంలో వేదికపై కుప్పకూలిపోయాడు. అనంత‌రం ఆసుపత్రికి తరలించారు. రాత్రి 10 గంటల సమయంలో కోల్ కతాలోని సీఎంఆర్ ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అతను అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు ప్రకటించారు. ఈ మ‌ర‌ణానికి కార‌ణం అతను వేదికపై గుండెపోటుకు గురవ్వ‌డ‌మేన‌ని తెలిసింది.

భారతీయ చలనచిత్ర పరిశ్రమ బహుభాషా గాయకులలో ఒకరైన KK హిందీ- తమిళం- తెలుగు- కన్నడ- బెంగాలీ వంటి అనేక భాషలలో పాట‌లు పాడారు. KK కు భార్య పిల్లలు ఉన్నారు. గత మూడు దశాబ్దాలుగా భారతీయ సంగీత ప్రియులకు ఎన్నో చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌ల‌ను అందించిన గాయకుడు కెకె 53 ఏళ్ళ వయసులో మరణించారు. మంగళవారం నాడు ఆయ‌న‌ నజ్రుల్ మంచాలో ప్రదర్శన ఇచ్చారు. తరువాత అతను అస్వస్థతకు గురై కుప్ప‌కూలాక‌ తన హోటల్ రూమ్ కు వెళ్లారు. అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కేకే మ‌ర‌ణం గురించి తెలిసిన అనంత‌రం దేశ ప్ర‌ధాని మోదీ త‌న దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసారు. కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతిని వ్య‌క్తం చేసారు. కెకె మరణం గురించి మంత్రి అరూప్ బిస్వాస్ మాట్లాడుతూ-``యకుడు అనుపమ్ రాయ్ నాకు ఫోన్ చేసి ఆసుపత్రి నుండి ఏదో చెడు వింటున్నామ‌ని చెప్పారు. అప్పుడు నేను ఆసుపత్రిని సంప్రదించాను. అతను(కేకే) చనిపోయాడని వారు చెప్పారు. అప్పుడు నేను ఆసుపత్రికి వెళ్లాను`` అని తెలిపారు.

KK తన మొదటి ఆల్బమ్ `పాల్‌`ని 1999లో విడుదల చేసాడు. గాయకుడు-కంపోజర్ గా అత‌డు ప‌రిశ్ర‌మ‌లో సుప్ర‌సిద్ధులు. అతని అసలు పేరు కృష్ణకుమార్ కున్నాత్. తర్వాత ఇండివిడ్యువ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌ల కంటే బాలీవుడ్ లో పాడేందుకు ఎక్కువ దృష్టి సారించాడు. తడప్ తడప్ (హమ్ దిల్ దే చుకే సనమ్ 1999),.. దస్ బహనే (దస్ 2005)వంటి హిట్ పాట‌లను అందించాడు. గుండే (2014) మూవీలో మారి ఎంట్రియాన్ పాట‌ను పాడారు.

కేకే ఢిల్లీలో జన్మించాడు. ఎలక్ట్రిక్ లైవ్ షోలతోనూ అత‌డు పాపుల‌ర‌య్యాడు. అతని ఇన్ స్టా పేజీ లో ఎనిమిది గంటల క్రితం కోల్ కతాలో అతని సంగీత కచేరీ నుండి వ‌రుస ఫోటోల బంచ్ ని షేర్ చేసారు. ఈ ఫోటోల్లో అతను చాలా ఫిట్ గా ఉన్నాడు అని అభిమానులు అంటున్నారు. ఇంత‌కుముందు మలయాళ గాయకుడు యేదవ బషీర్ లైవ్ ప్రదర్శనలో వేదికపై కుప్పకూలి మరణించిన ఘ‌ట‌న‌ను ఇప్పుడు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. గాయకుడు కెకె మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అంటూ ప‌లువురు సినీ రాజకీయ నాయకులు నివాళులర్పించారు.

KK మరణం తో అక్షయ్ కుమార్- హర్షదీప్ కౌర్- విశాల్ దద్లానీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రియమైన #KK ఇక లేడని నమ్మలేకపోతున్నాం. ఇది నిజంగా నిజం కాకపోవచ్చు. ప్రేమ స్వరం పోయింది. ఇది హృదయ విదారకం.. అంటూ సాటి గాయ‌కులు ఆందోళ‌నను వ్య‌క్తం చేసారు. అక్షయ్ కుమార్ ఇలా రాసారు. ``KK ఆక‌స్మిక‌ మరణం గురించి తెలిసి చాలా షాక్ అయ్యాను. ఎంత నష్టం! ఓం శాంతి`` అని రాసారు. ఫిలింమేక‌ర్ శ్రీజిత్ ముఖర్జీ ఫేస్ బుక్ లో ఇలా రాసారు. ``షాక‌య్యాను... గత నెలలో అతన్ని మొదటిసారి కలుసుకున్నాను. మేము ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు అని అనిపించింది. కబుర్లు మాత్రం ఆగలేదు. గుల్జార్ సాబ్ పై ఆయనకున్న ప్రేమను చూసి నేను చాలా కదిలిపోయాను. చోర్ ఆయే హమ్ తో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టానని.. దానిని తనకు నివాళిగా ఆలపించానని చెప్పారు. నా సరికొత్త స్నేహితుడుకి వీడ్కోలు. నిన్ను మిస్ అవుతాను`` అని వ్యాఖ్యానించారు.