Begin typing your search above and press return to search.

గల్లీ సింగర్ టూ గ్లోబల్ సింగర్.. తెలుగు గాయ‌కుడి జ‌ర్నీ!

By:  Tupaki Desk   |   15 Jan 2023 3:30 PM GMT
గల్లీ సింగర్ టూ గ్లోబల్ సింగర్.. తెలుగు గాయ‌కుడి జ‌ర్నీ!
X
రామ్ చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సాధించ‌డ‌మే గాక ప్ర‌పంచ విఖ్యాత పుర‌స్కారాల‌ను ఖాతాలో వేసుకుంటోంది. ఇప్ప‌టికే ప్ర‌తిష్ఠాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని అందుకుంది. నాటు నాటు పాట‌కు ఈ గౌర‌వం ద‌క్కింది.

ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఖండాంతరాలు దాటి బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులను అందుకుంటోంది. మునుముందు ఆస్కార్ బ‌రిలోను స‌త్తా చాటే వీలుందని చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలోని `నాటు నాటు..` పాట ప్రతిష్టాత్మకమైన `గోల్డెన్ గ్లోబ్` అవార్డుని దక్కించుకుంది. అంత‌టి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డు అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్. నిలిచింది. ఇది మన తెలుగు చిత్రం కావ‌డం దీనిలోంచి ఒక తెలుగు పాటకి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం అభినందనీయం.

మ‌ర‌క‌త‌మ‌ణి ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాటు నాటుకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసారు. కీర‌వాణి ట్యూన్ దానికి త‌గ్గ‌ట్టు చ‌ర‌ణ్‌-తార‌క్ జోడీ స్టెప్పులు ప్ర‌తిదీ అందంగా కుదిరాయి. అయితే నాటు నాటు అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై గొప్ప వెలుగులు విర‌జిమ్ముతున్న వేళ ఈ పాట‌ను ఆల‌పించిన గాయ‌నీగాయ‌కుల‌ను మ‌ర్చిపోవ‌డం అన్యాయం.

పాడింది హైద‌రాబాద్ లోని ఒక గ‌ల్లీ బోయ్. ప‌ట్టుద‌ల కృషితో ప‌రిశ్ర‌మ‌లో గాయ‌కుడై అటుపై ఇంతింతై అన్న‌చందంగా ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట‌ను ఆల‌పించారు. మ‌రో గాయ‌కుడు.. కీర‌వాణి త‌న‌యుడు కాలభైరవ తో కలిసి ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్‌ ఆలపించారు. ఆస‌క్తిక‌రంగా తెలుగు-హింది-తమిళ్-క‌న్నడ నాలుగు భాషల్లోను రాహుల్ పాడారు. రాహుల్ పై కీరవాణి కి ఉన్న నమ్మకానిదే నేటి గెలుపు. `నాటు నాటు...` లాంటి ఎన‌ర్జిటిక్ పాట‌ను పాడే అవకాశం ఏరి కోరి ఎం.ఎం.కీర‌వాణి యువ‌గాయ‌కుడు రాహుల్ కే ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో గాయ‌కులు ఉండ‌గా అరుదైన అవకాశం అదృష్టం అత‌డికి మాత్ర‌మే ద‌క్కింది.

గల్లీ నుండి ఢిల్లీ వ‌ర‌కూ ఈ జైత్ర‌యాత్ర సాగింది. హైద‌రాబాద్ కృష్ణా న‌గ‌ర్ అనే గల్లీ నుండి గ్లోబల్ వ‌ర‌ల్డ్ ని శాసించే అమెరికా స‌హా ఇత‌ర దేశాల‌ వరకు అత‌డు పాడిన పాట‌ చేరింది అంటే.. అది ప్ర‌శంసించ‌దిన సంద‌ర్భం. ఇప్పుడు రాహుల్ లోక‌ల్ సింగ‌ర్ కాదు.. గ్లోబల్ సింగర్.. అందులో డౌట్ లేదు.

రాహుల్ సిప్లిగంజ్ స్వ‌గ‌తంలోకి వెళితే.. అత‌డి తండ్రి హైద‌రాబాద్ పాత బ‌స్తీ- ధూల్ పేట్ లో ఒక బ్యూటీషియ‌న్. తన కొడుకు టాలెంట్ పై కొండంత నమ్మకం. ఎలాగైనా రాహుల్ ని సింగర్ ని చేయాలనుకున్నారు. గజల్ సింగర్ పండిత్ విఠల్ రావు దగ్గర సంగీతం నేర్పించారు. తరువాత రాహుల్ సినిమా అవకాశాల కోసం మంగళ్ హాట్ (ధూల్ పేట్‌) నుండి కృష్ణానగర్ కి తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించారు.

ఆ ప్రయత్నంలో మొదటగా సంగీత దర్శకుడు వెంగి పరిచయమ‌య్యారు. `నాకొక గ‌ర్ల్ ఫ్రెండ్ కావ‌లె` అనే మొదటి చిత్రంలోనే అన్ని పాటలు పాడించాడు యువ‌ద‌ర్శ‌కుడు వెంగి. తరువాత ఆ ఇద్ద‌రి స్నేహం ఈ ప్ర‌యాణం చాలా ఏళ్ళుగా కొనసాగుతూనే ఉంది. వెంగి సంగీత దర్శకుడిగా సినిమాలు చేస్తున్నారు. రాహుల్ సింగర్ గా స్థిరపడ్డారు. రాహుల్ -వెంగి స్నేహితుల ద్వ‌యం క‌లిసి కొన్ని సినిమాల‌కు ప‌ని చేసారు. చాణక్యుడు- గీతోపదేశం అనే సినిమాలకి కలిసి సంగీతాన్ని అందించారు. తరువాత రాహుల్ సిప్లిగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ పై దృష్టి సారించి తనదైన శైలిలో సక్సెస్ సాధించాడు. చాలా పాటలకి రాహుల్-వెంగి కలిసి పనిచేస్తారు. సంగీత దర్శకుడు కీరవాణి పరిచయం రాహుల్ కెరీర్ ని ఇంకో పది మెట్లు పైకి ఎక్కించింది.

కీరవాణి దగ్గర కోరస్ సింగర్ గా సింగర్ గా పాడుతూ ఒక‌దాని వెంట ఒక‌టిగా అవ‌కాశాలు అందిపుచ్చుకుని వాటిని సద్వినియోగ పరుచుకుని బాస్ కీరవాణి తోనే శభాష్ అనిపించుకున్నాడు. అలా పాడినవే `ఈగ` సినిమా టైటిల్ సాంగ్ `ఈగ ఈగ..`. తరువాత `దమ్ము` సినిమాలో `ఉత్తరం ఊపు మీదుంది` అనే పాటతో ఆక‌ట్టుకోగా.. కీరవాణి రాహుల్ కి బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు ఇచ్చారు. ఇంకా గురువుగారు కీర‌వాణి వ‌ద్ద‌నే కాకుండా ఇత‌ర సంగీత ద‌ర్శ‌కుల‌తోను అవకాశాలు సంపాదించాడు రాహుల్. ఇళయరాజా-మణిశర్మ- కోటి- దేవి శ్రీ ప్రసాద్- థమన్ -సంతోష్ నారాయణ్- అనిరుధ్‌-విశాల్-శేఖర్- అనూప్ రూబెన్స్- వెంగి స‌హా ఎంతో మంది ప్రతభావంతులైన సంగీత దర్శకుల తో గాయ‌కుడిగా కొన‌సాగ‌డం ఆస‌క్తిక‌రం.

సంచ‌ల‌నాల బిగ్ బాస్ 3 (తెలుగు) విజేతగా బుల్లితెర పై హీరో అయ్యాడు. కోట్లాది మంది తెలుగు వారికి చేరువవ్వడం రాహుల్ కెరీర్ లో మరో మలుపు. ఇప్పుడు `నాటు నాటు..` పాటకి ప్రతిష్టాత్మకమైన `గోల్డెన్ గ్లోబ్` అవార్డు దక్క‌డంతో రాహుల్ పేరుకు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ఇంత గొప్ప అవకాశాన్ని అందించిన గురువు కీరవాణి అంటే రాహుల్ కి ఎంతో వినమ్రత. కీరవాణి ని తన గాడ్ ఫాదర్ గా భావించి గౌర‌విస్తాడు రాహుల్. అలా గల్లీ సింగర్ టూ గ్లోబల్ సింగర్ గా ఎదిగిన‌ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి శుభాకాంక్ష‌లు. అత‌డిని మరిన్ని విజయాలు రావాలని ఆకాంక్షిద్దాం.