Begin typing your search above and press return to search.

కండల వీరుడ్ని తప్పు పడితే ఆమెను ఆంటీ అన్నారు

By:  Tupaki Desk   |   22 Jun 2016 1:57 PM GMT
కండల వీరుడ్ని తప్పు పడితే ఆమెను ఆంటీ అన్నారు
X
ఫైటింగ్ సీన్ ను షూట్ చేసిన తర్వాత.. తన పరిస్థితి రేప్ కు గురైన మహిళ పరిస్థితి మాదిరి ఉంటుందంటూ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యపై దేశ వ్యాప్తంగా పలువురు తప్పు పట్టటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ అభిమాన హీరో ఏం చేసినా గొప్పగా ఫీలై.. అండగా నిలిచే కొందరి దురభిమానుల తీరు ఇప్పుడు మరో చర్చగా మారింది. సల్మాన్ రేప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ సింగర్ సోనా తప్పు పట్టారు. హిట్ అండ్ రన్.. వన్యప్రాణుల వేట కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరోకు దేశంలో అభిమానించేవారు ఉండటం విడ్డూరమని ఈ సింగర్ వ్యాఖ్యానించారు.

దీంతో.. కండల వీరుడి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోయారు. సల్మాన్ కేసుల గురించి మాట్లాడటానికి నీకేం హక్కుంది? నువ్వేమైనా భారత న్యాయవ్యవస్థలో భాగమా? అంటూ తమ హీరో మీదున్న అభిమాన్నాన్ని తిట్ల రూపంలో ప్రదర్శించారు. ఇదిలా ఉంటే మరికొంతమంది అయితే.. సోనా ఫోన్ నెంబర్ తెలుసుకొని మరీ.. 40 ఏళ్ల ఆంటీ అంటూ ఎటకారం చేయటంపై ఆమె తీవ్ర ఆగ్రహానికి గురి అవుతున్నారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హీరోకి తగ్గట్లే అతగాడి ఫ్యాన్స్ కొందరు చెలరేగిపోవటంపై ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నన్న 40 ఏళ్ల ఆంటీ అంటున్నారు. నేను ఆంటీని అయితే 50 ఏళ్ల సల్మాన్ బాలుడిని వెనకేసుకురావటం కామెడీగా ఉంది’’ అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా ట్వీట్ చేశారు. తాను చేసిన కామెంట్స్ సరైనవేనని.. సల్మాన్ చెమ్చాలు నిరూపించినట్లుగా కౌంటర్ ఎటాక్ చేశారు. తన ఫ్యాన్స్ కు మంచి చెప్పాలని ఆమె సల్మాన్ ను కోరారు. అయ్యగారిలో అలాంటిదే ఉండి ఉంటే.. ఇప్పుడీ రచ్చ అసలు ఉండేదా..?