Begin typing your search above and press return to search.

ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర

By:  Tupaki Desk   |   27 Jun 2020 1:30 AM GMT
ఘోరంగా హింసించారు: తండ్రీ కొడుకుల మృతిపై సింగర్ సుచిత్ర
X
ఓవైపు ప్రపంచమంతా అమెరికాలో జాత్యాహంకార హత్యపై నిరసనలు వ్యక్తం చేస్తోంది. జార్జ్ ఫ్లాయిట్ హత్య అమెరికాను కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని టుటికోరిన్‌లో జరిగిన ఓ తండ్రీకొడుకులు జయరాజ్, ఫినిక్స్‌ల మృతి కుదిపేస్తోంది. ఈ మృతిపై ప్రముఖ సింగర్ సుచిత్ర స్పందించారు. వారిని దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపించినట్లుగా అర్థమవుతోందని ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

జయరాజ్, ఫినిక్స్‌లో మోకాళ్లను స్టిక్స్‌తో విరగ్గొట్టారని, ముఖాన్ని గోడకేసి కొట్టారని, వారి ఒంటిపై దుస్తులు లేకుండా కొట్టానట్లుగా తెలుస్తోందన్నారు. చెప్పలేని విధంగా హింసించినట్లు తెలిపారు. జస్టిస్ జయరాజ్, ఫీనిక్స్ అంటూ ట్వీట్ చేశారు. దక్షిణాది సమస్యలు ఎప్పుడూ దక్షిణాదికే పరిమితమవుతున్నాయని, అందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడకపోవడమే ప్రధాన కారణమని వీడియోలో మొదట చెప్పారు. అందుకే ఈ వివరాలను, పోలీసుల దాడి ఘటనను ఇంగ్లీష్‌లో వివరించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె జార్జ్ ఫ్లాయిడ్ హత్యను గుర్తు చేశారు.

కాగా, ఈ తండ్రీ కొడుకులు పోలీసుల కస్టడీలో తీవ్ర గాయాల కారణంగా మృతి చెందినట్లుగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వీరిద్దరి ఒక్కరోజు వ్యవధిలో మృతి చెందారు. ట్యుటికోరిన్‌కు చెందిన జయరాజ్, ఫీనిక్స్ ఇద్దరూ మొబైల్ షాప్ నిర్వాహకులు. కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలు విధించింది. మొబైల్ షాప్ నడుపుకునే వీరు ఆంక్షలు ఉల్లంఘించారని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు కస్టడీలో వీరిద్దరిపై తీవ్రంగా దాడి చేశారని, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. జూన్ 19వ తేదీన వీరు నిబంధనలకు విరుద్ధంగా తమ మొబైల్ షాప్ తెరిచి ఉంచారు. 59 ఏళ్ల జయరాజ్, 31 ఏళ్ల అతని కొడుకులను పోలీసులు ప్రశ్నించారు. కస్టడీలో పోలీసులు వారిని తీవ్రంగా కొట్టారని, ఇదే మరణానికి కారణమైందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

కస్టడీ నుండి ఇంటికి వచ్చాక వారి పురీషనాళం నుండి రక్తస్రావం జరిగినట్లు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జూన్ 20న ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్తస్రావం కావడంతో పలుమార్లు లుంగీ మార్చుకున్నారట. వారిని పోలీస్ స్టేషన్ నుండి ఆసుపత్రికి తీసుకు వెళ్లారని, అక్కడ డాక్టర్.. పోలీసుల ఒత్తిడి మేరకు ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 22న కొడుకు స్థానిక జనరల్ ఆసుపత్రిలో చేరి మృతి చెందాడు. 23న ఉదయం తండ్రి మృతి చెందాడు. పోలీసుల కస్టడీలో తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందారని మండిపడుతున్నారు. వీరి కుటుంబానికి న్యాయం జరగాలని సింగర్ సుచిత్ర, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, నటి ఖుష్బూ తదితరులు డిమాండ్ చేశారు.