Begin typing your search above and press return to search.

కామెంట్‌: స్ఫూఫ్‌లు, సెటైర్‌లు వర్కవుటవ్వవు

By:  Tupaki Desk   |   11 Jun 2015 3:30 PM GMT
కామెంట్‌: స్ఫూఫ్‌లు, సెటైర్‌లు వర్కవుటవ్వవు
X
స్పూఫ్‌లతో కామెడీలు.. ఇటీవలి కాలంలో నడుస్తున్న ట్రెండ్‌. ఈ తరహా హాస్యం పండించడం అనేది ఎప్పట్నుంచో ఉన్నదే అయినా లేటెస్ట్‌ సినిమాల్లో వీటి అతి ఎక్కువైంది.

అప్పటికే సూపర్‌హిట్‌ అయిన సినిమాల్లోంచి బాగా క్లిక్కయిన ట్రాక్‌ తీసుకుని, లేదా కొన్ని సన్నివేశాల్ని ఎంచుకుని వాటిలోకి కామెడీ ఆర్టిస్టుల్ని ప్రవేశపెట్టి స్ఫూఫ్‌ని వండి వార్చడంలో మన క్రియేటర్లు పండిపోయారు. బ్రహ్మానందం, అల్లరి నరేష్‌, అలీ, సునీల్‌ లాంటి ఆర్టిస్టులకు ఈ స్ఫూఫ్‌లు బాగా కలిసొచ్చాయి. పేరడీలు చేయడంలో, వేరొకరిని అనుకరించి హాస్యాన్ని పండించడంలో వీళ్లంతా సక్సెసయ్యారు. తమదైన పెర్ఫామెన్స్‌తో మెప్పించారు. అయితే ప్రతిసారీ అదే రొటీన్‌ కామెడీతో నవ్విస్తామంటే జనం ఒప్పుకోరు. పదే పదే అవే చూపిస్తే అసలు థియేటర్లలో సినిమాలు చూసేవాళ్లే ఉండరు.

ఇటీవలే రిలీజైన 'సింగం 123' డిజాస్టర్‌ ఫలితం అందుకుంది. ఈ స్ఫూఫ్‌ చిత్రానికి హీరో విష్ణు రచయిత. సంపూర్ణేష్‌బాబును నమ్ముకుని ఈ సినిమా తీశారు. సంపూ తొలి ప్రయత్నమే 'హృదయకాలేయం' పేరుతో సెటైరికల్‌ కామెడీ చేసి మెప్పించాడు. ఇక అదే తరహాలో తీయాలనుకున్న సింగం 123 విషయంలో కాలిక్యులేషన్‌ మిస్సయ్యింది. అందుకే అట్టర్‌ఫ్లాపైంది. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌, చరణ్‌, బన్ని, బాలయ్య సహా పలువురు హీరోల సినిమాల నుంచి సన్నివేశాల్ని ఏరుకుని వాటిని విమర్శించే స్పూఫ్‌ని చేయాలనుకున్నారు. వేరొకరిని విమర్శించడం ద్వారా కామెడీ క్రియేట్‌ చేస్తున్నామని దర్శకనిర్మాతలు భ్రమించారు. దాంతో ఫలితం తారుమారైంది. ఇటీవలే రిలీజైన రామ్‌ పండగ చేస్కో చిత్రంలోనూ స్ఫూఫ్‌ సన్నివేశాలు అస్సలు ఆకట్టుకోలేదన్న విమర్శలొచ్చాయి.

ఇప్పటివరకూ ఉన్న ఆడియెన్‌ వేరు. ఇక నుంచి ఆడియెన్‌ వేరు. ఎప్పుడూ తీసిందే తీసి చూపిస్తామంటే జనాలు అస్సలు అంగీకరించడం లేదు. అప్పట్లో అల్లరి నరేష్‌ సుడిగాడు వచ్చి పెద్ద హిట్టయ్యింది. ఆ తర్వాత అదే తరహా స్ఫూఫ్‌ కామెడీతో వచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. ప్రతి సినిమాలోనూ ఇవే తరహా స్ఫూఫ్‌లతో నవ్వించే ప్రయత్నం చేస్తే ప్రేక్షకులు సరైన గుణపాఠమే చెబుతున్నారు. అయినా పేరడీలతో ప్రతిసారీ కామెడీలు చేయడానికి లాఫింగ్‌ క్లబ్‌లు కావివి. కోట్లలో పెట్టుబడి పెట్టే సినిమాలు. అస్తమానూ ఒకే టైపు కామెడీలు చేస్తామంటే అసలు వర్కవుటయ్యే ఆస్కారమే లేదు. కాస్త ఇప్పటికైనా ఫిలింమేకర్స్‌ అర్థం చేసుకుని అర్థవంతమైన కామెడీతో సినిమాల్ని తీయాల్సి ఉంది. ఒకప్పటి జంధ్యాల, ఈవీవీ సినిమాల తరహాలోనే ఏదైనా కొత్త పాయింటుతో కామెడీ సినిమాలు తీస్తే ఎక్కుతాయి.. తప్ప సన్నివేశ బలం లేకుండా, అసలు కథే లేకుండా ఇష్టం వచ్చినవన్నీ పేపర్లపై గీకి సినిమా తీస్తే సింగం 123 టైపులోనే ఉంటుంది పరిస్థితి. ఇటీవలి కాలంలో కమర్షియల్‌ హంగులున్నా సహజసిద్ధమైన కామెడీ టచ్‌తో వచ్చి విజయం సాధించిన చిత్రాలుగా లౌక్యం, పటాస్‌ పేరు తెచ్చుకున్నాయి. రొటీన్‌ స్టఫ్‌ ఉన్నా, సీన్లలో కొత్తదనం ఈ సినిమాల విజయానికి కారణం అయ్యింది. అద్భుతమైన పంచ్‌లైన్‌తో కామెడీని ఓ రేంజులో పండించడం వల్లే వీటికి విజయాలు దక్కాయి.