Begin typing your search above and press return to search.

సిరివెన్నెల వారు చితగ్గొట్టారుగా..

By:  Tupaki Desk   |   15 Dec 2017 5:30 PM GMT
సిరివెన్నెల వారు చితగ్గొట్టారుగా..
X
తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన ఒక పాట రాశారంటే అందులో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత పాండిత్యం ఉన్నా సరే.. దాన్నంతా పాటల్లో జొప్పించాలని చూడరాయన. అతి సామాన్యులకు కూడా సులువుగా అర్థమయ్యేలా.. అందమైన పదాలతో కనికట్టు చేయడం ఆయనకే చెల్లిన విద్య. ఐతే గత కొన్నేళ్లలో ఆయన చాలా సెలెక్టివ్ గా పాటలు రాస్తున్నారు. ఆరోగ్య సమస్యల వల్ల.. ఇతర కారణాల వల్ల ఆయన పాటలు బాగా తగ్గించేశారు. తనకు చాలా సన్నిహితులు.. నచ్చిన దర్శకులకు మాత్రమే పాటలు రాస్తున్నారాయన. ఈ ఏడాది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. ‘చెలియా’.. ‘ఫిదా’ సినిమాల కోసం మాత్రం ఆయన కలం వాడారు.

ఇప్పుడాయన తనకు అత్యంత ఆప్తుడు.. బంధువు అయిన త్రివిక్రమ్ కోసం కలం కదిలించారు. ‘అజ్నాతవాసి’ సినిమా కోసం ఆయన ఓ అందమైన పాట రాశారు. అదే.. గాలి వాలుగా. ఈ పాట విన్నాక సిరివెన్నెలకు సిరివెన్నెలే సాటి అనకుండా ఉండలేం. ఎక్కడా ఒక్క కష్టమైన పదం లేదు. కానీ అడగడుగునా ఈ పాటలో సాహితీ విలువలు కనిపిస్తాయి. పండితుడు-పామరుడు.. ఇద్దరికీ అర్థమయ్యేలా ఉంటూనే.. ఎంత బాగా రాశారే అనిపించేలా సాగుతుందీ పాట. ఈ పాటలో చెప్పుకోవడానికి చాలా చమక్కులే ఉన్నాయి. ‘‘మెరుపు చురకత్తులు విసిరి’’.. ‘‘తలపునే తునకలు చేసి’’.. లాంటి చమత్కారపు మాటలకు తోడు.. ‘‘ఆలోచిద్దాం.. చక్కగా కూర్చుని చర్చిద్దాం.. చాలు యుద్ధం.. రాజీకొద్దాం’’ అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా పాట రాసి మెప్పించారు సిరివెన్నెల వారు. ఆరంభం నుంచి చివరి వరకు పదాల్ని ఏర్చి కూర్చి.. గుదిగుచ్చి.. పాటను తీర్చిదిద్దిన తీరు సాహితీ ప్రియుల్ని అలరిస్తుంది. ఈ పాటకు అనిరుధ్ ట్యూన్.. గానం కూడా అదిరిపోవడంతో ఇది ఇన్ స్టంట్ హిట్టయిపోయింది.