Begin typing your search above and press return to search.

తెలుగు పాటకు ఎంత కష్టం... ఎంత నష్టం...

By:  Tupaki Desk   |   30 Nov 2021 2:34 PM GMT
తెలుగు పాటకు ఎంత కష్టం... ఎంత నష్టం...
X
తెలుగు అందమైన భాష అని అందరూ చెప్పేవారే. అయితే గట్టిగా నాలుగు తెలుగు మాటలు మాట్లాడమంటే మాత్రం తడబాటూ నగుబాటూ తప్పని దారుణ కాలమిది. తెలుగు ఇంకా బతుకుతోందీ అంటే సినీ గీతాలలో, మీడియా రాతలలో మాత్రమే. అందులో కూడా అచ్చమైన తెలుగు, మెచ్చుకోలు తెలుగు వెతికి మరీ చూడాలీ అంటే చాలా కష్టమైన వ్యవహారం. ఈ రోజుల్లో తెలుగు సినిమా పాట పరిస్థితి ఏంటి అన్నది విడమరచి చెప్పనవసరం లేదు. పేరుకు తెలుగు పాటే కానీ అందులో తెలుగు పదాలే కరవు. ఇక మిగిలినవి వాయిద్యాల గోష్టిలో కనుమరుగు.

ఇలాంటి దుర్బలమైన పరిస్థితుల్లో ఉన్న సినీ తెలుగు పాటకు పట్టు బట్టలు కట్టి పూజించిన కవులలో చిట్ట చివరి వారు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి అని చెప్పకతప్పదు. వేటూరి సుందరామమూర్తి తరువాత చిత్ర సీమకు వచ్చిన సీతారామశాస్త్రి ఆయన కవితా వారసత్వాన్ని తుదివరకూ కొనసాగించారు. ఏ మచ్చా లేని అచ్చమైన తెలుగు పాటను తన కలం ద్వారా చిలుకరించి తెలుగు మదిని పలకరించి పరవశింపచేసిన ఘనత ఆయనదే.

సినిమా పాటకు కావ్య గౌరవం తెచ్చిన కవులు కొందరు మాత్రమే ఉన్నారు. వారిలో సీతారామశాస్త్రి కూడా ఒకరు అని గర్వంగా చెప్పాల్సిందే. ఒక కీలకమైన సన్నివేశానికి పాటను రాయడం అంటే కత్తి మీద సాము లాంటి వ్యవహారం. సాదా సీదా పాటలను ఎవరైనా రాసేస్తారు. మొత్తం సినిమానీ, దాని ఆత్మను అక్షర బద్ధం చేస్తూ పాటను రాసి చిరంజీవి చేయడం అంటే అంత సులభమైన పని కానే కాదు.

అయితే ఆ కృషిలో సీతారామశాస్త్రి ఎపుడూ సక్సెస్ అవుతూ వచ్చారు. అందుకే ఆయన చేత తమ సినిమాలో ఒక్క పాట అయినా రాయించాలన్న వారు ఈ రోజుకీ ఉన్నారు. ఆ రాసిన పాట కూడా సినిమాకు అయువుపట్టుగా ఉండేలా చేయడంలో శాస్త్రి గారిదే గొప్పతనం. కొత్త కవులు వస్తున్నారు. కాలం మారింది. అయినా కొన్నిగొప్ప సినిమాలు తీయాలంటే భయమేసే పరిస్థితి. ఎందుకంటే దానికి ప్రాణం పోయగల నటులే కాదు, సాంకేతిక నిపుణులు కూడా కరవు అవుతున్న పరిస్థితి కళ్ల ముందు ఉందిపుడు.

సీతారామశాస్త్రి లాంటి వారి అవసరం ఇండస్ట్రీకి చాలా ఉంది అని అంతా అనుకుంటున్న తరుణంలో ఆయన వచ్చిన పని అయిపోయింది ఇక చాలు అని ఆకాశమార్గాలను పట్టడం అంటే తెలుగు పాట చేసుకున్న ప్రారబ్దమనే చెప్పాలి. తెలుగు పదానికి జన్మదినం అని అన్నమయ్య పుట్టుకను వివరిస్తూ వేటూరి గీతం రాశారు. దానిని కాస్తా మారుస్తూ తెలుగు పాటకు దుర్దినం ఈ రోజు అనిపించేలా సీతారామశాస్త్రి మహా ప్రస్థానం ఉందని తెలుగు గీతాభిమానులు అంతా బాధాతప్త హృదయంతో అంటున్న విషాద సందర్భం ఇది. కాలాలు మారినా లోకాలు మారినా మారనిది, చెరగనిది సాహిత్యం. అలాంటి సంపదను నిండా పంచేసి సిరి వెన్నెల‌లను చిలకరిస్తూ సీతారామశాస్త్రి చివరి మజిలీ ముగించారు. ఇక ఆయన గీతాలే అందరినీ ఓదార్చాలి మరి.