Begin typing your search above and press return to search.

సిరివెన్నెల అర్థరాత్రి ఉదయించే సూర్యుడు..!

By:  Tupaki Desk   |   30 Nov 2021 2:30 PM GMT
సిరివెన్నెల అర్థరాత్రి ఉదయించే సూర్యుడు..!
X
తెలుగు సినీ అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి.. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న సిరివెన్నెల లేరనే వార్తను అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సీతారామశాస్త్రి మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయ రచయిత మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. సిరివెన్నెల తిరిగిరాని లోకాలకు వెళ్ళడంపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి వ్యక్తిగత జీవితం - పాటల ప్రయాణం గురించి చర్చ నడుస్తున్న తరుణంలో.. ఆయన ప్రజ్ఞ, పాటవాల గురించి దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రపంచమంతా పడుకున్నాక లేస్తాడని.. ఆయన అర్థరాత్రి ఉదయించే సూర్యుడని.. తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి అని.. తెలుగు సినీ కవి కావటం ఆయన దురదృష్టమని.. తెలుగు వారి అదృష్టమని త్రివిక్రమ్ తనదైన శైలిలో చెప్పారు.

''సీతారామశాస్త్రి కవిత్వం గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు. నాకున్న పదాలు సరిపోవు. ఎందుకంటే 'సిరివెన్నెల' సినిమాలో రాసిన 'ప్రాగ్దిశ వేణియపైన, దినకరమయూఖ తంత్రులపైన' ఆ పాట విన్న వెంటనే తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంటుందని నాకు తెలిసింది. దాన్ని 'శబ్ద రత్నాకరం' అంటారని తెలుసుకున్నా. అది కొనుక్కొని తెచ్చుకుని, ప్రాగ్దిశ - మయూఖం అంటే ఏంటనే విషయాలు తెలుసుకున్నా. ఒక పాటను అర్థమయ్యేలానే రాయాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవాలి అని కోరిక పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచిన వ్యక్తి సీతారామశాస్త్రి'' అని త్రివిక్రమ్ అన్నారు.

''ఆడియన్స్ ఇవే చూస్తున్నారు.. ఇవే రాయాలి అని కాకుండా.. వాళ్లకు అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది.. అలాంటి పదాలతో పాటలు రాసే కవి ఆయన. 'తరలిరాదా తనే వసంతం.. తన దరికిరాని వనాల కోసం' లాంటి పాట రాయడానికి, దాన్ని సినిమాలో పెట్టించడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అందుకే ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నాను. 'బలపం పట్టి భామ బల్లో' వంటి డ్యూయెట్ లో కొమ్మల్లో కుకూలు.. కొండల్లో ఎకోలు' వంటి పొయెట్రీని రాశారు. అక్కడ స్పేస్ లేదు.. ఆయన స్పేస్ క్రియేట్ చేసి తీసుకున్నాడు. ఆయన వాడుకున్నాడు. కమర్షియల్ సినిమా అంటే దిగజారుడు సాహిత్యం.. అర్థం పర్థం లేని శబ్దాలతో కూడిన పాటలని కాకుండా.. వాటి ఇరుకు సందుల్లో కూడా మంచి పాటలు ఇచ్చారు''

''గొప్ప పాటలు రాయడానికి ఆయన రాత్రిళ్లు ఖర్చు చేసిన క్షణాలు.. ఆయన వదులుకున్న కుటుంబం.. ప్రపంచమంతా పడుకున్నాక ఆయన లేస్తాడు. ఆయన అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు.. పదాలు అనే కిరణాలు తీసుకుని.. అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడటానికి బయలుదేరతాడు. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నలను సంధిస్తాడు. ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దని అంటాడు. ఒక మనిషిని కదిలించే శక్తి సాహిత్యానికి అక్షరానికి మాత్రమే ఉంటుంది. ఆయన తెలుగు సినిమా కవి అవడం వల్ల ఇక్కడే మిగిలిపోయాడు అనే బాధ నాకుంది. తెలుగు సినిమా పాటలు రాయడం ఆయన దురదృష్టం.. మన అదృష్టం'' అని త్రివిక్రమ్ ఆవేశంగా మాట్లాడారు.

ఇకపోతే సిరివెన్నెల సీతారామశాస్త్రి కి త్రివిక్రమ్ శ్రీనివాస్‌ చాలా దగ్గరి బంధువనే విషయం చాలా మందికి తెలియదు. సిరివెన్నెలకు త్రివిక్రమ్ అల్లుడి వరుస అవుతారు. ఆయన సోదరుడి కుమార్తె సౌజన్యను త్రివిక్రమ్ వివాహం చేసుకుని.. చేంబోలు వారి ఇంటి అల్లుడయ్యాడు. ఈ క్రమంలో వీరి మధ్య బంధం మరింత బలపడింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమాలలో పాటలకు కూడా సిరివెన్నెల సాహిత్యం అందించిన సంగతి తెలిసిందే.