Begin typing your search above and press return to search.

నందివర్ధనాలు ఎన్నో పూయించినా....

By:  Tupaki Desk   |   30 Nov 2021 4:25 PM GMT
నందివర్ధనాలు ఎన్నో పూయించినా....
X
పాట ఆయనకు వ్యాపకం. పాట ఆయనకు జీవన గమనం. ఆయన పాటసారి. ఆయన నడిచే మార్గంలో ఎన్నో నంది వర్ధనాలను అలా పూయించుకుంటూ పోయారు. వారి పరిమళాలను తోవన నడిచే వారందరికీ పంచిపెట్టారు. అధికారికంగా తొలి సినిమా అయిన సిరివెన్నెలతోనే నంది అవార్డు పొందిన ప్రతిభాశాలి సీతారామశాస్త్రి. అది లగాయితూ ప్రతీ ఏడాది ఆయన ఇంటికి అలా నంది నడచి వచ్చేసేది. ఒక దశలో ఉత్తమ పాటల రచయిత కేటగిరీలో ఆయన తప్ప మరెవరూ కనిపించని అరుదైన సన్నివేశాలు ఎన్నో.

ఒకటి రెండు కాదు, ఏకంగా పదకొండు నంది అవార్డులను తాను రాసిన పాటలను గెలుచుకున్న గొప్ప గీత రచయిత సీతారామశాస్త్రి. ఇక ఆయన వెలకట్టలేని పాటలను ఎన్నో రాశారు. ఇంట ఎన్ని గెలిస్తేనేమి బయట మాత్రం తెలుగు వారంటే చిన్న చూపే. అదే సీతారామశాస్త్రి లాంటి వారికీ శాపమైంది అనుకోవాలి. లేకపోతే ఆయన రాసిన మూడు వేల పాటలలో ఏ ఒక్కటి అయినా జాతీయ మర్యాద పొందేందుకు అర్హత సాధించి పెట్టలేదా అన్న సందేహం సాహితీకారులకు కలిగి తీరుతుంది.

అంత దాకా ఎందుకు రుద్ర వీణలో ఆయన రాసిన ప్రతీ పాటా ఆణిముత్యమే. అందులో దేనికైనా జాతీయ పురస్కారం వచ్చినట్లు అయితే సంతోషించేది ఆయన మాత్రమే కాదు, యావత్తు తెలుగు జాతి, తెలుగు సినీ అభిమానులు. తెలుగు భాషాభిమానులు. మరి ఎందుకో కానీ ఒక్కటంటే ఒక్క జాతీయ అవార్డు కూడా ఆయనకు దక్కకపోవడం అభిమానులకే ఎక్కువ బాధగా ఉండేది ఎపుడూ.

సీతారామశాస్త్రి ఇలాంటి విషయాల్లో ఎపుడూ పట్టనట్లుగానే ఉండేవారు. ఆయన పాటల మేస్తీగా తన పని తాను చేసుకుంటూ పోయేవారు. నందులు ఎన్ని వచ్చాయన్న లెక్క అభిమానులకు తప్ప అయనకు పట్టని వ్యవహారం. అయితే అద్భుతమైన తెలుగు కవికి సముచితమైన గౌరవం దక్కలేదే అన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది. సీతారామశాస్త్రి ఏ రోజుకి అయినా తన గీతానికి జాతీయ అవార్డు సాధిస్తారు అన్న ఆశలు అలా ఉండగానే అర్ధాంతరంగా తనువు చాలించేశారు.

ఇక ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.అందుకు సంతోషమే కానీ అది కూడా చాలా ఆలస్యంగా వచ్చింది అన్న వారూ ఉన్నారు. నిజానికి పద్మ భూషణ్ స్థాయి ప్రతిభ ఆయనది అన్న వాదన కూడా ఉంది. ఏది ఏమైనా అవార్డులు ప్రతిభకు ఎపుడూ కొలమానాలు కావు. ఆ మాటకు వస్తే అన్నమయ్య లాంటి వారి సాహితీ చాతుర్యాన్ని కొలిచే సాధనాలు, ప్రమాణాలు ఎక్కడైనా ఉన్నాయా. అలా అన్నమయ్య తానే ఆవహించాడా అన్నట్లుగా శృతిలయలు లో సీతారామశాస్త్రి రాసిన తెలవారదేమో స్వామీ పాట ఒక్కటి చాలు. ఆయనకు వేల వేల అవార్డుల సరిసాటి అని చెప్పడానికి.