Begin typing your search above and press return to search.

సిరివెన్నెల జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన

By:  Tupaki Desk   |   2 Oct 2016 5:30 PM GMT
సిరివెన్నెల జీవితంలో ఓ ఆసక్తికర సంఘటన
X
ఇవాళ మహాత్ముడి జయంతి. గాంధీ పేరు చెప్పగానే సత్యం.. అహింస అనే మాటలే గుర్తుకొస్తాయి. ఈ సందర్భంగా గాంధీని ఎంతో అభిమానించే సిరివెన్నెల సీతారామశాస్త్రి తన కుటుంబంపై గాంధీ ప్రభావం ఎంత ఉందో.. తన తండ్రి.. తాను గాంధీని ఎంతగా అనుసరించేవాళ్లమో చెబుతూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆయనేమన్నారంటే..

‘‘మా నాన్న గారికి గాంధీజీ అంటే విపరీతమైన ఇష్టం. ఆయనకు అబద్ధం చెబితే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఐతే తప్పు చేశాక తల దించుకొని తప్పు చేశానని నిజం చెబితే వెంటనే క్షమించేసేవారు. దీంతో అబద్ధం చెప్పడం కన్నా.. నిజం చెప్పి తలెత్తుకుని నిలబడడమే బాగుందనిపించింది. ఐతే మా స్కూల్‌ లో ఒక ఉపాధ్యాయుడు సినిమాలు బాగా చూసేవాడు. నాకు బాగా మార్కులొచ్చేవి. దీంతో ఒకసారి నేను ఆయన వెంటపడి తన వెంట సినిమాకు వెళ్లే అవకాశం దక్కించుకున్నా. ఐతే ఆ రోజు బంధువులు రావడం మా నాన్న నాకంటే ముందు ఇంటికొచ్చారు. ఎక్కడికెళ్లావని అడిగితే మాస్టారితో సినిమాకు వెళ్లానని నిజం చెప్పా. కానీ నేను అబద్ధం చెబుతున్నాననుకుని లెంపకాయ కొట్టారు. నా జీవితంలో మా నాన్న గారు నన్ను కొట్టింది ఆ ఒక్కసారే. మరుసటి రోజు ఆదివారం. అయినప్పటికీ సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగి మాస్టారిని వెతికి పట్టుకున్నారు. ఆయన్ని అడిగితే నేను చెప్పింది నిజమే అని తేలింది. ఇంటికొచ్చాక అంత పెద్దవారైనప్పటికీ మా నాన్న నాకు ‘సారీ’ చెప్పారు’’ అంటూ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు సిరివెన్నెల.