Begin typing your search above and press return to search.

అనారోగ్యాన్ని భరిస్తూ పైకి నవ్వేసిన సిరివెన్నెల!

By:  Tupaki Desk   |   10 Dec 2021 3:30 AM GMT
అనారోగ్యాన్ని భరిస్తూ పైకి నవ్వేసిన సిరివెన్నెల!
X
తెలుగు సినిమా పరిశ్రమలో సిరివెన్నెల సీతారామశాస్త్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది .. ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందుకు కారణం ఆయన వ్యక్తిత్వం .. ఆయన అందించిన సాహిత్యం. కథావస్తువు సాహిత్యానికి సంబంధించినదైతే, కాస్త లోతైన సాహిత్యంతోనే ఆయన పాటలు రాసేవారు. అలాగే తేలికైన పదాలతోను ప్రయోగాలు చేశారు. ఇక ఆధ్యాత్మికానికి సంబంధించిన పాటలు మొదలుపెట్టినప్పుడు ఆయన కలాన్ని ఆపడం కష్టం. అలా తెలుగు సినిమా పాటను అన్ని వైపుల నుంచి అల్లుకున్న సాహిత్య పరిమళం ఆయన.

అలాంటి సిరివెన్నెలను 'పరుచూరి పలుకులు' కార్యక్రమం ద్వారా పరుచూరి గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. "సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండేవారు. మీరు గమనిస్తే ఆయన నవ్వుకుండా ఉన్న ఫొటో ఎక్కడా కూడా దొరకదు. ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. అందుకే నేను ఆయనను 'చిరునవ్వుల సీతారామశాస్త్రి' అంటే అప్పుడు కూడా పకపకా నవ్వేవారు. 6 సంవత్సరాలుగా ఒక అనారోగ్యాన్ని అనుభవిస్తూ, అనారోగ్యంతో పోరాడుతూ కూడా పెదవులపై చిరునవ్వును వెళ్లనివ్వకుండా చేసిన మహానుభావుడు ఆయన.

మేము ఇండస్ట్రీకి వచ్చిన ఆరేడు ఏళ్లకు ఆయన ఇండస్త్రీకి వచ్చారు. 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలూ ఆయానే రాశారు. ఆ సినిమాలో ఆయన విధాత గురించి ఒక పాట రాశారు .. ఆ విధాత అన్యాయం చేసి ఆయనకు 65 ఏళ్లు నిండగానే తీసుకుని పోయాడు. నిజంగా ఇది చాలా చాలా దుఃఖకరమైన విషయం. ఆయన 3వేల పాటలే రాశారు. నిజానికి ఆయనకి ఉన్న ప్రతిభకు .. ఆయనకున్న ఇమేజ్ కి 10 వేల పాటలవరకూ రాయవచ్చు .. కానీ రాసేవారు కాదు. సన్నివేశం నచ్చకపోయినా, దర్శకుడు చెప్పేతీరు నచ్చకపోయినా రాసేవారు కాదు.

లేదంటే నాకు తెలిసి వేటూరి గారిలా ఆయన కొన్ని వేల పాటలు రాసేవారు. వేటూరి గారి తరువాత పాటల పరిస్థితి ఏమిటనే పరిస్థితుల్లో నేను ఉన్నానని సిరివెన్నెల వచ్చారు. అలాంటి సిరివెన్నెల ఇక లేరు అంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. మా సిరివెన్నెలను ఎందుకు తీసుకుని వెళ్లిపోయావు అని నాకు ఆ భగవంతుడిని నిగ్గదీసి అడగాలని ఉంది. ఆయన వ్యక్తిత్వంలో సూర్యుడు .. రచనల్లో చంద్రుడు. ఎప్పుడు చూసినా పాట .. పాట .. అదే ఆయన శ్వాస .. అదే ఆయన జీవనాడి .. అదే ఆయన జీవన వేదం. నిరంతరం పాట గురించే తపించేవారు. కన్ను మూసేవరకూ ఆయన కలం కదులుతూనే ఉంది. అలాంటి ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.