Begin typing your search above and press return to search.

సిట్ టెస్టుల‌కు పూరీ దొరుకుతారా?

By:  Tupaki Desk   |   20 July 2017 5:38 AM GMT
సిట్ టెస్టుల‌కు పూరీ దొరుకుతారా?
X
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డ కెల్విన్ బ్యాచ్‌ - అత‌డి సెల్ ఫోన్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ప్ర‌ముఖులు, ప్ర‌త్యేకించి టాలీవుడ్‌ కు చెందిన ప్ర‌ముఖులు - హీరోలు - హీరోయిన్ల పేర్లు కూడా బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ వ్య‌వ‌హారానికి ఎక్క‌డ లేని ప్రాధాన్యం వ‌చ్చేసింది. పేర్ల‌తో స‌రిపెట్ట‌ని తెలంగాణ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌ర్ అకున్ స‌బర్వాల్ నిన్న విచార‌ణ ప‌ర్వానికి కూడా తెర తీశారు. ఫ‌స్ట్ రోజే టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ను విచార‌ణ‌కు పిలిచిన అకున్‌... ఈ వ్య‌వ‌హారంపై మ‌రింత చ‌ర్చ జ‌రిగేలా చేశార‌నే చెప్పారు.

ఇక విచార‌ణ విష‌యానికి వ‌స్తే... మ‌ధ్యాహ్నం కాస్తంత లంచ్ బ్రేక్ ఇచ్చిన సిట్ అధికారులు పూరీని ఏకంగా 11 గంట‌ల పాటు విచారించారు. ఈ విచార‌ణ‌లో పూరీకి వంద‌ల ప్ర‌శ్న‌లు ఎదురైన‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. విచార‌ణ ముగిసిన త‌ర్వాత ఎందుకైనా మంచిద‌న్న భావ‌న‌తో బ్ల‌డ్ శాంపిల్స్ వెళ్లాల‌ని పూరీని పోలీసులు కోరారు. అందుకు పెద్ద‌గా వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌ని జ‌గ‌న్నాథ్... త‌న ర‌క్త న‌మూనాల‌ను ఇచ్చిన త‌ర్వాతే అక్క‌డి నుంచి క‌దిలారు. బ్ల‌డ్ టెస్టుల ద్వారా డ్ర‌గ్స్ వాడుతున్న‌తీరు ప‌క్కాగా తేలిపోతుంద‌న్న విష‌యం ఇప్ప‌టిదాకా ప్ర‌చారంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఒక‌వేళ పూరీ గ‌నుక డ్ర‌గ్స్ వాడి ఉంటే... ప‌క్కాగా దొరికిపోతార‌న్న వాద‌న బ‌లంగా వినిపించింది. ఈ విష‌యంపై ప‌లు కోణాల్లో ప‌రిశీల‌న చేసిన నిపుణులు ఆస‌క్తికర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

కేవ‌లం బ్ల‌డ్ టెస్టుల ద్వారా డ్ర‌గ్స్ వాడ‌కాన్ని నిర్ధారించ‌లేమ‌న్న ఆ విష‌యాలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. డ్ర‌గ్స్ కేసును ఇంత ప‌క‌డ్బందీగా ప‌ర్య‌వేక్షిస్తున్న అకున్‌ కు ఈ విష‌యం తెలియ‌దా? అన్న కోణంలో ఇప్పుడు చ‌ర్చ‌కు తెర‌లేసింద‌నే చెప్పాలి. నిపుణులు చెబుతున్న దాని ప్ర‌కారం కేవ‌లం బ్ల‌డ్ శాంపిల్స్ మాత్ర‌మే ఇచ్చి వ‌చ్చిన పూరీ జ‌గ‌న్నాథ్ సేఫ్ సైడ్‌ లోనే ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా... మ‌రి డ్ర‌గ్స్ వాడిన వారిని ప‌క్కాగా నిర్ధారించే వెసులుబాటు మ‌న‌కు అందుబాటులో ఉందా? అన్న విష‌యాల‌ను ప‌రిశీలిస్తే... ఇంకొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి.

కేవ‌లం బ్ల‌డ్ టెస్టుల ద్వారానే డ్ర‌గ్స్ వాడ‌కాన్ని నిర్ధారించ‌లేమ‌ని... స్వ‌యంగా ఫోరెన్సిక్ నిపుణులు కేంద్ర ప్ర‌భుత ఆధ్వ‌ర్యంలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌ సీబీ)కి స్పష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో డ్ర‌గ్స్ వాడ‌కాన్ని ప‌క్కాగా నిర్ధారించే ఇత‌ర టెస్టులు చాలానే ఉన్నాయ‌ని, బ్ల‌డ్ టెస్టుల‌తో పాటు త‌ల వెంట్రుక‌లు - శ‌రీరంపై రోమాల‌ను తీసుకుని పరిశీలిస్తే... డ్ర‌గ్స్ వాడే వారు ఇట్టే దొరికిపోతార‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ టెస్టులు - వాటి ద్వారా ఏ మేర ఫ‌లితాలు సాధ్య‌మ‌న్న విష‌యానికి వ‌స్తే...

- వ్యక్తి తీసుకున్న డ్రగ్‌ ను బట్టి ఎన్ని రోజుల క్రితం దానిని తీసుకున్నారో పక్కాగా చెప్పే అవ‌కాశం ఉంద‌ని కేంద్ర ఫోరెన్సిక్‌ విభాగం సైంటిస్టులు తెలిపారు.

- గంజాయి తీసుకుంటే... యూరిన్ టెస్టుల ద్వారా వారం నుంచి నెల వరకు మాత్రమే ఆధారాలు లభిస్తాయి. అదే తల వెంట్రుకలు పరీక్షిస్తే 90 రోజుల వరకు ఆధారాలు సేకరించవచ్చు. రక్త పరీక్ష ద్వారా అయితే 2 వారాల వరకు మాత్రమే ఆధారాలు సేకరించే అవకాశం ఉంది.

- కొకైన్‌ తీసుకుంటే.. 3–4 రోజుల్లో మూత్ర పరీక్ష ద్వారా, 90 రోజుల వరకు తల వెంట్రుకల ద్వారా డ్రగ్‌ ఆనవాళ్లు దొరుకుతాయి. అదే శరీరంపై రోమాల ద్వారా 250 రోజుల వరకు నమూనాలు సేకరించి డ్రగ్‌ ఆనవాళ్లు గుర్తించవచ్చు.

- జనరిక్‌ డ్రగ్స్‌.. ఇది కేవలం 12 గంటలు మాత్రమే రక్తంలో ఉంటుంది. మూత్రంలో ఒక రోజు ఉండగా, వెంట్రుకల్లో 3 నెలల వరకు ఉంటుంది.

- హెరాయిన్‌ తీసుకుంటే... మూడు నుంచి నాలుగు రోజుల పాటు మూత్రంలో ఆనవాళ్లు గుర్తించవచ్చు. 12 గంటల్లో బ్లడ్‌ శాంపిల్స్‌ లో దొరికిపోతుంది. తల వెంట్రుకల్లో 100 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది.

- ఎల్‌ ఎస్‌ డీ - ఎండీఎంఏ డ్రగ్‌..: వెంట్రుకల పరీక్ష ద్వారా 90 రోజుల నుంచి 250 రోజుల వరకు డ్రగ్స్‌ ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుంది.