Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సీతారామం

By:  Tupaki Desk   |   5 Aug 2022 12:32 PM GMT
మూవీ రివ్యూ : సీతారామం
X
చిత్రం : సీతారామం

న‌టీన‌టులు: దుల్క‌ర్ స‌ల్మాన్-మృణాల్ ఠాకూర్-ర‌ష్మిక మంద‌న్న‌-సుమంత్-భూమిక‌- త‌రుణ్ భాస్క‌ర్-వెన్నెల కిషోర్-గౌత‌మ్ మేన‌న్ త‌దిత‌రులు
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
ఛాయాగ్ర‌హ‌ణం: పీఎస్ వినోద్-శ్రేయ‌స్ కృష్ణ‌
నిర్మాత‌లు: స్వ‌ప్న ద‌త్-ప్రియాంక ద‌త్
ర‌చ‌న‌-దర్శ‌క‌త్వం: హ‌ను రాఘ‌వ‌పూడి

అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రాల‌తో త‌న అభిరుచిని చాటిన ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి.. ఆ త‌ర్వాత తీసిన లై.. ప‌డి ప‌డి లేచె మ‌న‌సు సినిమాల‌తో తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. ఐతే అత‌డి కొత్త సినిమా సీతారామం చ‌క్క‌టి ప్రోమోల‌తో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు రేకెత్తించింది. మ‌రి హ‌ను ఈ సినిమాతో హ‌ను మ‌ళ్లీ ఫాం అందుకున్నాడా.. త‌న అభిరుచిని చాటాడా.. తెలుసుకుందాం ప‌దండి.

క‌థ:

60వ ద‌శ‌కంలో సైన్యంలో లెఫ్టినెంట్ హోదాలో ప‌ని చేసే రామ్ (దుల్క‌ర్ స‌ల్మాన్) దేశం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డే ర‌కం. ఐతే అత‌నో అనాథ. క‌శ్మీర్లో ఒక మార‌ణ హోమం జ‌ర‌గ‌కుండా ఆప‌డంలో కీల‌క పాత్ర పోషించిన రామ్ గురించి ఒక రేడియో కార్య‌క్ర‌మం ద్వారా అంద‌రికీ తెలుస్తుంది. అత‌ను అనాథ కాదంటూ.. త‌న‌కు మేం ఉన్నామంటూ దేశం న‌లుమూల‌ల నుంచి బంధుత్వాలు క‌లుపుతూ ఎంతోమంది అత‌డికి లేఖలు రాస్తారు. ఈ క్ర‌మంలోనే సీతామ‌హాల‌క్ష్మి పేరుతో ఓ అమ్మాయి నేను నీ భార్య‌నంటూ చిరునామాలేకుండా రామ్ కు లేఖ‌లు రాస్తుంది. అవి చూసి ముగ్ధుడైపోయిన రామ్.. త‌నెవ‌రో తెలుసుకోవ‌డానికి ప్ర‌యాణం ఆరంభిస్తాడు. ఈ క్ర‌మంలో అత‌ను సీత‌ను క‌లిశాడా.. ఇంత‌కీ సీత నేప‌థ్యం ఏంటి.. వీరి ప్రేమ‌క‌థ ఎలాంటి మ‌లుపులు తిరిగింది అన్న‌ది తెర‌పైనే చూడాలి.

క‌థ‌నం-విశ్లేష‌ణ:

ఒక సినిమా విడుద‌ల‌య్యే ముందు ప్ర‌మోష‌న్ల‌లో చిత్ర బృందంలోని ముఖ్యులు దీన్ని మించిన సినిమా లేదు.. ఇదొక అద్భుతం.. ఈ సినిమా చూస్తూ మిమ్మ‌ల్ని మీరు మ‌రిచిపోతారు.. ఇలా ఎన్నెన్నో మాట‌లు చెబుతారు. కానీ ఇలాంటి మాట‌లు చాలావ‌ర‌కు నీటి మీద రాత‌ల్లాగే అయిపోతుంటాయి. మాట‌ల‌కు.. తెర‌పై చూసేదానికి అస‌లు పొంత‌న ఉండదు. ఐతే చాలా కాలం త‌ర్వాత సీతారామం సినిమా విష‌యంలో ఇలాంటి మాట‌ల‌న్నీ వాస్త‌వ‌రూపం దాల్చాయి. ద‌ర్శ‌కుడు హ‌ను స‌హా చిత్ర బృందంలోని వాళ్లంతా చెప్పిన మాట‌ల‌న్నీ అక్ష‌ర స‌త్యాల‌య్యాయి. హ‌ను అన్న‌ట్లు నిజంగానే ఈ సినిమాచూస్తూ మ‌నం ప్ర‌పంచాన్ని మ‌రిచిపోతాం. తెర‌కు అతుక్కుపోతాం. మ‌ళ్లీ మ‌ళ్లీ చూసి ఈ సినిమాను ఆస్వాదించాల‌నుకుంటాం. దుల్క‌ర్ చెప్పిన‌ట్లు ఇలాంటి క‌థ ఇంత‌కుముందెక్క‌డా రాలేదు అన్న మాటలోనూ అతిశ‌యోక్తి లేదు. క‌థ అంత కొత్త‌గా అనిపిస్తూ.. త‌ర్వాత ఏం జ‌రుగుతుందా అన్న ఉత్కంఠ ఆద్యంతం రేకెత్తిస్తూ.. ప్ర‌తి స‌న్నివేశం ముగ్ధ మ‌నోహ‌రంగా అనిపిస్తూ.. ప్రేక్ష‌కుల‌కు ఒక గొప్ప అనుభూతిని క‌లిగిస్తుంది సీతారామం. నిస్సందేహంగా తెలుగులో వ‌చ్చిన అత్యుత్త‌మ ప్రేమ‌క‌థా చిత్రాల్లో దీనికి స్థానం ఉంటుంది.

చూడ‌గానే ముచ్చ‌టేసే అంద‌మైన ప్రేమ జంట‌.. ప్ర‌తి స‌న్నివేశంలో జీవం తొణిక‌స‌లాడేలా ఉండే వారి హావ‌భావాలు.. భావుక‌త నిండిన స‌న్నివేశాలు.. మాట‌లు.. దృశ్యాలు.. ఆహ్లాద‌క‌ర‌మైన సంగీతం.. క‌నువిందు చేసే ఛాయాగ్ర‌హ‌ణం.. ప్ర‌తి స‌న్నివేశంలోనూ త‌న అభిరుచిని-త‌ప‌న‌ను చాటే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌.. ఒక ప్రేమ‌క‌థ పండ‌డానికి ఇంత‌కంటే ఏం కావాలి? ఎంచ‌డానికి ఒక్క లోపం కూడా లేకుండా ఇలాంటి ఓ ప్రేమ‌క‌థను తెలుగు తెర‌పై చూసి ఎన్నేళ్ల‌యిందో? చ‌క్క‌టి అభిరుచి ఉన్న ద‌ర్శ‌కుడిగా పేరున్న‌ప్ప‌టికీ.. సినిమాను స‌గంలో చెడ‌గొట్టేస్తాడ‌ని.. ఒక క‌థ‌ను పూర్తిగా మెప్పించేలా చెప్ప‌లేడ‌ని నెగెటివ్ ముద్ర వేయించుకున్న హ‌ను రాఘ‌వ‌పూడి.. ఈసారి త‌న బ‌ల‌హీన‌త‌ల‌న్నీ అధిగ‌మించాడు. ఏ ద‌శ‌లోనూ ప్రేక్ష‌కుడు అంచ‌నా వేయ‌లేని స‌రికొత్త క‌థ‌ను రాసుకుని.. దానికి మంచి డ్రామాతో ముడిప‌డ్డ క‌థ‌నాన్ని జోడించి.. ఆరంభం నుంచి చివ‌రి దాకా ప్రేక్ష‌కుడు తెర‌కు అతుక్కుపోయేలా చేశాడు హ‌ను.

సీతారామం చూశాక కొంత‌మంది సినిమా స్లో అని.. లెంగ్త్ ఎక్కువైంద‌ని అంటే అనొచ్చు. కానీ ఈ క‌థ‌కు క‌నెక్ట్ అయితే.. పాత్ర‌ల‌తో ప్ర‌యాణం చేస్తే అది పెద్ద స‌మ‌స్యే కాదు. మంచి ఫీల్.. ఎమోష‌న్ ఉన్న‌పుడు క‌థ‌నం కొంచెం నెమ్మ‌దిగా సాగినా అది పెద్ద స‌మ‌స్య కాదు. నాలుగు ముక్క‌ల్లో ఈ క‌థ చెప్ప‌మంటే చాలా క‌ష్టం అనిపించే స్థాయిలో సీతారామంలో విష‌యం ఉంది. అనేక మ‌లుపుల‌తో సాగే క‌థే ఈ సినిమాకు అతి పెద్ద బ‌లం. దానికి అంతే ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం కూడా తోడైంది. అనాథ అయిన హీరో గురించి తెలిసి నేను నీ భార్య‌ను అంటూ ఓ అమ్మాయి ఉత్త‌రం రాయ‌డం.. దాన్ని ప‌ట్టుకుని హీరో ఆమెను చేరుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం.. ఈ లైన్ విన‌డానికి ఏదోలా అనిపించ‌వ‌చ్చు. ఇలాంటి పాత్ర‌ల మ‌ధ్య కెమిస్ట్రీ ఏం పండుతుంది.. వారి ప్రేమ‌ను మ‌నం ఎలా ఫీల‌వుతాం అనే సందేహం క‌ల‌గొచ్చు. కానీ ఈ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థ‌ను ఎంతో అందంగా.. హృద్యంగా హ‌ను తీర్చిదిద్దిన విధానానికి ఫిదా అవ్వ‌కుండా ఉండ‌లేం. సినిమాలో ఏ స‌న్నివేశం కూడా రొటీన్ అన్న ఫీలింగ్ క‌ల‌గదు. ఏ స‌న్నివేశాన్నీ మ‌నం ఊహించ‌లేం. అలా అని అత‌నేమీ ఎప్ప‌డూ చూడ‌నిది చూపించాడ‌ని కాదు. నిజంగా దృశ్య కావ్యం చూస్తున్న ఫీలింగ్ క‌లిగేలా హీరో హీరోయిన్ల‌తో ముడిప‌డ్డ స‌న్నివేశాల‌ను పొయెటిగ్గా ప్రెజెంట్ చేసిన తీరు క‌ట్టి ప‌డేస్తుంది. దుల్క‌ర్ స‌ల్మాన్-మృణాల్ ఠాకూర్ ల రూపంలో అంద‌మైన జంట‌.. వారి చ‌క్క‌టి హావ‌భావాలు కూడా తోడ‌వ‌డంతో వారి మ‌ధ్య ప్ర‌తి మూమెంట్ కూడా చూడ‌ముచ్చ‌ట‌గా అనిపిస్తుంది. ముద్దులు.. కౌగిలింత‌లు లాంటివేమీ లేకుండా కెమిస్ట్రీ పండించ‌డం అంటే ఏంటో ఈ సినిమా చూస్తేనే అర్థ‌మ‌వుతుంది.

సీతారామంలో ఉన్న ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఇందులో ప్రేమ‌క‌థ ఎంత ఆక‌ట్టుకుంటుందో.. సైన్యంతో ముడిప‌డ్డ ఎపిసోడ్లు కూడా అంతే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ఆ నేప‌థ్యానికి.. ప్రేమ‌క‌థ‌కు ముడిపెట్టిన తీరులో హ‌ను క‌థ‌కుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటిచెప్పాడు. క‌శ్మీర్.. టెర్ర‌రిజం.. దౌత్య సంబంధాలు లాంటి సున్నిత‌మైన అంశాల‌ను ఎంతో ప‌రిణ‌తితో ఎవ‌రి మ‌నోభావాలూ దెబ్బ తిన‌కుండా.. చ‌క్క‌గా డీల్ చేశాడు హ‌ను. ఉగ్ర‌వాదుల‌పై హీరో బృందం దాడి అనంత‌ర ప‌రిణామాలు చాలా హృద్యంగా అనిపిస్తాయి. అందులో డ్రామా చాలా బాగా ర‌క్తి క‌ట్టింది. ఈ క‌థ‌కు ఇచ్చిన ముగింపు కూడా గొప్ప‌గా అనిపిస్తుంది. ఆరంభంలో కొంచెం నెమ్మ‌దిగా మొద‌లైన‌ప్ప‌టికీ.. హీరో ప‌రిచ‌యం ద‌గ్గ‌ర్నుంచి తాజాగా అనిపించే.. ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ స‌న్నివేశాల‌తో ప్ర‌థ‌మార్ధంలో ప‌రుగులు పెట్టే సీతారామం.. రెండో అర్ధంలో క‌థ‌లో సీరియ‌స్నెస్ రావ‌డం వ‌ల్ల మ‌ళ్లీ నెమ్మ‌దిస్తుంది. కానీ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మాత్రం ఎక్కడా స‌న్న‌గిల్ల‌నివ్వ‌దు. చివ‌రి వ‌ర‌కు ఎక్క‌డా ఫీల్ అయితే చెడ‌దు. ఒక గొప్ప ప్రేమ‌క‌థ చూసిన భావ‌న‌తోనే ప్రేక్ష‌కులు బ‌య‌టికి వ‌స్తారు. ఇలా ఎంచ‌డానికి లోపాలు క‌నిపించ‌ని ఉత్త‌మ ప్రేమ‌క‌థ‌లు అరుదు.

న‌టీన‌టులు:

హ‌ను ఏరికోరి ఈ క‌థ‌కు దుల్క‌ర్ స‌ల్మాన్ నే ఎందుకుఎంచుకున్నాడో సినిమా చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. మ‌న ద‌గ్గ‌ర నాని లాంటి హీరోలు ఈ క‌థ‌కు బాగానే సూట‌వుతారు. కానీ దుల్క‌ర్ లో వాళ్ల‌ను మించి ఇంకేదో మ్యాజిక్ ఉంది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తుంటే. అత‌నొక ప‌ర‌భాషా న‌టుడు అనే ఫీలింగే ఏ ద‌శ‌లోనూ రాదు. అంత ల‌వ‌బుల్ గా అనిపిస్తూ ప్ర‌తి స‌న్నివేశంలోనూ మ‌న‌సు దోచేస్తాడు. ఇంత స‌హ‌జంగా.. అందంగా న‌టించే న‌టులు అరుదుగా ఉంటారు. మృణాల్ ఠాకూర్ గురించి కూడా ఎంత చెప్పినా త‌క్కువే. ఈ క‌థ‌కు త‌గ్గ‌ట్లు వావ్ అనిపించే అందంతో.. హావ‌భావాల‌తో సీతామ‌హాల‌క్ష్మి పాత్ర‌లో ఒదిగిపోయింది త‌ను. కొన్ని స‌న్నివేశాల్లో ఆమెను చూస్తూ క‌న్నార్పలేం. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మృణాల్ ప్ర‌తిభ క‌నిపిస్తుంది. రామ్ మీద త‌న ప్రేమ‌ను క‌ళ్ల‌తో ప‌లికించిన తీరు వారెవా అనిపిస్తుంది. ర‌ష్మిక కూడా బాగా చేసింది. త‌న పాత్ర కొంత వ‌ర‌కు మ‌హాన‌టిలో స‌మంత‌ను గుర్తుకు తెస్తుంది. సుమంత చాన్నాళ్ల త‌ర్వాత మంచి పాత్ర చేశాడు. అందులో రాణించాడు. స‌చిన్ ఖేద్క‌ర్.. ప్ర‌కాష్ రాజ్.. గౌత‌మ్ మీన‌న్.. ముర‌ళీ శ‌ర్మ‌.. వెన్నెల కిషోర్.. ఇలా స‌హాయ పాత్ర‌లు చేసిన వాళ్లంద‌రూ ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక వ‌ర్గం:

ప్రేమ‌క‌థ‌ల‌కు సంగీతం.. ఛాయాగ్ర‌హ‌ణం అత్యంత కీల‌కం. ఈ రెండు విష‌యాల్లో సీతారామం టాప్ నాచ్ అనిపిస్తుంది. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ వీనుల విందైన పాట‌లు.. హృద్య‌మైన నేప‌థ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. పీఎస్ వినోద్-శ్రేయ‌స్ కృష్ణ‌.. హ‌ను ఆలోచ‌న‌ల‌కు అంద‌మైన దృశ్య‌రూపం ఇచ్చారు. ప్రొడ‌క్ష‌న్ డిజైన్ కూడా చాలా బాగుంది. 60, 80 ద‌శ‌కాల్లోని వాతావ‌ర‌ణాన్ని చ‌క్క‌గా చూపించారు. ఎక్క‌డా తేడాగా అనిపించ‌లేదు. హ‌ను ట్రాక్ రికార్డు చూడ‌కుండా ఈ క‌థ‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చి రాజీ లేకుండా నిర్మించిన స్వ‌ప్న‌-ప్రియాంక‌ల‌ను అభినందించాలి. ఇక రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి.. ఈ ఒక్క సినిమాతో ఎన్నో మెట్లు ఎక్కేశాడు. ఇంత కాలం మ‌ణిర‌త్నంను అనుక‌రిస్తాడ‌ని.. స‌గం సినిమానే స‌రిగా తీస్తాడ‌ని.. ర‌క‌ర‌కాల కామెంట్లు ఎదుర్కొన్న హ‌ను.. ఈ చిత్రంతో వాట‌న్నింటినీ మ‌రిపించేశాడు. ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కుడిగా ఉత్త‌మ ప్ర‌తిభ చాటుతూ.. ఒక క్లాసిక్ ల‌వ్ స్టోరీని అందించాడు. రాత‌లో.. తీత‌లో అత‌ను ప‌డ్డ క‌ష్ట‌మంతా తెర‌పై క‌నిపిస్తుంది.


చివ‌రగా: సీతారామం.. ఆధునిక ప్రేమ‌కావ్యం

రేటింగ్ - 3/5