Begin typing your search above and press return to search.

అఫ్రీన్ సీన్ ని అందుకే తొల‌గించారా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 9:38 AM GMT
అఫ్రీన్ సీన్ ని అందుకే తొల‌గించారా?
X
దుల్క‌ర్ స‌ల్మాన్‌, మృణాల్ ఠాకూర్ జంటగా న‌టిచిన ఎపిక్ ల‌వ్ స్టోరీ 'సీతారామం'. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైజ‌యంతీ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వప్న సినిమా బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ నిర్మించిన మూవీ ఇది. 1964 లో సాగే పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ క‌థ‌గా ఈ మూవీని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. ఎమోష‌న‌ల్ కు గుర‌య్యేలా చేసింది.

నూర్జ‌హాన్ అనే ప్రిన్సెస్ సీతామ‌హాల‌క్ష్మి గా మారి లెఫ్టినెంట్ రామ్ కు ఉత్త‌రాలు రాయ‌డం.. ఫైన‌ల్ గా రామ్ రాసిన ఉత్త‌రాన్ని త‌న‌కు అందించ‌డానికి పాకిస్థాన్ కు చెందిన అఫ్రీన్ లండ‌న్ నుంచి ఇండియాకు తిరిగి రావ‌డం.. రామ్ కోసం వెత‌క‌డం.. సీతామ‌హాల‌క్ష్మి ఎవ‌ర‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌డం వంటి అంద‌మైన ఎపిక్ స్టోరీగా ఈ చిత్రాన్ని మ‌లిచిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది.

చిత్ర బృందంపై, న‌టీన‌టుల‌పై విమ‌ర్శ‌కులు, సినీ సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించేలా చేసింది. లెఫ్టినెంట్ రామ్ గా దుల్క‌ర్ న‌ట‌న‌, సీతార మ‌హాల‌క్ష్మిగా మృణాల్ ఠాకూర్ న‌ట‌న‌కు అంతా ఫిదా అయ్యారు.. ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ ఇద్ద‌రిని వెతికే పాత్ర‌లో అఫ్రీన్ గా ర‌ష్మిక మంద‌న్న న‌టించిన విష‌యం తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య ఆగ‌స్టు 5న విడుద‌లైన ఈ మూవీ భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుని తెలుగు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

రూ. 30 కోట్ల‌తో అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 80 కోట్లు వ‌సూల్ చేసి ఔరా అనిపించింది. రీసెంట్ గా ఈ మూవీని హిందీలోనూ విడుద‌ల చేశారు. అక్క‌డ కూడా ఈ మూవీ అనూహ్య విజ‌యాన్ని సొంతం చేసుకుంటూ మంచి వ‌సూళ్ల ద‌శ‌గా ప‌య‌నిస్తోంది.

ఈ నెల 9 నుంచి ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలో అఫ్రీన్ పాత్ర‌లో న‌టించిన ర‌ష్మిక మంద‌న్న‌కు సంబంధించి డెలిట్ చేసిన ఓ సీన్ ని చిత్ర బృందం తాజాగా బుధ‌వారం విడుద‌ల చేసింది.

నూర్జాహాన్ ప్యాలెస్ కి అఫ్రీన్ వెళ్లిన సంద‌ర్భంలో టాక్సీ లో బ్యాగ్ ని మ‌ర్చిపోవ‌డం.. వెళ్లి మ‌ళ్లీ క‌లెక్ట్ చేసుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌ని డెలిట్ చేసిన సీన్ లో చూపించారు. ట్యాక్సీ డ్రైవ‌ర్ గా 'పెళ్లి చూపులు' ఫేమ్ అభ‌య్ న‌టించాడు. నిమిషం పాటు సాగే ఈ సీన్ కాంట్ర‌వ‌ర్సీ అవుతుంద‌నే కార‌ణంగా చిత్ర బృందం తొల‌గించిన‌ట్టుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.