Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'శివలింగ'

By:  Tupaki Desk   |   15 April 2017 10:54 AM GMT
మూవీ రివ్యూ: శివలింగ
X
చిత్రం : ‘శివలింగ’

నటీనటులు: రాఘవ లారెన్స్ - రితికా సింగ్ - శక్తివేల్ వాసు - వడివేలు - ఊర్వశి - భాను ప్రియ - జయప్రకాష్ - జాకిర్ హుస్సేన్ - రాధారవి - సంతాన భారతి తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
మాటలు: శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత: రమేశ్ పిళ్లై
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పి.వాసు

హార్రర్ కామెడీలకు పెట్టింది పేరు రాఘవ లారెన్స్. అతడి దర్శకత్వంలో వచ్చిన ముని.. కాంచన.. గంగ మంచి విజయం సాధించాయి. ఇక సీనియర్ డైరెక్టర్ పి.వాసు కూడా ‘చంద్రముఖి’ లాంటి హార్రర్ కామెడీలకు పెట్టింది. పేరు వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన హార్రర్ కామెడీ థ్రిల్లర్ ‘శివలింగ’. ‘గురు’ కథానాయిక రితికా సింగ్ లారెన్స్ కు జోడీగా నటించింది ఇందులో. ఈ ‘శివలింగ’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రహీం (శక్తివేల్ వాసు) రైల్లో ప్రయాణిస్తుండగా.. హత్యకు గురవుతాడు. కానీ కోర్టు అది ఆత్మహత్యగా నిర్ధరిస్తూ కేసును కొట్టేస్తుంది. ఐతే రహీం ప్రేయసి తనకు పరిచయమున్న ఓ ఉన్నతాధికారిని కలిసి ఈ కేసును రీఓపెన్ చేయమంటుంది. ఆమె కోరిక మేరకు రహస్యంగా ఈ కేసును సీబీ సీఐడీకి అప్పగిస్తాడు ఆ ఉన్నతాధికారి. ఈ కేసును సీఐడీలో మంచి పేరున్న శివలింగ (లారెన్స్) టేకప్ చేస్తాడు. అదే సమయంలో అతడికి సత్య (రితికా సింగ్)తో పెళ్లవుతుంది. ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే రితికా చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. కొన్నాళ్ల తర్వాత రహీం ఆత్మే రితికను ఆవహించాడని శివలింగకు తెలుస్తుంది. ఇంతకీ రహీం ఆత్మ.. సత్యను ఎందుకు ఆవహించింది.. అతడికి ఆమెకు సంబంధమేంటి.. ఇంతకీ రహీంను చంపిందెవరో తెలుసుకుని ఈ కేసును శివలింగ ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘శివలింగ’లో ఒక సీన్లో హీరోయిన్ డిస్టర్బ్డ్ గా ఉందని.. ఆమెను తీసుకెళ్లి విదేశాలు చుట్టిరమ్మని హీరోకు వడివేలు సలహా ఇస్తాడు. ఆ వెంటనే లారెన్స్.. రితికా కలిసి ఫారిన్లో ఒక సాంగ్ వేసుకుంటారు. ఆ పాట అయ్యేసరికి సినిమాలో కీలక పాత్రధారి అయిన పావురం వచ్చి లారెన్స్ మీద ఒక రక్తపు చుక్క చల్లి వెళ్తుంది. సీఐడీ ఆఫీసర్ అయిన లారెన్స్ దాని ఆధారంగానే తాను డీల్ చేస్తున్న కేసును పరిష్కరిస్తాడు. హీరో హీరోయిన్లు ఫారిన్లో సాంగ్ వేసుకుంటే ఆ పాట చివర్లో ఇలాంటి కీలకమైన సీన్ పెట్టడమేంటో అర్థం కాదు. ‘శివలింగ’లో పి.వాసు నరేషన్ స్టయిల్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ‘శివలింగ’ ఎంత మాస్ ను దృష్టిలో ఉంచుకుని తీసిన సినిమా అయినా.. మరీ ఇంత సిల్లీగా సినిమాను నడిపించడం టూమచ్.

పి.వాసు ‘చంద్రముఖి’ లాంటి బ్లాక్ బస్టర్ హార్రర్ కామెడీ తీసి ఉండొచ్చు. ఐతే అది ఆయన సొంత కథ కాదని గుర్తు పెట్టుకోవాలి. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉండటం.. అప్పటికి హార్రర్ కామెడీ అనేది చాలా కొత్త కావడం వల్ల ఆ సినిమా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. ఐతే ఇప్పుడు పి.వాసు తాను సొంతంగా తయారు చేసుకున్న కథతో ‘శివలింగ’ తెరకెక్కించాడు. గత కొన్నేళ్లలో మనం ఎన్ని హార్రర్ కామెడీలు చూశామో లెక్క లేదు. ఇప్పుడు వాసు మళ్లీ అదే హార్రర్ కామెడీని వడ్డించాడు. పైగా తన ‘ఓల్డ్’ స్టయిల్లో. కాకపోతే ఇందులోని సస్పెన్స్ ఫ్యాక్టర్ మాత్రం ఆసక్తి రేకెత్తిస్తుంది. అసలేం జరిగిందన్న విషయాన్ని చివరికి దాచిపెట్టి.. చివర్లో ప్రేక్షకుల్ని కొంత వరకు థ్రిల్ చేయడంలో పి.వాసు సక్సెస్ అయ్యాడు. ఐతే ఈ చివరి అరగంట కోసం అంతకుముందు రెండు గంటల పాటు ‘శివలింగ’ను భరించడమే కష్టమవుతుంది.

‘శివలింగ’లో లారెన్స్ సీఐడీ ఆఫీసర్ పాత్ర పోషించాడు. అయినప్పటికీ దయ్యం పేరెత్తితే మాత్రం అతను వణికి చచ్చిపోతుంటాడు. ‘కాంచన’ సిరీస్ లో లారెన్స్ దయ్యం భయంతో కామెడీ బాగా పండించాడని.. సీఐడీ ఆఫీసర్ పాత్ర చేసినప్పటికీ ఆ భయాన్ని అలాగే కొనసాగించారు. ఐతే కాంచన సిరీస్ తోనే ఈ కామెడీ మొహం మొత్తేసింది. ఇక ‘శివలింగ’లో లారెన్స్ కొత్తగా చేసిందేమీ లేదు. లారెన్స్ చాలదని వడివేలును కూడా తీసుకొచ్చారు. అతడి కామెడీ కూడా కొత్తగా ఏమీ అనిపించదు. మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని తీర్చిదిద్దిన కామెడీ.. రాసిన డైలాగులు మరీ లౌడ్ గా ఉండి ఇబ్బంది పెడతాయి. సినిమాలో జెన్యూన్ లాఫ్స్ అంటూ ఏమీ ఉండవు. ఇక సీఐడీ ఆఫీసర్ అంటూ లారెన్స్ పాత్రకు ఇచ్చే బిల్డప్పులు.. అతడి విన్యాసాలు.. ఫైట్లు.. పాటలు.. డ్యాన్సుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ దశ వరకు సినిమాను నడిపించిన తీరు చూస్తుంటే 30 ఏళ్లు వెనక్కి ప్రయాణించి.. అప్పటి సినిమా చూస్తున్న భావన కలుగుతుంది.

డైరెక్టర్ వాసు కొడుకు శక్తివేల్ వాసు చేసిన రహీం పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కొంత వరకు మెప్పిస్తుంది. మరీ రొటీన్ గా సాగిపోతూ విసిగించే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కొంత ఉపశమనాన్నిస్తుంది. తన కొడుక్కి కీలకమైన పాత్ర ఇచ్చిన వాసు.. దాన్ని బాగానే తీర్చిదిద్దాడు. ప్రథమార్ధంలో మరీ విసిగించే ‘శివలింగ’ ద్వితీయార్ధంలో కొంత వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. కథలోని ప్రధాన విషయమంతా ద్వితీయార్ధంలోనే ఉంటుంది. సస్పెన్స్ ఫ్యాక్టర్ ను మరీ చివరి దాకా దాచి పెట్టి అప్పటిదాకా సినిమాను నడిపించడానికి వాసు ఇబ్బంది పడ్డప్పటికీ.. అసలు రహస్యం ఏంటో తెలిసే ఎపిసోడ్ ను బాగానే నడిపించాడు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తుంది.

ఐతే ప్రేక్షకులు ఉత్కంఠతో చూస్తున్న సమయంలో కూడా మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని ఓ పిచ్చి ఫైట్ పెట్టడం విడ్డూరంగా అనిపిస్తుంది. అంతకుముందు శివలింగా.. శివలింగా అంటూ హీరోను మోస్తూ పెట్టిన పాట కూడా అర్థరహితంగా అనిపిస్తుంది. సినిమాలో చాలా చోట్ల తమిళ వాసనలు గుప్పున కొడతాయి. ఓవరాల్ గా చూస్తే ‘శివలింగ’ పూర్తిగా మాస్ ప్రేక్షకుల్ని తయారైన హార్రర్ కామెడీ థ్రిల్లర్. ఐతే ఈ సినిమా థ్రిల్ చేయడంలో సక్సెస్ అయింది కానీ.. హార్రర్.. కామెడీ మాత్రం తేలిపోయాయి. లారెన్స్ పెర్ఫామెన్స్.. అతడి డ్యాన్సులు.. ఫైట్లు.. కామెడీ బి-సి సెంటర్ల ప్రేక్షకులకు కనెక్టవ్వచ్చు కానీ.. సగటు ప్రేక్షకుడిని మాత్రం ‘శివలింగ’ చాలా వరకు విసిగిస్తుంది.

నటీనటులు:

లారెన్స్ కొత్తగా చేసిందేమీ లేదు. ఇందులో చేసింది సీఐడీ ఆఫీసర్ పాత్రే అయినా.. అందుకు తగ్గట్లు చేయలేదు లారెన్స్. ‘కాంచన’ సిరీస్ లో హీరో పాత్రకు కొనసాగింపులా ఉంటుందిది. ఎప్పట్లాగే ‘అతి’గా చేశాడు లారెన్స్. అతడి డ్యాన్సులు.. ఫైట్లు మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవచ్చు. ‘గురు’లో రితికాను చూసి.. ఇందులో చూస్తే షాకవుతాం. పూర్తి భిన్నంగా కనిపించింది. దయ్యం పట్టిన సన్నివేశాల్లో బాగానే చేసింది కానీ.. ఆమెకు అతిగా మేకప్ వేసి చెడగొట్టారు. ఈ సినిమా చేయడానికి ముందు ‘చంద్రముఖి’ చూసిందో ఏమో.. కొంతవరకు జ్యోతికను అనుకరించే ప్రయత్నం చేసింది రితికా. శక్తివేల్ వాసు బాగా చేశాడు. అతడి నటన ఆకట్టుకుంటుంది. ఊర్వశి ఎప్పట్లాగే ఓవరాక్షన్ చేసింది. వడివేలు ‘చంద్రముఖి’లో పాత్రను గుర్తుకు తెచ్చాడు. ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించాడు. కానీ అతడి కామెడీలో ఎక్కువగా తమిళ టచ్ కనిపిస్తుంది. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

తమన్ పాటల్లో ఒక్కటంటే ఒక్కటీ ఆకట్టుకోదు. చాలా మొక్కుబడిగా చేసినట్లున్నాడు. పాటల్ని తమిళం నుంచి మక్కీకి మక్కీ దించినట్లున్నారు. నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు తగ్గట్లుగా బాగానే కుదిరింది. ఛాయాగ్రహణం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. రెగ్యులర్ హార్రర్ సినిమాల స్టయిల్లోనే సాగింది. ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఇందులోని కంప్యూటర్ గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్ట్స్ చాలా సాదాసీదాగా అనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ పి.వాసు విషయానికి వస్తే.. ఆయన ఎంచుకున్న కథలో కంటెంట్ లేకపోలేదు. కథలోని లీడ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. చిన్న చిన్న థ్రెడ్స్ ను కలిపి కథను బాగానే తయారు చేశారు. కానీ సమకూర్చిన స్క్రీన్ ప్లే.. ఓల్డ్ స్టయిల్ నరేషన్ నిరాశ పరుస్తాయి.

చివరగా: శివలింగ.. కొంచెం థ్రిల్ చేస్తాడు.. చాలా విసిగిస్తాడు

రేటింగ్- 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre