Begin typing your search above and press return to search.

యాక్టివ్ డైరెక్ట‌ర్స్ గిల్డ్ ముందు సిస‌లైన స‌వాల్‌!

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
యాక్టివ్ డైరెక్ట‌ర్స్ గిల్డ్ ముందు సిస‌లైన స‌వాల్‌!
X
కాలంతో పాటే మార్పు. కేవ‌లం ఈ ఐదేళ్ల‌లోనే టాలీవుడ్ లో ఎంతో మార్పు క‌నిపిస్తోంది. పాన్ వ‌ర‌ల్డ్ రేంజుకు ఎదిగేస్తోంది. ఈ టైమ్ లోనే యాక్టివ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ త‌ర‌హాలో డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ లోనూ స‌ప‌రేట్ గా యాక్టివ్‌ గిల్డ్ ఏర్పాటైన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌సంఘంలో యాక్టివ్ గా ఉన్న క్రియేటివ్ డైరెక్ట‌ర్స్ కొంద‌రు ఒకే గొడుగుకిందికి చేరి టాలీవుడ్ కంటెంట్ ని ఎన్ రిచ్ చేయ‌బోతున్నార‌ని టాక్ వినిపించింది.

పాపుల‌ర్ డైరెక్ట‌ర్లు ఉన్న యాక్టివ్‌ గిల్డ్ ఇత‌ర ప్ర‌తిభావంతులంద‌రినీ ఒకేతాటి పైకి తీసుకు వ‌చ్చేందుకు ఎస్.ఎస్.రాజమౌళి సారధ్యం వ‌హిస్తుండ‌గా మ‌రో న‌లుగురు సీనియ‌ర్ డైరెక్ట‌ర్లు బాధ్య‌త‌ల్ని షేర్ చేసుకుంటున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఇప్ప‌టికే ద‌ర్శ‌క‌సంఘం ఉనికిలోనే ఉన్నా.. యాక్టివ్ డైరెక్ట‌ర్స్ గిల్డ్ దేనికి? అని ప్ర‌శ్నిస్తే దానికి ప్ర‌త్యేక కార‌ణాలు ఉన్నాయి. అస‌లు టాలీవుడ్ లో క‌థ‌లు ఎలా ఉండాలి? సినిమాల‌ క్వాలిటీ ఎలా ఉండాలి? పాన్ ఇండియా లెవ‌ల్ కి కంటెంట్ ని ఎలా చేర్చాలి? దర్శకులు సమస్యల్ని ప‌రిష్క‌రించ‌డ‌మెలా? నిర్మాతలతో ద‌ర్శ‌కులు ఎలా మాట్లాడాలి? కొత్త‌ రైటర్స్ ని ఎలా రిక్రూట్ చేసుకోవాలి? అసిస్టెంట్ డైరెక్టర్ల సమస్యల్ని.. ర‌చ‌యిత‌ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌డ‌మెలా? ఇలా ర‌క‌ర‌కాల విష‌యాల‌పై లీడ్ తీసుకునేందుకు యాక్టివ్ డైరెక్టర్స్ గిల్డ్ ని ప్రారంభించారు.

ఇప్ప‌టికే ప‌లు స‌మ‌స్య‌ల‌పై రెండు మూడు సార్లు స‌మావేశాలు జ‌రిగాయి. యాక్టివ్ డైరెక్ట‌ర్స్ గిల్డ్ లో తొలి 21 మంది స‌భ్యుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. ఎస్.ఎస్.రాజమౌళి- వీవీ వినాయక్ - త్రివిక్రమ్ శ్రీ‌నివాస్- కొరటాల శివ- సుకుమార్- శేఖ‌ర్ క‌మ్ముల -బోయ‌పాటి శ్రీ‌ను- క్రిష్ - హ‌రీష్ శంక‌ర్- వంశీ పైడిప‌ల్లి- చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి- మారుతి- అనీల్ రావిపూడి- చందు మొండేటి- సందీప్ రెడ్డి వంగా- ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ‌- నాగ్ అశ్విన్- నందిని రెడ్డి- శివా నిర్వాణ వేణు- శ్రీ‌రామ్- త‌రుణ్ భాస్క‌ర్ .. జాబితాలో ఉన్నారు.

సీనియ‌ర్లు అయిన తొలి ఐదుగురు యాక్టివ్ ద‌ర్శ‌కులు 21 మందితో కూడిన‌ సంఘంలో ఎవ‌రెవ‌రు ఉండాలి? అన్న‌ది చ‌ర్చించారు. మిగిలిన 16 మంది ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేసిన‌ది వీళ్లే. యాక్టివ్ గిల్డ్ స‌భ్యులంతా ఏర్పాటు చేసిన స‌మావేశంలో ర‌కర‌కాల స‌మ‌స్య‌ల‌పై ఇంత‌కుముందే చ‌ర్చించారు. ఈ మీటింగులో ఒక్కొక్క‌రూ ఒక్కో పాయింట్ చెప్పి స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించాలి? అన్న‌ది ఆలోచించారు. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే కొత్త ద‌ర్శ‌కులు.. అసిస్టెంట్ డైరెక్ట‌ర్ల‌పై వీరంతా క‌లిసి నిర్ణ‌యం తీసుకుంటారు. ర‌చ‌యిత‌ల‌తో త‌లెత్తే స‌మ‌స్య‌ల‌పైనా చ‌ర్చిస్తారు. వారి సామర్థ్యానికి సంబంధించిన విష‌యాల్ని స‌మీక‌రిస్తారు. అలాగే అసిస్టెంట్ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఒక స‌ప‌రేట్ గ్రూప్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.

కానీ ఎందుక‌నో ఇటీవ‌ల ఈ సంఘం యాక్టివిటీస్ ప‌రంగా స్లోగా ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. టాప్ డైరెక్ట‌ర్లంతా బిజీ అయిపోవ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే ఇటీవ‌ల‌ పాన్ ఇండియా రేంజుకు టాలీవుడ్ ఎదిగేసింది. బాలీవుడ్ టాలీవుడ్ అనే తార‌త‌మ్యం ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మునుముందు మ‌న‌వాళ్లు దీనిని కొన‌సాగించాలంటే నేటిత‌రానికి శిక్ష‌ణ అవ‌స‌రం. ఈ విషయంలో జ‌క్క‌న్న అండ్ టీమ్ దృష్టి సారించాల్సి ఉంటుంద‌ని సూచిస్తున్నారు. పోటీలోకి యువ‌త‌రం కూడా దూసుకొస్తే టాలీవుడ్ కూడా హాలీవుడ్ రేంజుకు చేరుతుంద‌న‌డంలో సందేహం లేదు. తెలుగు సినిమా కంటెంట్ ని ఎన్ రిచ్ చేయ‌డం.. మారుతున్న సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం వ‌గైరా అంశాల‌లో రాజ‌మౌళి ఇత‌రులు త‌మ నాలెజ్ ని ఇత‌రుల‌కు బ‌దిలీ చేయాల్సి ఉంటుంది. ప్ర‌పంచ వ్యాప్త మార్కెట్ల‌ను కొల్ల‌గొట్ట‌డ‌మే ధ్యేయంగా స‌మావేశాల్ని నిర్వ‌హించి స‌క్సెస్ అందుకుంటార‌ని ఆశిద్దాం.