Begin typing your search above and press return to search.

ఎస్.జె.సూర్య మామూలోడు కాదండోయ్..

By:  Tupaki Desk   |   28 Sep 2017 7:50 AM GMT
ఎస్.జె.సూర్య మామూలోడు కాదండోయ్..
X
‘స్పైడర్’ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ అనగానే చాలామంది తెలుగు ప్రేక్షకులు పెదవి విరిచారు. మహేష్ లాంటి సూపర్ స్టార్‌ కు పోటీగా యాక్టింగ్ బ్యాగ్రౌండ్ లేని.. ఓ దర్శకుడిని విలన్ గా పెట్టడమేంటి అని సందేహించారు. వేరే విలనే దొరకలేదా అన్న వాళ్లూ లేకపోలేదు. కానీ మురుగదాస్ ఏరి కోరి సూర్యనే ఎందుకు విలన్ పాత్రకు ఎంచుకున్నాడన్నది ‘స్పైడర్’ చూశాక కానీ అర్థం కాలేదు. ఆ సైకో విలన్ పాత్రను సూర్య కాకుండా ఇంకెవరైనా అంత బాగా చేయగలిగేవారా అంటే సందేహమే. జనాలు తమ వాళ్లను కోల్పోయి రోదిస్తుంటే.. అందులోనే ఆనందాన్ని వెతుక్కునే సైకోగా సూర్య అభినయానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ముఖ్యంగా సూర్యను తొలిసారి తెరమీద చూపించే సీన్లో అతను చెలరేగిపోయాడు. తమ వాళ్లను పోగొట్టుకున్న వాళ్లు బోరున ఏడుస్తుంటే.. ఆ ఏడుపుల్ని ఆస్వాదిస్తున్నట్లుగా అతడిచ్చిన హావభావాలు అదిరిపోయాయి. ఈ సన్నివేశానికి థియేటర్లలో మామూలు రెస్పాన్స్ రావట్లేదు. కేవలం హావభావాలు మాత్రమే కాదు.. తన లుక్.. బాడీ లాంగ్వేజ్ విషయంలో సూర్య చూపించిన శ్రద్ధ కూడా మెచ్చుకోదగ్గది. ఈ పాత్ర విషయంలో మురుగదాస్ కూడా అభినందనీయుడు. మన వాళ్లకు సూర్య పెర్ఫామెన్స్ ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. తమిళ ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ లేకపోవచ్చు. ఎందుకంటే అతన ఇప్పటికే తమిళంలో నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. గత ఏడాది ‘ఇరైవి’ అనే సినిమాలో సూర్య అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాతే సూర్య నటుడిగా బిజీ అయిపోయాడు. వచ్చే నెలలో విడుదలయ్యే విజయ్ సినిమా ‘మెర్శల్’లోనూ సూర్యానే విలన్ కావడం విశేషం.