Begin typing your search above and press return to search.

క‌రోనాతో మృతి చెందిన మెగా ఫ్యాన్స్ కుటుంబాల‌కు చిరు ఆర్థిక సాయం

By:  Tupaki Desk   |   20 May 2021 4:30 PM GMT
క‌రోనాతో మృతి చెందిన మెగా ఫ్యాన్స్ కుటుంబాల‌కు చిరు ఆర్థిక సాయం
X
ఇటీవ‌లే మెగా వీరాభిమాని క‌డ‌ప ర‌వి క‌రోనాకు చికిత్స పొందుతూ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కోన‌సీమ‌కు చెందిన మ‌రో వీరాభిమాని మ‌ర‌ణం చిరును తీవ్ర క‌ల‌త‌కు గురి చేసింది. వివ‌రాల్లోకి వెళితే..

మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో కోన‌సీమ ఐబ్యాంక్ ప్రారంభించిన మెగా వీరాభిమాని యర్రా నాగ‌బాబు క‌రోనాతో పోరాడి మృతి చెందారు. ఆయ‌న తూ.గో జిల్లా వాసి. మ‌ల్టీ ఆర్గాన్ ఫౌండేష‌న్ ని ప్రారంభించి ఎంద‌రో అవ‌స‌రార్థుల‌కు అవ‌య‌వ దానం ప‌రంగా సాయం అందించారు. నాగ‌బాబు ఊహించ‌ని మ‌ర‌ణం షాక్ కి గురి చేసిందంటూ మెగాస్టార్ చిరంజీవి తీవ్ర‌ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

చిరంజీవి మాట్లాడుతూ-``య‌ర్రా నాగ‌బాబు నా వీరాభిమాని. అభిమానుల్లోనే గ‌ర్వ‌కార‌ణ‌మైన అభిమాని నాగ‌బాబు. ఎన్నో మంచి సామాజిక కార్య‌క్ర‌మాల‌తో గ‌ర్వ‌కార‌ణ‌మ‌య్యాడు. నా ఐ బ్యాంక్ స్ఫూర్తితో తాను కూడా కోన‌సీమ‌ ఐబ్యాంక్ ప్రారంభించి ఎంద‌రికో కంటి చూపునిచ్చాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అత‌డు కాకినాడ ల‌క్ష్మీ ఆస్ప‌త్రిలో కరోనాకి చికిత్స పొందుతూ పోరాడి ఓడిపోయాడు. మృతి చెందారు. ఇది చాలా బాధాక‌రం. కొద్దిరోజుల క్రితం ఆయ‌న‌తో మాట్లాడితే భరోసాగా మాట్లాడాడు. కోలుకుంటున్నాను చికిత్స బావుంది అని అన్నారు. డాక్ట‌ర్లు భ‌రోసానిచ్చారు. కానీ అనుకోకుండానే ఆయ‌న‌ను పోగొట్టుకున్నాను. వారి కుటుంబ స‌భ్యుల‌కు మాన‌సిక స్త్వైర్యాన్నివ్వాల‌ని భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను. సారీ నాగ‌బాబు.. ఐ మిస్ యు!`` అని అన్నారు.

ఇటీవ‌ల క‌డ‌ప రవి మ‌ర‌ణానంత‌రం అత‌డి కుమార్తె పేరిట 3ల‌క్ష‌లు బ్యాంక్ డిపాజిట్ చేసి చిరంజీవి ఆదుకున్నారు. ప‌రిశ్ర‌మ‌లోనూ ఆర్టిస్టుల‌ను క‌ష్టంలో ఆదుకునేందుకు 15ల‌క్ష‌ల మేర విరాళాల తో చెక్ ల‌ను సిద్ధం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ష్టంలో ఉన్న న‌టి పావ‌ల శ్యామ‌ల‌ను రెండు ప‌ర్యాయాలు చిరు ఆదుకున్నారు. ఇంత‌కుముందు 2ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేసిన ఆయ‌న క‌రోనా క్రైసిస్ లోనూ మ‌రో ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక సాయం చేసి శ్యామ‌ల‌కు ఆర్టిస్టుల సంఘం త‌ర‌పున ఫించ‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఆక్సిజ‌న్ అంద‌క మృతి చెందుతున్న వారిని చూసి చ‌లించిన చిరు త‌న వార‌సుడు చ‌ర‌ణ్ తో క‌లిసి త్వ‌ర‌లోనే ఆక్సిజ‌న్ బ్యాంక్ ని స్థాపించ‌నున్నారు.